ఒక వంక ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి కుమార్తె కవితకు సిబిఐ నోటీసులు పంపి, కేసులో ఆమెను కూడా నిందితురాలిగా చేర్చడం కోసం కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు వేంగంగా అడుగులు వేస్తుండగా, మరోవంక, బిజెపి కీలక నేత బి ఎల్ సంతోష్ లక్ష్యంగా సాగుతున్న ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సిట్ దూకుడు పెంచుతున్నది.
ఈ కేసులో కీలక అనుమానితులుగా ఉన్న కేరళకు చెందిన జగ్గుస్వామి, తుషార్‌లకు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్రభారతీ, నందకుమార్, సింహయాజీలను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి పలుమార్లు విచారించారు.
బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్, కేరళకు చెందిన జగ్గుస్వామి, తుషార్ కూడా ఈ కేసుతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వారు ముగ్గురిని అరెస్ట్ చేయడం కోసం సిట్ ప్రయత్నం చేస్తుండగా, వారు తెలంగాణ హైకోర్టు ద్వారా కొంత ఊపిరి పీల్చుకో గలుగుతున్నారు.
గతంలోనే జగ్గుస్వామి, తుషార్‌లను విచారణకు రావాలని తెలంగాణ సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. కానీ వారు సిట్ విచారణకు హాజరు కాలేదు. దీంతో వారిపై సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో జగ్గుస్వామి శనివారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
తనకు ఇచ్చిన 41ఏ సీఆర్‌పీసీ, లుకౌట్ నోటీసులపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఈ కేసుకు సంబంధం లేదని, అక్రమంగా తనను ఇరికించారని జగ్గుస్వామి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
అదే సమయంలో కొచ్చిన్‌లోని జగ్గుస్వామి ఇంటికి చేరుకున్న తెలంగాణ సిట్ అధికారులు ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని రెండోసారి నోటీసులు ఇచ్చారు. కేరళలోని తుషార్ ఇంటికి కూడా చేరుకున్న తెలంగాణ పోలీసులు.. ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇక ఈ కేసుకు సంబంధించి సిట్ నోటీసులపై తుషార్ గతంలోనే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తుషార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు తుషార్‌ను అరెస్ట్ చేయవద్దని సిట్‌ను ఆదేశించింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని తుషార్‌కు స్పష్టం చేసింది.
ఏమైనా అభ్యంతరాలుంటే తమను ఆశ్రయించాలని తుషార్‌కి హైకోర్టు సూచించింది. ఈనేపథ్యంలో ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.మరోవంక, సిట్ అధికారులు బిఎల్ సంతోష్ కు ఇచ్చిన నోటీసులపై హైకోర్టు ఇచ్చిన స్టే సోమవారంతో ముగియనున్నది. అప్పటి వరకు అరెస్ట్ చెయ్యటానికి వీలు లేదని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత సంతోష్ విషయంలో సహితం సిట్ వేగంగా అడుగులు వేసే అవకాశం ఉంది.