కాపు రిజర్వేషన్ల సాధనకై చావడానికైనా సిద్ధమని స్పష్టం చేస్తూ అందుకోసం సోమవారం నుండి ఆమరణ నిరాహారదీక్షకు మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య సిద్దపడటం ఏపీ రాజకీయాలలో మరోసారి కాపు సెంటిమెంట్ కీలకంగా మారే అవకాశాలను సూచిస్తున్నది. ఆయన పాలకొల్లులోని గాంధీ సెంటర్‌లో నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు తెలిపారు.
దీక్షకు అనుమతి కోరినా పోలీసులు ఇవ్వలేదని, దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించినా దీక్షను కొనసాగిస్తానని హరిరామజోగయ్య స్పష్టం చేశారు. ఈ విషయమై ముందుగానే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన అల్టిమేటం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో దీక్షకు ఉపక్రమిస్తున్నారు.
కాపులపై సీఎం జగన్‌కు ఏమాత్రం ప్రేమ లేదని, కాపులు ఆర్థికంగా ఎదగడం ఆయనకు ఇష్టం లేదని అంటూ ఆయన ఈ సందర్భంగా చేసిన విమర్శలు కాపులలో జగన్ ప్రభుత్వం పట్ల పెరుగుతున్న ఆగ్రవేశాలను వెల్లడి చేస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సమయంలో వై ఎస్ జగన్ కు పరోక్షంగా మద్దతు ఇస్తూ, కాపు రిజర్వేషన్ లపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వచ్చిన ప్రముఖ కాపు నాయకుడు జగన్ ప్రభుత్వంలో ఈ విషయమై దాదాపు మౌనం వహిస్తూ వచ్చారు.
కేంద్రం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించగా అందులో 5 శాతం కాపులకు ఇవ్వడానికి చంద్రబాబు హయాంలో ప్రయత్నించారు. బిల్లు గవర్నర్ ఆమోదం పొందే సమయానికి జగన్ అధికారంలోకి రావడంతో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు దక్కకుండా పోయింది. దాని కేంద్రం అనుమతి అవసరం అంటూ, విషయం న్యాయస్థానంలో ఉన్నదంటూ జగన్ కాలయాపన చేస్తూ వస్తున్నారు.
అయితే, తాజాగా పార్లమెంట్ సాక్షిగా కాపు రిజర్వేషన్ ల అమలుకు ఎటువంటి అడ్డంకులు లేవని, రాష్ట్ర ప్రభుత్వం అమలు జరుపవచ్చని కేంద్రం స్పష్టం చేయడంతో తిరిగి ఈ విషయమై రాజకీయంగా వేడి రాజుకొంటున్నది. హరిరామజోగయ్య ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం కావడంతో వారం వ్యవధిలో వాటిని అమలు పరచమని కోరుతూ ముద్రగడ జగన్ కు రెండు లేఖలు వ్రాసారు.
అయితే, రిజర్వేషన్ అంశమై జగన్ గాని, ఆయన మంత్రివర్గ సహచరులు గాని స్పందించక పోవడంతో కాపులలో అసహనం చెలరేగుతుంది. జగన్ మంత్రివర్గంలో ఐదుగురు కాపులు ఉన్నారు. వారు కూడా నోరు విప్పడం లేదు. రాష్ట్రంలో దాదాపు ప్రతి ఎన్నికలో కాపు సెంటిమెంట్ నిర్ణయాత్మక శక్తిగా మారడం ఈ సందర్భంగా గమనార్హం.
వంగవీటి మోహన రంగా హత్య కారణంగా మొదటిసారి చెలరేగిన కాపు సెంటిమెంట్ 1989లో ఎన్టీ రామారావు ప్రభుత్వం ఓటమికి దారితీసింది. ఆ తర్వాత కాపుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏమీ పట్టించుకోక పోవడంతో 1994 ఎన్నికలలో ఆ పార్టీ ఘోరంగా ఓటమి చెందింది.
2004లో చంద్రబాబు ప్రభుత్వం పట్ల కాపులలో పెరిగిన అసంతృప్తి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు దారితీసింది. 2009 ఎన్నికలలో చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీ పట్ల కాపులు ఆకర్షితులు కావడం జరిగింది. వారు కాంగ్రెస్ కు దూరమైనా, టీడీపీకి మద్దతు ఇవ్వకపోవడంతో బొటాబొటి ఆధిక్యతతో తిరిగి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఏర్పాడగలిగింది.
2014లో తిరిగి చంద్రబాబు గెలుపొందడానికి సహితం కాపులు సహకరించారు. కానీ కాపు రిజర్వేషన్ బిల్లు శాసనసభ ఆమోదం పొందినా అమలుకు నోచుకోలేక పోవడంతొ 2019లో కాపులు జగన్ కు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు తిరిగి ఆ కాపులే జగన్ కు వ్యతిరేకంగా సమీకృతం అవుతున్నారు.