ఏపీలో ఆడవాళ్ల మిస్సింగ్ కు సహకరిస్తున్న గ్రామ వాలంటీర్లు!

Sunday, December 22, 2024

ఆంధ్ర ప్రదేశ్ లో గ్రామాలలో ఇటీవల తరచుగా వినవస్తున్న మహిళల మిస్సింగ్ కు గ్రామ వాలంటీర్ల సహకారం ఉందంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన సంచలన ఆరోపణలు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి.  2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే చేపట్టిన `వారాహి విజయ యాత్ర’ను ఆదివారం ఏలూరు నుండి ప్రారంభిస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రమైన దండయాత్ర చేశారు.

సీఎం జగన్‌పై తీవ్రమైన విమర్శలు గుప్పించడమే కాకూండా ఏపీలో వైస్సార్సీపీకి వచ్చే ఎన్నికలలో కీలకమైన సాధనసంపత్తిగా  భావిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ మీద ముప్పేట విమర్శలు గుప్పించారు. దేశంలోనే తీవ్రమైన సమస్యగా పరిణమించిన మహిళల అక్రమ రవాణాలో ఏపీ ట్రాక్ రికార్డు సహితం ఆందోళన కలిగిస్తున్నది. 

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాకా దాదాపు 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని వారిలో 12 నుంచి 14 వేల మందిని కాపాడామని పోలీసులు చెబుతున్నారని, కాపాడిన వారిని పక్కన పెడితే మిగిలిన వారి సంగతి ఏమిటని పవన్ కళ్యాణ్‌ ప్రశ్నించారు. వారి ఆచూకీ ఇప్పటి వరకు ఎందుకు తెలియలేదు? కారణం ఏమిటి?  అని నిలదీశారు.  ఏపీ ప్రభుత్వం కూడా దీని మీద ఇప్పటి వరకు సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదని అంటూ కనీసం సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి గాని, డిజిపి గాని సమీక్ష జరిపిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున మానవ అక్రమ రవాణా జరడానికి కారణం గ్రామ వాలంటీర్ల ద్వారా సేకరిస్తున్న సమాచారమేనని పవన్ కళ్యాణ్‌ ఆరోపించారు. వారు రహస్యంగా సేకరిస్తున్న సమాచారం అసాంఘిక వర్గాలకు చేరుతోందని కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయని తెలిపారు.

‘వైస్సార్సీపీ లో కొంతమంది కీలక నేతలు వాలంటీర్ వ్యవస్థని వాడుకొని, ప్రతీ ఇంటికి వెళ్లి ఎంత మంది కుటుంబ సభ్యులు ఉన్నారు? ఎంత మంది మహిళలు ఉన్నారు?” అనే సమాచారం సేకరించి, ఆ తర్వాత వాళ్ళని మాయం చేస్తున్నట్టుగా  కేంద్ర నిఘా వర్గాలు తన దృష్టికి తెచ్చిన్నట్లు ఆయన ఆరోపించారు.

అంటే, ఆయన ఉద్దేశ్యంలో వాలంటీర్లు సేకరించిన సమాచారంను వైస్సార్సీపీకి చెందిన కొందరు నాయకులు దుర్వినియోగం చేస్తున్నారనే అభిప్రాయం వెల్లడి అవుతుంది. ప్రాధమికంగా ఈ విధంగా వ్యక్తిగత వివరాలను ఇతరులకు అందించడం ద్వారా వాలంటీర్లు నేరానికి పాల్పడిన్నట్లే అవుతుంది. ఈ మిస్సింగ్‌ల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని పవన్ ఆరోపించారు.

కాగా, ముఖ్యమంత్రి పదవికి జగన్‌ అర్హుడు కాదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.  సీఎం జగన్‌ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం లోపాలను కాగ్‌ నివేదిక ఎత్తిచూపిందని గుర్తు చేశారు. వైసీపీ నాయకులు తన కుటుంబం గురించి, తన బిడ్డల గురించి నీచంగా మాట్లాడుతున్నారని అంటూ ఎంత దిగజారుడుతనంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles