2024 ఎన్నికలలో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా నివారించడం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేయాలని పవన్ కళ్యాణ్ మొదటగా ఒక ప్రతిపాదనను తీసుకు వచ్చారు. అయితే అందుకు బిజెపి పూర్తిగా విముఖత వ్యక్తం చేస్తూ తాము వైసీపీ – టీడీపీకి సమానదూరం అంటూ చెబుతూ ఉండటమే కాకుండా పవన్ కళ్యాణ్ సహితం టిడిపితో చేతులు కలపకుండా చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేస్తూ వస్తున్నది.
అయితే, బిజెపి కపట వైఖరిని గ్రహించిన పవన్ కళ్యాణ్ బిజెపి ధోరణిని మచిలీపట్టణం బహిరంగసభలో ఎండగడుతూ తనను టిడిపి వైపుకు నెట్టింది మీరే అన్నట్లు నిష్ఠూరంగా మాట్లాడారు. బీజేపీ కలిసి వచ్చినా, కలిసి రాకపోయినా టిడిపితో పొత్తు అంటూ సంకేతం ఇచ్చారు. కానీ, విడిగా పోటీచేస్తే హ్యాంగ్ అసెంబ్లీ ఏర్పడి, ముఖ్యమంత్రి పదవి పొందవచ్చని ఆశను పవన్ కళ్యాణ్ లో ఒక వంక బిజెపి, మరోవంక వైసిపి వర్గాలు లోపాయికారిగా కలుగచేస్తున్నారు.
ఈ లోగా పట్టభద్రుల నుండి జరిగిన మూడు ఎమ్యెల్సీ ఎన్నికలలో టిడిపి అనూహ్యమైన విజయం సాధించడంతో రాష్ట్ర రాజకీయ స్వరూపాన్నే మార్చివేసింది. వైసిపి ప్రభుత్వం పట్ల జనం తీవ్ర ఆగ్రవేశాలతో ఉన్నారని, ఇప్పుడు ఎవ్వరు ఎటు ఉండాలో నిర్ణయించుకో వలసిన సమయం వచ్చినదని స్పష్టమైంది.
అంతేకాదు, పార్టీలు అధికారికంగా పొత్తులు ఏర్పర్చుకోకపోయినా ప్రజలే వైసిపిని ఎవ్వరు ఓడిస్తారో ఒక అంచనాకు వచ్చి నిర్ణయం తీసుకుంటారని కూడా స్పష్టమైంది. అందుకనే టీడీపీ చరిత్రలో ఎన్నడూ ఎరుగని రీతిలో అత్యధికంగా ఓటర్లు ఆ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టింది. అందుకని ఈ ఫలితాలను టిడిపి విజయంగా కన్నా, వైసిపి పరాజయంగా చాలామంది చూస్తున్నారు.
2019లో టీడీపీని ఓడించిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీ విజయ పరంపరను కొనసాగించింది. కానీ తాజాగా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి పెద్ద కుదుపు, ఒక హెచ్చరిక అనడంలో సందేహం లేదు.
స్థానిక సంస్థలు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీ గెలుచుకున్నప్పటికీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను గెలుచుకుంటామని చెప్పుకుంటున్న విశ్వాసానికి ఈ ఫలితాలు షాక్ వచ్చినట్టైంది.
ఈ ఎన్నికలలో తమ విధానం ఏమిటో జనసేన చెప్పకపోయిన్నప్పటికీ ఆ పార్టీ తమకే మద్దతు ఇస్తున్నట్లు బిజెపి నాయకులు చెబుతూ వచ్చారు. కానీ పోలింగ్ సరళిని చూస్తుంటే క్షేత్రస్థాయిలో జనసేన మద్దతుదారులు అత్యధికంగా టిడిపికి ఓటువేసిన్నట్లు స్పష్టం అవుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
దానితో ఈ ఫలితాలు పవన్ కళ్యాణ్ ను సహితం ఇరకాటంలో పడేస్తున్నాయి. ఇప్పుడు ఊహించని విజయాన్ని టీడీపీ రుచి చూసింది. ముఖ్యమంత్రి పదవి రొటేషన్ గా పంచుకోవాలనే, మూడొంతుల సీట్లు ఇవ్వాలనే అంటూ గొంతెమ్మ కోర్కెలు కోరితే టిడిపి వినే పరిస్థితి లేదు.
జనసేన ఒంటరిగా పోటీచేస్తే 2019 ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి శత్రువును ఓడించడం కోసం జనసైనికులు సహితం ఎమ్యెల్సీ ఎన్నికలలో మాదిరిగా టిడిపికి ఓట్లు వేసే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు, కొందరు బిజెపి నాయకులు వైసిపి కోవర్టులుగా వ్యవహరిస్తున్నా ఆ పార్టీ శ్రేణులు మాత్రం వైసిపిని (క్రైస్తవ రాజ్యం) ఓడించడం కోసం పార్టీ అభ్యర్థులను కాదని టిడిపికి ఓట్లు వేసిన్నట్లు కనిపిస్తున్నది. వామపక్షాల ఓటర్లు సహితం తమ అభ్యర్థులను కాదని కొంచెం మేరకైనా టిడిపికి ఓటు వేశారు. ఇక రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి బిజెపి, వామపక్షాల ఓటర్లు అత్యధికంగా టిడిపికి ఓటు వేశారు.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో రెండో ప్రాధాన్యత ఓట్లు పీడీఎఫ్ నుంచి 76.6 శాతం (6645) ఓట్లు, బీజేపీ నుంచి 73.6 శాతం (3959) ఓట్లు టీడీపీకి బదిలీ అయ్యాయి. అదే సమయంలో పీడీఎఫ్ నుంచి 23.4 శాతం (2025) ఓట్లు, బీజేపీ నుంచి 26.3 శాతం(1414) ఓట్లు మాత్రమే వైఎస్సార్ సీపీకి బదిలీ అయ్యాయి. మూడు చోట్ల కూడా రెండో ప్రాధాన్యత ఓట్లతోనే టిడిపి అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం.
తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో పీడీఎఫ్ నుంచి 73.7 శాతం (8355) ఓట్లు, బీజేపీ నుంచి 65.5 శాతం (2004) ఓట్లు టీడీపీకి బదిలీ కాగా, వైఎస్సార్‌సీపీకి పీడీఎఫ్ నుంచి 26.3 శాతం (2974) ఓట్లు, బీజేపీ నుంచి 34.5 శాతం (1051) ఓట్లు బదిలీ అయ్యాయి.
పశ్చిమ రాయలసీమలో పీడీఎఫ్ నుంచి 75.4 శాతం (9886) ఓట్లు, బీజేపీ నుంచి 72.8 శాతం (3312) ఓట్లు టీడీపీకి బదిలీ కాగా, వైఎస్సార్‌సీపీకి పీడీఎఫ్ నుంచి 25.3 శాతం(3352) ఓట్లు, బీజేపీ నుంచి 27.2 శాతం (1237) ఓట్లు బదిలీ అయ్యాయి. మూడు నియోజకవర్గాల్లో పీడీఎఫ్ వేసిన రెండో ప్రాధాన్యత ఓట్లకు తోడు, జనసేనతో పరోక్షంగా మద్దతివ్వడం టీడీపీకి కలిసొచ్చింది.