ఎన్నికల ముందు కేసీఆర్ ఆర్టీసీ విలీనం.. నగరం చుట్టూ మెట్రో

Friday, November 22, 2024

ఎన్నికల ముందు భారీ ఎత్తున హామీలు ప్రకటిస్తుండటం, ఆ తర్వాత వాటి గురించి అంతగా పట్టించుకోక పోవడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు పరిపాటి. గత ఎన్నికల సమయంలో ప్రకటించిన రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగ నియామకం వంటి హామీలను ఇంకా పూర్తి చేయకపోవడం తెలిసిందే.

అదేవిధంగా మరోకొద్దీ నెలల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సోమవారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేసీఆర్ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఒక విధంగా ఎన్నికల ముందు ప్రజలకు భారీ ఎత్తున తాయిలాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. నష్టాలలో అష్టకష్టాలు పడుతున్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ మెట్రో రైలును విస్తరించేందుకు ఆమోదం తెలిపారు.

ఎవ్వరూ ఊహించని విధంగా తాయిలాలు ప్రకటించడం కేసీఆర్ కు అలవాటే. ఇదివరకే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయగా, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఈ చర్య ద్వారా ఆర్టీసీ ఉద్యోగులు అందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వమే జీతాలు చెల్లించేందుకు సిద్ధపడింది. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వేతన సవరణ, ఇతర సదుపాయాలు ఉంటాయి.

టీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కానుందని, దీంతో 43వేలకుపైగా ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలుగా మారనున్నారని మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న కల సాకారం కానుందని తెలిపారు. విధి విధానాలపై సబ్ కమిటీ వేసినట్లు మంత్రి తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు.

మరోవంక, రూ. 60 వేల కోట్లతో మూడు, నాలుగేళ్లలో హైదరాబాద్ మెట్రో వ్యవస్థను భారీగా విస్తరించాలని కేబినెట్ నిర్ణయించింది. రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు మెట్రో రైలు టెండర్ ప్రక్రియ జరుగుతోంది. ఇస్నాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రో విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు.  మియాపూర్ నుంచి లక్డీకపూల్ వరకు, ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు, ఉప్పల్ నుంచి బీబీనగర్, ఈసీఐఎల్ వరకు మెట్రో విస్తరణకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. భవిష్యత్తులో షాద్ నగర్ వరకు మెట్రో విస్తరణ చేపడతామన్నారు. 

మరోవైపు, జేబీఎస్ నుంచి తూంకుంట వరకు, ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు డబుల్ డెక్కర్ మెట్రో నిర్మాణం చేపడతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఒక లెవల్లో వాహనాలు, మరో లెవల్లో మెట్రో ఏర్పాటు చేయడానికి కేబినెట్‌ తీర్మానించింది. దీంతో రోడ్డు మార్గంతోపాటు మెట్రో మార్గం కూడా ఏర్పడుతుందని, రవాణా సులభమవుతుందని తెలిపారు.  అంతేగాక, వరంగల్ మామునూరులో విమానాశ్రయం కోసం 253 ఎకరాలు ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో అనాథ పిల్లల సంరక్షణ కోసం అర్బన్ పాలసీ తీసుకొస్తున్నామని తెలిపారు. మహబూబాబాద్‌లో ఉద్యాన కాలేజీ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు కేటీఆర్ చెప్పారు. 

హైదరాబాద్‌లో హైబ్రిడ్ విధానంలో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటుకు ఆమోదం లభించింది. నిమ్స్‌లో రూ. 1800 కోట్లతో మరో 2 వేల పడకల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. బీడీ కార్మికులతోపాటు బీడీ టేకేదారులకు పింఛన్లకు నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ వెనక్కి పంపిన బిల్లులను తిరిగి అసెంబ్లీ ఆమోదిస్తామని, అప్పుడు గవర్నర్ ఆమోదం అవసరం ఉండదని కేటీఆర్ చెప్పారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles