ఏపీలో దిక్కు తోచని స్థితిలో బీజేపీ

Sunday, December 22, 2024

ఒకవంక వైసిపి ప్రభుత్వం అవినీతిమయం అంటూ విమర్శలు గుప్పిస్తుంటారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ఛార్జ్ షీట్ లను తయారు చేస్తున్నామంటారు. మరోవంక ఏదేమైనా ఏపీలో టీడీపీ అధికారంలోకి రాకూడదని పార్టీ అధినేతలు పట్టుదల చూపుతుంటారు. బిజెపికి నోటా కన్నా తక్కువ ఓట్లు ఉన్నాయని తెలుసు.

రాష్ట్రంలో ఒక్క సీట్ కూడా సొంతంగా గెలుపొందలేమని నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకె చెప్పానని ఆ పార్టీ మాజీ శాసనసభాపక్ష నేత విష్ణు కుమార్ రాజు వెల్లడించారు. అయితే ఓట్లు పెంచుకునేందుకు క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లే ప్రయత్నం మాత్రం చేయరు. మరో ఏడాదిలో ఎన్నికలు  ఉండగా, జనసేనతో కలిసి అధికారంలోకి వస్తున్నామంటారు. కానీ ఆ పార్టీతో కలిసి ఒక్క కార్యక్రమం కూడా చేసిన దాఖలాలు లేవు. 

మిత్రపక్షం జనసేనతో కలిసి వేదిక పెంచుకోక పోయినా కనీసం మీడియా సమావేశాలు కూడా జరిపే ప్రయత్నం చేయరు.  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు ఢిల్లీ వెళ్లి, ఆ పార్టీ అధినేతలను కలుస్తుంటారు. కానీ కేంద్ర నాయకులు రాష్ట్ర పర్యటనకు వచ్చిన్నప్పుడు ఎక్కడా పవన్ కళ్యాణ్ ను కలిసే ప్రయత్నమే చేయరు.

కర్ణాటక ఎన్నికలలో పరాజయం అనంతరం టిడిపితో కలిసి ఉమ్మడిగా పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారని, ఆ విషయాన్నీ పార్టీ కేంద్ర నాయకత్వం చూసుకొంటుందని మాత్రం ఏపీ బిజెపి నేతలు చెబుతున్నారు. మొన్నటివరకు `కుటుంభం పార్టీలు’తో పొత్తేమిటి అంటూ మీడియాపైననే విసుగు ప్రదర్శించిన నేతలలో ఇప్పుడు అటువంటి ధోరణి కనబడటం లేదు.

తాజాగా గన్నవరం దగ్గర జరిగిన బిజెపి రాష్త్ర కార్యవర్గ సమావేశంలో 2024 ఎన్నికల గురించి పార్టీ వ్యూహం గురించి లోతయిన చర్చలు ఏవీ జరిగిన్నట్లు లేవు. కనీసం తాము తయారు చేస్తున్నామంటున్న ఛార్జ్ షీట్ లలో వెలుగులోకి వచ్చిన ప్రభుత్వ అవినీతిపై పోరాటాలు జరిపే ప్రసక్తి కూడా లేదు.  చూస్తుంటే ఏపీలో బిజెపి ఎటు వెళ్లాలో, ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు స్పష్టం అవుతుంది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల ప్రజలలో ప్రతికూలత పెరుగుతూ ఉండడంతో మీడియా సమావేశాలలో బిజెపి నేతలు కూడా విమర్శలు చేస్తున్నా ఢిల్లీలో మాత్రం బిజెపి పెద్దలు మాత్రం ఏపీ బిజెపి నేతలకన్నా వైఎస్ జగన్ కె ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం అవుతుంది. జగన్ ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడేందుకు కంకణబద్దులైన్నట్లు స్పష్టం అవుతుంది.

తాజాగా ఢిల్లీ ప్రభుత్వ అధికారాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్డినెన్సు ను పార్లమెంట్ లో వ్యతిరేకించాలని ప్రతిపక్షాలు సమాయత్తం అవుతున్నాయి. దానితో ఈ ఆర్డినెన్సు రాజ్యసభలో ఆమోదం పొందాలని బిజెపికి వైసిపి, బిజెడి  సభ్యుల మద్దతు కీలకం కానుంది. ఈ రెండు పార్టీలు తమ తమ రాస్త్రాలలో బిజెపిని వ్యతిరేకిస్తున్నా పార్లమెంట్ లో ఎప్పుడూ బిజెపికి వ్యతిరేకంగా ఓట్లు వేసిన దాఖలాలు లేవు.

మొదటి నుండి బీజేపీ-వైసీపీల మధ్య అప్రకటిత మైత్రి కొనసాగుతుంది. 2019లో అనూహ్య విజయం సాధించడంలో వైసీపీకి లోపాయికారిగా బిజెపి తిరుగులేని సహకారం అందించింది. మరోవంక, రహస్యమే. కేంద్రంలో బీజేపీకి ఏ అవసరం వచ్చినా వారు అడగకుండానే జగన్ ప్రభుత్వం మద్దతు తెలిపేది. అదేవిధంగా వైసీపీ అవసరాలకు తగ్గట్లు కేంద్రం కూడా రాష్ట్రానికి సంభంధించిన కొన్ని ఆర్ధిక పరమైన వ్యవహారాలను చూసీ చూడకుండా కేంద్ర ప్రభుత్వం వదిలివేస్తుంది. ఆర్ధిక క్రమశిక్షణ పాటించకపోయినా పట్టించుకోవడం లేదు.

ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి తర్వాత విజయవాడలో జరిగిన పార్టీ సమావేశంలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మట్లాడుతూ తాము వైసీపీ కలిసి ఉన్నామని ప్రజలు నమ్మబట్టే ప్రజలు తమకు ఓట్లు వేయలేదంటూ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయంగా దుమారాన్ని లేపాయి.

దానర్ధం ప్రజలు అధికార వైసీపీ పట్ల వ్యతిరేకత తో ఉన్నారన విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పినట్లయింది. అప్పటి నుండి తాము వైసిపి మద్దతుదారులం కాదని జనానికి నచ్చజెప్పేందుకు బిజెపి నాయకులు చేస్తున్న విఫల ప్రయత్నాలు పనిచేయడం లేదు.  గత ఐదేళ్లుగా ఏపీలో బిజెపిని బలోపేతం చేసేందుకు పార్టీ కేంద్ర నాయకత్వం కూడా ఆసక్తి చూపడం లేదు. వైఎస్ జగన్ ఉండగా రాష్ట్రంలో తమ పార్టీకి ఓట్లు లేకపోయినా ఫర్వాలేదులే అన్న ధోరణి వారిలో కనిపిస్తున్నది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles