భారతీయ జనతా పార్టీలో ఆంధ్రప్రదేశ్ నాయకులు అనేకమంది ఇప్పుడు పెద్ద అంతర్మధనంలో పడ్డారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత, వారిలో కొత్త ఆలోచనలు మొదలవుతున్నాయి. ప్రజలు ఒకవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఛీత్కరిస్తుండగా.. తమ పార్టీలోని రాష్ట్ర నాయకత్వంలో కొందరు ఆ పార్టీతో కుమ్మక్కు అయినట్లుగా ప్రవర్తిస్తుండడం వారికి మింగుడు పడడం లేదు. ఇలాంటి వైఖరి వల్లనే తమ పార్టీ పట్టభద్ర ఎన్నికలలో అత్యంత దారుణమైన ఓటింగ్ శాతాన్ని నమోదు చేసే దుస్థితి ఏర్పడిందని వారు అనుకుంటున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే అసలు ఏనాటికైనా సరే భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు ఉంటుందా.. అనే భయం వారిని వెన్నాడుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టి తమ దారి తాము చూసుకునే ఆలోచనలో కొందరు నాయకులు ఉండటం విశేషం
పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కొందరి వైఖరిలో మార్పు రాకపోవడం.. తామందరికీ ఆత్మహత్యా సదృశం అవుతుందని.. చాలామంది భయపడుతున్నారు. వీరిలో కొందరు తెలుగుదేశంలో చేరడానికి, మరికొందరు జనసేన పార్టీలో చేరడానికి తమ తమ స్థానిక నియోజకవర్గ సమీకరణాలను బట్టి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
కన్నా లక్ష్మీనారాయణ ఆల్రెడీ తెలుగుదేశం లో చేరిన సంగతి తెలిసిందే. ఇంకా చాలామంది బిజెపి నాయకులు తనతో టచ్ లో ఉన్నారని, పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పలుమార్లు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, కన్నా లక్ష్మీనారాయణ తో భేటీ కావడం ద్వారా తాను పార్టీ మారగల సంకేతాలను ప్రజల్లోకి పంపారు. చాలా కాలంగా పార్టీలో సైలెంట్ గా ఉన్న కామినేని శ్రీనివాస్ వంటి సీనియర్ నాయకులు కూడా పార్టీ మారే అవకాశం ఉంది. అయితే సోము వీర్రాజు వైఖరి, ఒంటెద్దు పోకడలతో విసిగిపోయిన అనేక మంది నాయకులు ఇటీవల ఢిల్లీ వెళ్లి అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే వారి వేడికోళ్లను అధిష్టానం పట్టించుకోలేదు. వారందరూ బిజెపిలో దశాబ్దాలుగా సీనియారిటీ ఉన్న నాయకులే అయినప్పటికీ.. ఇప్పుడు ఇతర పార్టీలకు వెళ్లే ఆలోచన చేస్తుండడం గమనార్హం.
‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు ’ అనే ఉద్దేశంతో జనసేన పవన్ కళ్యాణ్, తెలుగుదేశంతో పెట్టుకుంటున్నారు. అయితే తాము మాత్రం వైసీపీ టీడీపీలకు సమాన దూరం అనే నినాదంతో ఒంటరిగా పోటీ చేయడం తెలివి తక్కువ పని అని ఆ పార్టీ నాయకులే అనుకుంటున్నారు. 2014 తరహాలో పొత్తులు పెట్టుకుంటే కనీసం కొన్ని స్థానాల్లో అయినా తమ ప్రాతినిధ్యం ఉంటుంది కదా, పార్టీ బలపడుతుంది కదా అని ఆలోచిస్తున్నారు. పార్టీ శ్రేణుల ఆలోచనలను అధిష్టానం మన్నిస్తుందో, లేదా, వారంతా ఇతర పార్టీలను ఆశ్రయిస్తారో వేచి చూడాలి.