ఎన్నికల కమీషన్ నుండి జగన్ కు చిక్కులు తప్పవా!

Sunday, December 22, 2024

శివసేన గుర్తు, పేరు విషయంలో ఉద్ధవ్ థాకరే, ఎకనాథ్ షిండే వర్గాల మధ్య ఏర్పడిన వివాదంలో వాటిని షిండే వర్గానికి కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ ఆ పార్టీ రాజ్యాంగంపై చేసిన సునిశిత విమర్శలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్సీపీకి హెచ్చరిక సంకేతాలు పంపుతున్నాయి. 

ఇప్పటికే పార్టీ పేరు మార్పు, అధ్యక్షుడి ఎన్నిక అంశంలో చేసిన సవరణలు కమీషన్ పరిశీలనలో ఉన్నాయి. ఇవి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి అనుగుణంగా లేకపోతే వైఎస్సార్సీపీపై చర్యలు తీసుకొనే అవకాశం ఉందని భావిస్తున్నారు.

శివసేన పేరు, పార్టీ ఎన్నికల గుర్తు “విల్లు – బాణం” మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికే చెందుతాయని తేల్చి చెప్పిన సందర్భంగా ఈసీ కీలక అంశాలు ప్రస్తావించింది. పార్టీ పేరు, గుర్తు తమదేనని చెప్పుకోవడానికి ఠాక్రే వర్గం 2018 నాటి పార్టీ రాజ్యాంగం ఆధారపడుతోందని,  కానీ, ఆ రాజ్యాంగ సవరణ గురించి ఎన్నికల సంఘానికి తెలియజేయలేదని పేర్కొంది. 2018లో చేసిన సవరణ తమ వద్ద రికార్డు కాలేదని తెలిపింది.

పైగా.. అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి ఎలక్టోరల్ కాలేజ్ ని అధ్యక్షుడే నామినేట్ చేసేలా పార్టీ రాజ్యాంగంలో మార్పులు చేశారన, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ప్రకటించింది. షిండే వర్గానికి అనుకూలంగా ఈసీ నిర్ణయం వెలువడేందుకు పలు అంశాలు కారణమైనా అందులో పార్టీ రాజ్యాంగం అంశం కూడా ముఖ్యమైనది కావడం గమనార్హం.

వైఎస్సార్సీపీకి సంబంధించి ఇదేవిధంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పార్టీ నియమావళిని మార్చడం జరిగింది. గతేడాది జూలైలో పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించిన వైఎస్సార్సీపీ వైఎస్ జగన్‌ని జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటించింది. అధ్యక్ష నియామకంలో మార్పులతో పాటుగా పార్టీ రాజ్యాంగం సవరణల ప్రతిపాదనలకు కూడా ప్లీనరీ ఆమోదం తెలియజేసింది.

పార్టీ రాజ్యాంగంలోని ఆర్టికల్ -1 ప్రకారం యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా లేదా వైఎస్సార్సీపీగా మారుస్తూ తీర్మానం చేశారు. ఇందుకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలపై స్పందించిన ఈసీ రాజకీయ పార్టీకి శాశ్వత అధ్యక్షుడి నియామకం అప్రజాస్వామికమని తేల్చి చెప్పింది. ఈ నిర్ణయం చెల్లదని స్పష్టం చేసిన ఎన్నికల సంఘం ఏ పార్టీలో కూడా శాశ్వత అధ్యక్షులు ఉండరంది.

పార్టీలో శాశ్వత అధ్యక్షుడు లేదా శాశ్వత పదవులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టం చేయడమే కాక, అలాంటి ఎన్నిక నియమ నిబంధనలను ఉల్లంఘించినట్లేనని తెలిపింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా ఎన్నికలు జరగాలని సూచించింది. రాజకీయ పార్టీలు చేసే అప్రజాస్వామిక సవరణలను గుర్తించేది లేదంది. ఈ మేరకు వివరణ ఇవ్వాలని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శికి నోటీసులు పంపింది.

ఈసీ నోటీసులు రావడంతో వైఎస్సార్సీపీ శాశ్వత అధ్యక్షుడి విషయంలో యూటర్న్ తీసుకుంది. ఈ మేరకు నోటీసులకి సమాధానం ఇస్తూ తమ పార్టీలో శాశ్వత అధ్యక్షుడి ఎన్నిక జరగలేదని వివరణ ఇచ్చింది. జగన్ ను కేవలం 5 ఏళ్ల కాలానికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని, ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లో ప్రకటించారు.

జగన్ ను పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా చేయాలన్నది కేవలం నాయకుల అభిలాష మాత్రమే అని, అయితే ఈ ప్రతిపాదనను సీఎం జగన్ ఆదిలోనే తిరస్కరించారని చెప్పారు. మరింత వివరణాత్మకంగా తెలిపేందుకు అంతర్గత కమిటీ వేసి నివేదికను ఈసీకి అందిస్తామని తెలిపారు. అయితే, వైఎస్సార్సీపీ తమ పార్టీ రాజ్యాంగంలో చేసిన సవరణలు ఇప్పటి వరకు ఈసీ రికార్డుల్లోకి ఎక్కలేదని తెలుస్తోంది.

తమ పార్టీ శాశ్వత జీవితకాల అధ్యక్షుడి పదవికి మాత్రమే గతంలో ఎన్నికలు నిర్వహించారని ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పష్టం చేశారు. అయితే ఆ ఎన్నిక చెల్లదని పేర్కొంటూఇదే విషయమై తాను గత ఏడాది కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు తెలిపారు. శాశ్వత జీవితకాల అధ్యక్షుడు ఎన్నిక అనేది పార్టీ రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్నారు. అలాగే పార్టీ పేరును మార్చడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.

ఏదేమైనా, శివసేన పార్టీ విషయంలో వివాదానికి తెరదించిన కేంద్ర ఎన్నికల సంఘం మిగతా పార్టీల రాజ్యాంగంపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. పార్టీల నియమావళి, రాజ్యాంగంలో సవరణలకు సంబంధించి అందిన ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. వైఎస్సార్సీపీ పార్టీ పేరు మార్పు సహా పలు కీలక సవరణలపై పరిశీలన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఏవిధంగా స్పందిస్తుందో చూడవలసి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles