ఎమ్యెల్యేల అవినీతిపై కేసీఆర్ వాఖ్యలు వ్యూహాత్మకమా?

Wednesday, January 22, 2025

దళితబంధు పథకం అమలులో అధికార పార్టీ  ఎమ్యెల్యేలు, నేతలు అవినీతికి పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు ఒకవంక విమర్శలు చేస్తుంటే, స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సహితం ఆ విధంగా అవినీతికి పాల్పడుతున్న ఎమ్యెల్యేల చిట్టా తన వద్ద ఉన్నదంటూ పార్టీ ప్లీనరీలో పేర్కొనడం అధికార పక్షంలో కలకలం రేపుతోంది. కేసీఆర్ వ్యూహాత్మకంగానే ఈ వాఖ్యలు చేసారని పలువురు భావిస్తున్నారు.

నిజంగా అవినీతికి పాల్పడుతున్న ఎమ్యెల్యేలను కట్టడి చేయాలి అనుకొంటే విడిగా పిలిచి మందలించి వదిలి వేసేవారని లేదా కేటీఆర్ కు ఆ పని అప్పచెప్పి ఉండేవారని భావిస్తున్నారు. కానీ, ప్లీనరీలో కొందరు ఎమ్యెల్యేలు అవినీతి పాల్పడుతున్నరని, ప్రజలకు దగ్గరగా వెళ్లడం లేదని అంటూ చెప్పడం ఏదో ఒక సాకుతో కొందరికి వచ్చే ఎన్నికలలో సీట్లు ఎగ్గొట్టడం కోసమే అని స్పష్టం అవుతుంది.

గత ఏడాది ఈటెల రాజేందర్ పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేసి, బిజెపిలోకి వెళ్లి ఎమ్యెల్యేగా పోటీచేసి గెలుపొందినప్పుడు ఒకవిధంగా బిఆర్ఎస్ లో కొంత కలకలం రేగింది. ఆ సమయంలో పార్టీ నుండి ఎవ్వరూ చేజారిపోకుండా కాపాడుకోవడం కోసం వచ్చే ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్యెల్యేలు అందరికి తిరిగి సీట్లు ఇస్తామని కేసీఆర్ స్వయంగా పార్టీ విస్తృత సమావేశంలో ప్రకటించారు.

అయితే కేసీఆర్ స్వయంగా చేయిస్తున్న అంతర్గత సర్వేలలో కనీసం మూడోవంతు మంది  ఎమ్యెల్యేలు తిరిగి పోటీచేస్తే తిరిగి గెలుపొందాం స్పష్టమని తెలుస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు, పలువురి నేతల తీరుపై కేసీఆర్ కన్నెర్ర చేశారు. అందుకనే అభ్యర్థులను మార్చక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

నిజానికి 25 నుంచి 30 సిట్టింగ్ సీట్లలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారు ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేతో సంబంధం లేకుండానే వారికి వారుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి రావటంతో ఆయా స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ఇందులో కూడా పలు కీలకమైన స్థానాలు ఉన్నాయి.

వీటన్నింటి నేపథ్యంలో  పలువురి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు దక్కడం కష్టమనే చర్చ నడుస్తోంది. అయితే ఇప్పుడే సీట్లు ఇచ్చేడిది లేదంటే వారు వేరే పార్టీల వైపుకు వెళ్లే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితి ఏర్పడకుండా  ఎమ్మెల్యేలను జాగ్రత్తగా పని చేసుకోవాలని, అలా చేయకపోతే టికెట్ కష్టమనే విధంగా కేసీఆర్ చెప్పటం ద్వారా అస్పష్ట సంకేతాలు ఇస్తున్నట్లయింది.

కేసీఆర్ హెచ్చరికలతో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు సీరియస్ గా గ్రౌండ్ లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే మాదిరిగా టికెట్ పై తమకే అన్న ధీమాతో ఉండే ఇతర నేతలు కూడా పార్టీ కోసం మరింత గట్టిగా పని చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా పార్టీ శ్రేణులు అందరూ ఎన్నికల వరకు క్షేత్రస్థాయిలో ప్రజలకు సన్నిహితంగా ఉండేటట్లు చేసుకోవడమే కేసీఆర్ ఎత్తుగడగా కనిపిస్తున్నది.

చివరకు ఎన్నికల సమయంలో సీట్లు ఇవ్వలేక పోయినవారికి ఎమ్యెల్సీ పదవుల్లో, ఇతర అధికార పదవుల్లో ఇస్తామని హామీల ద్వారా నచ్చచెప్పే ప్రయత్నం చేయవచ్చని భావిస్తున్నారు. అప్పటికి వినకుండా పార్టీ మారినా ఎన్నికలపై వారి ప్రభావం అంత ఎక్కువగా ఉండబోదని అంచనా వేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles