ఎమర్జెన్సీని తలపిస్తున్న ఢిల్లీలో కేంద్రం ఆర్డినెన్స్

Wednesday, January 22, 2025

ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వ అధికారాలను కేంద్రంకు ధారాదత్తం చేస్తూ ఇప్పుడు ఢిల్లీలో ప్రయోగిస్తున్న కేంద్రం ఆర్డినెన్స్‌ నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1975లో జారీ చేసిన ఎమర్జెన్సీని తలపిస్తోందని మండిపడుతూ దానిని వెనక్కి తీసుకోవాలని హైదరాబాద్ వేదికగా ముగ్గురు ముఖ్యమంత్రులు డిమాండ్ చేశారు.

ఈ ఆర్డినెన్సు కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల మద్దతు కూడదీసుకొనేందుకు దేశవ్యాప్త పర్యటన జరుపుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీకి చెందిన పంజాబ్ ముఖ్యమంత్రి భ‌గ‌వంత్‌మాన్ తో కలిసి శనివారం హైదరాబాద్ వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో భేటీ జరిపారు. ముగ్గురూ మీడియాతో మాట్లాడుతూ  గవర్నర్ల ద్వారా ఇతర పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలను అడ్డుకొంటున్న బిజెపిపై ఉమ్మడిగా పోరాటం జరపాలని పిలుపిచ్చారు.

‘ఆర్డినెన్స్‌ను తేవడం ద్వారా కేంద్రం సుప్రీంకోర్టు తీర్పును కూడా అణగదొక్కుతోంది. ఇది ఎమర్జెన్సీని తలపిస్తోంది. ప్రధాని మోదీ, బిజెపి నాయకులు స్వరం పెంచుతున్న ఎమర్జెన్సీ ఇది. రాజ్యాంగ సవరణ ద్వారా అలహాబాద్ హైకోర్టు తీర్పును కూడా పనికి రాకుండా చేశారు. ఇది ఎమర్జెన్సీ వంటిదే కాదా? ఇది అదే మోడల్ ’ అంటూ కెసిఆర్ ఆప్ ఢిల్లీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. కేంద్రం ఆగ‌డాలు, అరాచ‌కాలు మితిమీరిపోతున్నాయ‌ని కేసీఆర్ మండిప‌డ్డారు

‘మోడీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తేవడం ద్వారా కేవలం అరవింద్ కేజ్రీవాల్‌నే అవమానించలేదు, ఢిల్లీ ప్రజలను కూడా అవమానించారు. ఢిల్లీ ప్రజలు ప్రజా తీర్పును ఇచ్చారు. వారు ఎవరినీ నామినేట్ చేయలేదు. ప్రజలే మోదీ  ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు’అని కెసిఆర్ హెచ్చరించారు. ఈ  సర్వీసెస్ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా బిఆర్‌ఎస్, ఆప్ కలిసి పోరాడుతాయని ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రకటించారు.

‘కేంద్రంతో ఢిల్లీ ప్రభుత్వం ఎనిమిదేళ్లు న్యాయపోరాటం చేసింది. చివరికి సుప్రీంకోర్టు కేంద్రం తాలూకు గెజిట్ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. కానీ ఆ తర్వాత ఎనిమిది రోజులకే సుప్రీంకోర్టు ఉత్తర్వును ధిక్కరించి కేంద్రం ఆర్డినెన్స్‌ను తెచ్చింది’ అన్నారు. ‘ఒకవేళ సుప్రీంకోర్టు ఉత్తర్వును మన్నించబోనని ప్రధానే అంటే, న్యాయానికి ఇక తావులేదు. ఇలా ఎలా దేశం నడువగలదు’ అని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాల‌ను ప‌క్క‌న‌పెట్టేసి ఆర్డినెన్స్ తేవ‌డం అంటే న్యాయం కోసం ప్ర‌జ‌లు ఎక్క‌డికి వెళ్తార‌ని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఢిల్లీ ప్ర‌జ‌ల‌ను ఇది అవ‌మానించ‌డ‌మే అంటూ ఇది ఢిల్లీ ప్ర‌జ‌ల స‌మ‌స్య మాత్రమే కాదని, ఇది దేశ ప్ర‌జ‌ల స‌మ‌స్య అని స్పష్టం చేశారు.

షీలా దీక్షిత్ సీఎంగా ఉన్నప్పుడు ఆమెకు అన్ని అధికారాలున్నాయని, కానీ ఇప్పుడు ప్రధాని మోదీ వచ్చాక పోయాయని కేజ్రీవాల్ తెలిపారు. ఆర్డినెన్స్ ను పార్లమెంట్ లో వ్యతిరేకిస్తామని చెబుతూ రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేదని విపక్షాలు ఏకమైతే బిల్లు పాసవ్వదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

సీబీఐ, ఈడీలతో బెదిరిస్తూ  ప్ర‌భుత్వాల‌ను కూల్చివేస్తున్నార‌ని బీజేపీపై మండిపడ్డారు. నాన్ బీజేపీ స‌ర్కార్ల‌ను కూల్చివేయ‌డం బీజేపీకి అల‌వాటు అయ్యింద‌ని పేర్కొంటూ ఒక‌వేళ గ‌వ‌ర్న‌రే పాల‌న చేయాల‌నుకుంటే, అప్పుడు ముఖ్య‌మంత్రిని ఎన్నుకోవాల్సి అవ‌స‌రం ఏముంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. నాన్ బీజేపీ పార్టీలు అన్ని ఒక్క‌టి అయితేనే బీజేపీ ఢీకొట్ట‌గ‌ల‌మ‌ని స్పష్టం చేశారు. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తాము పోరాటం చేస్తున్న‌ట్లు పంజాబ్ సీఎం భ‌గ‌వంత్‌మాన్ సింగ్ తెలిపారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles