ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు ఊబిలో మంత్రి పెద్దిరెడ్డి!

Friday, November 15, 2024

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో అన్ని విధాలుగా అత్యంత బలవంతుడైన మంత్రిగా పేరొందడంతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో టిడిపి ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తూ వస్తున్న డా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ఊబిలో చిక్కుకున్నారు. ఆయనపై ఈ విషయమై కేసు నమోదు చేసే విషయం కోర్టు పరిశీలనలో ఉంది.

మంత్రి దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, పోలీసుల అధీనంలో ఉన్న తన ఎక్స్‌రే నివేదికను చోరీ చేశారని సస్పెన్షన్‌లో ఉన్న జడ్జి రామకృష్ణ చేసిన ఫిర్యాదుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలా? లేదా? అనే అంశంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చిత్తూరులోని మొదటి అదనపు జిల్లా కోర్టు పోలీసులకు ఆదేశాలివడం రాజకీయంగా కలకలం రేపుతుంది.

ఈ విషయమై పోలీసులు మంత్రిపై కేసు నమోదు చేస్తారా? లేదా కోర్టు ధిక్కార అభియోగం ఎదుర్కొనేందుకు సిద్ధపడతారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయమై మంత్రి సహితం స్పందించాల్సి ఉంది. ఏదేమైనా ఈ పరిణామం వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టె అవకాశం ఉంది.

దళితుడైన జూనియర్ సివిల్  జడ్జి రామకృష్ణ, మాజీ ఎంపీ హర్షకుమార్‌, డాక్టర్‌ అనితారాణి, డాక్టర్‌ సుధాకర్‌, మహాసేన రాజేష్‌లపై వైఎస్సార్‌సీపీలో కొందరు దాడులు చేశారని 2020 జులైలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కౌంటర్ ఇచ్చే  క్రమంలో మంత్రి దళితులను కించపరిచేలా మాట్లాడారని సస్పెన్షన్ లో ఉన్న జడ్జి రామకృష్ణ ఆరోపిస్తున్నారు. 

పైగా,  పోలీసుల కస్టడీలో ఉండాల్సిన తన ఎక్స్‌రే నివేదికను దొంగతనం చేసి మంత్రి ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించడంపై కేసు నమోదు చేయాలని కోరుతూ బి.కొత్తకోట స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, మంత్రి ఆదేశాలతో పోలీసులు కేసు పెట్టలేదంటూ రామకృష్ణ చిత్తూరు ఎస్పీని ఆశ్రయించారు. అక్కడా సరైన స్పందన లేకపోవడంతో 2020 అక్టోబరులో రామకృష్ణ ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులను విచారణ జరిపే చిత్తూరు మొదటి అదనపు జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. 

ఈ కేసు ఇప్పుడు విచారణలోకి రావడంతో మంత్రి ఇరకాటంలో పడే పరిస్థితి ఏర్పడింది. పైగా, ఆగష్టు 18 లోగా ఈ విషయమై విచారించి, నివేదిక ఇవ్వాలని కోర్టు పోలీసులకు స్పష్టం చేసింది.  రెండున్నరేళ్లుగా కోర్టులో పోరాడినందుకు ఇప్పుడు తనకు న్యాయం జరిగిందని  సస్పెన్షన్‌లో ఉన్న జడ్జి రామకృష్ణ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

అంతేకాకుండా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తాను చేసిన నేరారోపణలు రుజువు చేయలేని పక్షంలో అర గుండుతో తిరుగుతానని స్పష్టం చేస్తున్నారు. పోలీసులు కూడా కోర్టు ఆదేశాలను గౌరవించి పెద్దిరెడ్డిపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కోర్టు ఆదేశాలు ఉల్లంఘనపై కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు.

కాగా,  మంత్రిపై కేసు నమోదైన మరుక్షణమే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని రామకృష్ణ స్పష్టం చేశారు. తన తప్పులను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆ రోజు మంత్రి సవాల్‌ చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మాట మీద నిలబడే ప్రజాప్రతినిధి అయితే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని తేల్చి చెప్పారు. మంత్రి పదవి నుంచి తప్పుకున్న తరవాతే తాను పెట్టిన క్రిమినల్‌ కేసుల్లో విచారణను ఎదుర్కోవాలని రామకృష్ణ హితవు చెప్పారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles