ప్రస్తుతం నెలకొన్న ఆర్ధిక సమస్యలతో మరో ఏడాది పాటు నెట్టుకు రావడం కష్టమని గ్రహించడంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుగానే వచ్చే డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘర్, తెలంగాణ, మిజోరాంలతో పాటు ఏపీకి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ఢిల్లీలో బీజేపీకి పెద్దలతో అవగాహనకు వచ్చిన్నట్లు చెబుతున్నారు.
ప్రధానంగా ఏపీ ప్రజలలో ప్రధాని మోదీ పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొనడం, రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్ – మోదీల దోస్తీ పట్ల స్పష్టమైన అవగాహన పెంచుకోవడంతో 2024 లోక్ సభతో పాటు ఎన్నికలకు వెడితే మోదీ వ్యతిరేకత తనను కాటేయగలదని సీఎం జగన్ భావిస్తున్నట్లు వినికిడి. అదే సమయంలో టీడీపీ- జనసేన పొత్తు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చి, వారిద్దరూ ఉమ్మడిగా క్షేత్రస్థాయికి వెళ్లే, సీట్లు సర్దుబాటు చేసుకొనే వ్యవధి లేకుండా చేయాలనే ఎత్తుగడ కూడా ఉన్నట్లు కనిపిస్తున్నది.
ప్రధానంగా ప్రస్తుతం వైసిపి ప్రభుత్వం జరుపుతున్న ఆర్ధిక వ్యవహారాలను కాగ్, కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖల నుండి పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నా కేంద్ర ప్రభుత్వం చూసి, చూడన్నట్లు వ్యవహరిస్తున్నది. అవసరమైనప్పుడు పరిమితులను మించి రుణాలు తీసుకొనే వెసులుబాటు కలిగిస్తున్నది. అయితే 2024 నాటికి మోదీ కాస్తా గట్టిగా బిగిస్తే మాత్రం ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది.
డిసెంబర్ లో ఐదు అసెంబ్లీల ఎన్నికల అనంతరం బిజెపి తన రాజకీయ విధానాలను మార్చుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం టిడిపితో చేతులు కలిపేందుకు సిద్ధంగా లేకపోయినా అప్పుడు పరిస్థితులు ఏవిధంగా ఉంటాయో చెప్పలేము. అందుకనే, ఎట్టి పరిస్థితులలో టిడిపిని బిజెపి దగ్గరకు తీసుకొనే అవకాశాలు లేకుండా చూడాలని జగన్ భావిస్తున్నారు.
ఈ సందర్భంగా బిజెపి అగ్ర నాయకత్వానికి జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చిన్నట్లు చెబుతున్నారు. డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిపి, తిరిగి వైసిపి ఘన విజయం సాధిస్తే ఇక ఏపీలో టిడిపి అధ్యాయం ముగిసినట్లే అని, ఆ తర్వాత వైసిపి ఎన్డీయేలో ప్రవేశిస్తుందని భరోసా ఇస్తున్నారు. అంతేకాకుండా, లోక్ సభ ఎన్నికల్లో 8 నుండి 10 సీట్లను ఏపీలో బీజేపీకి ఇచ్చి, మిగిలిన సీట్లలోనే వైసిపి పోటీ చేస్తుందని కూడా ప్రతిపాదించారని తెలిసింది.
టిడిపి తిరిగి కోలుకోవడం ఏమాత్రం ఇష్టంలేని బిజెపి అగ్రనాయకత్వం ఈ ప్రతిపాదనకు సుముఖత వ్యక్తం చేసారని చెబుతున్నారు. గత ఆదివారం రాత్రి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసిన సమయంలో వైఎస్ జగన్ ఈ విషయమై స్పష్టత ఇచ్చారని తెలుస్తున్నది. దానితో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు తమ వంతు సహకారం అందించడానికి హామీ ఇచ్చారని వినికిడి.
ఇటీవల ఎమ్యెల్సీ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తం కావడం, క్షేత్రస్థాయిలో వైసిపి వర్గాలలోని అసంతృప్తులు, అసమ్మతి విస్తృతంగా నెలకొనడంతో ఇవన్నీ మరింతగా ముదరక ముందే ఎన్నికలకు వెళ్లేందుకు ఆలోచనలు చేస్తున్నారు. ఇక డిసెంబర్ లో ఎన్నికలు అంటే బీజేపీ పెద్దల చూపు ఎక్కువగా తెలంగాణా, ఇతర రాష్ట్రాల వైపు మాత్రమే ఉంటుందని, దానితో ఏపీలో తమ ఇష్టం వచ్చినట్లు ఎన్నికలు నిర్వహించుకోవచ్చని జగన్ ఆలోచనగా కనిపిస్తున్నది.