ఎమ్మెల్సీగా అనురాధ పోటీతో అసమ్మతి టీడీపీ ఎమ్యెల్యేలకు షాక్!

Saturday, November 23, 2024

టీడీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా మాజీ మేయర్, ప్రముఖ బిసి నాయకురాలు పంచుమర్తి అనురాధ సోమవారం ఉదయం నామినేషన్ ధాఖలు చేయడంతో ఏపీ రాజకీయాలలో ఒక విధంగా కలకలం చెలరేగింది. తమ అభ్యర్థిని గెలిపించుకునే సంఖ్యాబలం లేకపోయినప్పటికీ అధికార వైసిపిని ఇరకాటంలో పడవేయడంకోసం వ్యూహాత్మకంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆమెను పోటీకి దింపుతున్నట్టు స్పష్టమైనది.

ముఖ్యంగా ఆమె పోటీచేయడం నలుగురు టీడీపీ అసమ్మతి ఎమ్మెల్యేలకు షాక్ కలిగించే పరిణామం కాగలదు.  త ఎన్నికలలో టిడిపి నుండి రాష్త్ర శాసనసభకు ఎన్నికై పార్టీకి, శాసనసభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేయకుండా, వైసీపీ నేతలుగా కొనసాగుతూ, వచ్చే ఎన్నికలలో వైసిపి అభ్యర్థులుగా పోటీచేసేందుకు సిద్ధపడుతున్న వారిని లక్ష్యంగాచేసుకొనే ఆమెను పోటీకి దింపినట్లు స్పష్టం అవుతుంది.

ఎమ్మెల్యే కోటా కింద ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి వైసీపీ అభ్యర్థులుగా పెనుమత్స సురేష్, కోలా గురువులు, ఇజ్రాయిల్ , మర్రి రాజశేఖర్, జయమంగల వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసు రత్నం గత గురువారం అసెంబ్లీ కార్యాలయంలో నామినేషన్లు వేశారు. ప్రస్తుతం వైసీపీకి 150 మందికి పైగా ఎమ్యెల్యేల బలం ఉండడంతో ఈ ఏడుగురు ఏకగ్రీవంగా ఎన్నికయిన్నట్లే అని అందరూ భావించారు. 

కానీ అనూహ్యంగా, టిడిపి అభ్యర్థి రంగంలోకి రావడంతో పోటీ  అనివార్యమైంది.  ఒక్కో స్థానంలో అభ్యర్థి విజయం సాధించాలంటే 22 నుంచి 23 ఓట్లు అవసరం. ప్రస్తుతం టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే వారిలో నలుగురు టీడీపీకి దూరంగా, బహిరంగంగా వైఎస్సార్‌సీపీలో కొనసాగుతున్నారు.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి ఇప్పటికే టిడిపికి దూరమయ్యారు. వారు నలుగురు ఓటు వేయకుండా టిడిపి అభ్యర్థి గెలుపొందే అవకాశం లేదు.

అయితే, టిడిపి విప్ జారీచేసినా వారు ఓటు వేయని పక్షంలో వారు శాసనసభ్యత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికలో రహస్య ఓటింగ్ పద్ధతి లేకపోవడంతో, ఎవ్వరు ఏ పార్టీకి ఓటు వేసారో ఎన్నికల కమీషన్ కు స్పష్టంగా తెలుస్తుంది. విప్ ను దిక్కరించారని టిడిపి ఫిర్యాదు చేస్తే ఎన్నికల కమీషన్ కు వారిపై చర్య తీసుకొనక తప్పదు.

వారిపై చర్యతీసుకోవడం అంటే వారి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయడమే అవుతుంది. అప్పుడు ఉపఎన్నికలు జరుపవలసి వస్తుంది. మరో సంవత్సరం లోపుగానే సాధారణ ఎన్నికల ఉండగా, ఇప్పుడు ఈ నాలుగు నియోజకవర్గాలలో ఉపఎన్నికలు ఎదుర్కోవడం అధికార పక్షంకు సవాల్ తో కూడుకున్న అంశం కాగలదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles