ఎమ్యెల్యేల కొనుగోలు కేసును బిజెపి నీరుగార్చిన్నట్లేనా!

Wednesday, January 22, 2025

జాతీయ స్థాయిలో రాజకీయ కలకలం సృష్టించిన తెలంగాణాలో ఎమ్యెల్యేల కొనుగోలు కేసు ముందుకు సాగకుండా, న్యాయస్థానం ద్వారా బిజెపి అడ్డుకోవడం వెనుక భారీ ప్రయత్నాలు జరిగాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ముగ్గురు నిందితులు బీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను భారీ డబ్బు ఆఫర్లతో ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ 2022 అక్టోబర్ 26న రాత్రి హైదరాబాద్ సమీపం మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్ నుండి సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి దర్యాప్తులు బీజేపీలో కీలక నేతల ప్రమేయం బహిర్గతమైంది.

అయితే, ఈ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు వాయిదాల మీద వాయిదాలు వేస్తూ, ఈ కేసులో లభించిన సాక్ష్యాధారాలను బట్టి కీలక వ్యక్తులు ఎవ్వరిని తెలంగాణ పోలీసులు కనీసం ప్రశ్నించే అవకాశం లేకుండా చేయడం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తున్నది. ముఖ్యంగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు తెలంగాణ పోలీసులు ఆధారాలు సమర్పించినప్పటి నుండే, ఈ కేసులో పురోగతి ఆగిపోవడం గమనార్హం.

ఉన్నట్టుండి ఏడుగురు జడ్జిలు బదిలీ కావడం, ఆ తర్వాత ఈ కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ముందుకు సాగక పోవడంపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపిస్తూ ఈ కేసులో సిట్‌ అప్పటివరకూ చేసిన దర్యాప్తును.. ఎవరూ అడగకముందే సింగిల్‌ జడ్జి క్వాష్‌ చేశారని.. సిట్‌ జీవోను కొట్టేశారని.. అత్యంత అసాధారణమైన ఆదేశాలను జారీచేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎటువంటి ఆధారాలను పరిశీలించకుండానే దర్యాప్తును సీబీఐకి ఇచ్చారని, ఇది రాష్ట్రపోలీసుల హక్కులను కాలరాయడమేనని స్పష్టం చేశారు.

అత్యంత సమర్థులైన ఐపీఎస్‌ అధికారులు కలిగిన సిట్‌ను కాదని.. కేసును సీబీఐకి బదిలీ చేయడానికి సరైన కారణాలు లేవని అభ్యంతరం చెప్పారు. సీబీఐ విచారణ ప్రారంభిస్తే సాక్ష్యాలు ధ్వంసం అవుతాయని కోర్టుకు దుష్యంత్ దవే ఆందోళన వెలిబుచ్చడం గమనార్హం. అంటే, ఈ కేసును నీరుగార్చడం కోసం, కీలకమైన బిజెపి ప్రముఖులను విచారించకుండా అడ్డుకోవడం కోసమే సిబిఐ విచారణ కోసం పట్టుబడుతున్నారనే అనుమానాలు వెల్లడి అవుతున్నాయి. 

సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను సుప్రీంకోర్టు అంగీకరించింది. బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవంక, సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పును సవాలు చేసేందుకు వీలుగా దానిని ఓ పక్షం రోజుల పాటు అమలు కాకుండా సస్పెండ్ చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇది కూడా బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles