ఎమ్యెల్యే సీట్ కోసం జూనియన్ ఎన్టీఆర్ పై భరోసా ఇస్తున్న తారకరత్న 

Sunday, December 22, 2024

నందమూరి వారసులతో పెద్దవాడైన తారకరత్న అటు సినిమాలలో, మరోవంక రాజకీయాలలో ఉత్సాహంగా ప్రవేశించినా ఎక్కడా రానింపలేక పోతున్నారు. సినిమాలలో ఇక అవకాశం లేదని నిర్ధారించుకున్నట్లున్నారు. ఇప్పుడు తాజాగా రాజకీయాలలో మరోసారి తన అదృష్టం పరిశీలించు కొనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 

ఇంతలో తన వారసుడిగా కొడుకు  నారా లోకేష్ ను జనం ఏమేరకు ఆమోదిస్తారా ఇంకా తేల్చుకోలేకపోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలు రాజకీయంగా జీవన్మరణ సమస్యగా మారడంతో నందమూరి వారసులను మరోసారి ముందుకు తీసుకు రావాలని అనుకుంటున్నట్లు కధనాలు వ్యాపిస్తున్నాయి. 

ముఖ్యంగా టిడిపికి కొరకరాని కొయ్యగా మారిన గుడివాడ ఎమ్యెల్యే కొడాలి నానిని కట్టడి చేయడం కోసం నందమూరి చైతన్య కృష్ణను రాజకీయాలలోకి తీసుకు వచ్చి, పోటీ చేయించాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, చైతన్య రాజకీయాల పట్ల ఏమాత్రం ఆసక్తిగా ఉన్నారో తెలియడం లేదు. 

ఎన్టీఆర్ మానవులలో మొదటగా టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నది తారకరత్న మాత్రమే. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా తాతగారి హయాంలోనే ప్రచారంలో పాల్గొన్నారు. ఇంతలో జూనియర్ ఎన్టీఆర్ నటుడిగా పేరు తెచ్చుకోవడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. 

జూనియర్ ఎన్టీఆర్ ఆకర్షణను ఉపయోగించుకొనే ప్రయత్నం 2009 ఎన్నికల  సందర్భంగా చంద్రబాబు చేశారు. తెలుగు యువత సదస్సుకు ఆహ్వానించడంతో పాటు, ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే, అంతలో రోడ్డు ప్రమాదానికి గురికావడంతో మొదట్లోనే అవాంతరం ఏర్పడింది. 

అప్పటి నుండి ఎందుకో గాని చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను పట్టించుకోవడం లేదు. చంద్రబాబుతో వియ్యమొందిన తర్వాత బాబాయి నందమూరి బాలకృష్ణ సహితం అతనిని దూరంగా ఉంచుతూ వచ్చారు. మొదటి నుండి కుటుంభంలో `వివక్షత’కు గురవుతూ వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ అవమానాలకు గురి కావడం చిన్నప్పటి నుండి సాధారణమే కావడంతో, మౌనంగా తన సినిమాలపై దృష్టి పెట్టుకొంటూ వస్తున్నారు. 

నారా లోకేష్ ఆశించిన విధంగా రాజకీయంగా ఎదగలేక పోతుండడం, చంద్రబాబు రాజకీయాలు సహితం ఎదురుదెబ్బలకు గురవుతూ ఉండడంతో పార్టీలో పలువురు ప్రముఖులు, చివరకు కుప్పంలో పార్టీ శ్రేణులు సహితం జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకొచ్చి పార్టీని కాపాడమని నినాదాలు ఇవ్వడం ప్రారంభించారు. 

ఈ నినాదాలను లోకేష్ రాజకీయ భవిష్యత్ కు సవాల్ గా పరిగణిస్తూ ఉండడంతో, పార్టీతో ఏమాత్రం సంబంధం లేకపోయినా కొన్ని సందర్భాలలో తగు విధంగా స్పందించడంలేదని అంటూ పలువురు పార్టీ ప్రముఖులు దాడులు చేయడం కూడా జరుగుతూ వచ్చింది. అటువంటి వారిని వారించే ప్రయత్నం చంద్రబాబు, లోకేష్ చేయక పోవడంతో జూనియర్ ఎన్టీఆర్ తో టిడిపికి దూరం పెరుగుతూ వచ్చింది. 

అటువంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ ప్రచారంకు వస్తారని అంటూ తారకరత్న ప్రకటించడం ఒక విధంగా సంచలనం కలిగించింది. మరో విధంగా అదే సమయంలో వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలనే ఆసక్తి వ్యక్తం చేయడంతో టిడిపి సీటు కోసం అటువంటి ప్రకటన చేశారనే అభిప్రాయం కలుగుతుంది. అయిన ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించే అవకాశాలు లేవని చెప్పొచ్చు. 

తారకరత్నకు సీటు ఇవ్వడం గాని, జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం గాని వచ్చే ఎన్నికలలో సాధ్యమయ్యే అవకాశాలు ఏమాత్రం కనబడటం లేదు. నందమూరి కుటుంభంకు ఏమేరకు ప్రాధాన్యత ఇవ్వాలో, వారిలో ఎవ్వరిని ఏ విధంగా, ఎప్పుడెప్పుడు ఉపయోగించుకోవాలో అనే విషయంలో చంద్రబాబుకు ఉన్నంత స్పష్టత మరెవ్వరికీ లేదు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles