భూములకు సంబంధించిన స్పష్టమైన రికార్డులను అందుబాటులో ఉంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన ధరణి పోర్టల్ ఇప్పుడు వివాదాంశంగా మారింది. భూములకు సంబంధించి రికార్డులను అందులో తారుమారు చేస్తున్నట్లు తీవ్రమైన విమర్శలు తలెత్తుతున్నాయి. పైగా, ఈ పోర్టల్ ద్వారా తప్పుడు రికార్డులు సృష్టించి వేలాది ఎకరాలను అధికార పక్షంకు చెందిన నేతలు స్వాహా చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు చెలరేగుతున్నాయి.
స్వయంగా ప్రభుత్వమే వేలాది తప్పుడు ఎంట్రీలు ఉన్నట్లు అంగీకరించి, వాటిని సరిదిద్దడం కోసం భరోసాలు ఇస్తున్నా ఆచారాయణలో బాధితులకు పెద్దగా ప్రయోజనం జరగడం లేదు. తప్పుడు ఎంట్రీల కారణంగా కొందరు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయమై ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధర్నాకి పోర్టల్ ను రద్దుచేసి, అంతకన్నా అత్యాధునిక సాంకేతికతతో మరో విధానం అమలులోకి తీసుకు వస్తామని టిపిసిసి అద్యక్షడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ధరణి పోర్టల్ రద్దుచేస్తే ప్రజలకు ఎంతో నష్టం జరుగుతోందని అంటూ ప్రతి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరిస్తున్నారు.
ధరణి రద్దు చేస్తే రైతు బంధు, రైతు బీమా వంటి ప్రయోజనాలు రావని ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ధరణి పోర్టల్ తో భూదాన్ భూములను అధికార పార్టీ నేతలు స్వాహా చేశారని, ఇది వేల కోట్ల రూపాయల కుంభకోణం అంటూ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. మొత్తం మీద కొద్దీ నెలల్లో ఎన్నికలు రాబోతున్న సమయంలో ధరణి పోర్టల్ కీలక ప్రచార అస్త్రంగా మారింది.
తెలంగాణ బీజేపీ నాయకులు అంతర్గత కుమ్ములాటలతో నిమగ్నమై ఉండగా, కాంగ్రెస్ నేతలు ప్రజాక్షేత్రంలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలను వెలుగులోకి తేవడం పట్ల దృష్టి సారిస్తున్నారు. `డిఫాక్టో సీఎం’గా వ్యవహరిస్తున్న మంత్రి కేటీఆర్, ఆయన అనుచరులు ధరణి పోర్టల్ ద్వారా భారీ కుంభకోణంలో చిక్కుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో 146 ఎకరాల భూమి ఎవరికి తెలియకుండా నిషేధిత జాబితాలోకి వెల్లిందని వెల్లడించారు. దీని వెనుక కేటీఆర్ హస్తం ఉన్నట్లు ఆరోపిస్తూ, ధరణి పోర్టల్ రాగానే ఈ భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లాయని, వాటి విలువ వేలకోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు.
భూముల ఆక్రమణకోసమే ధరణి పోర్టల్ తీసుకు వచ్చారని పేర్కొంటూ, దీనిపై పూర్తి వివరాలతో సెంట్రల్ విజిలెన్సు కమీషన్ కు లేఖ వ్రాయనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్వగ్రామం తిమ్మాపూర్ భూదాన్ భూముల్లో భారీ కుంభకోణం జరిగిందని ఆయన వెల్లడించారు.
ఆ భూములను కాపాడాలని జిల్లా కలెక్టర్ కు ఓ లేఖ వ్రాసిన కిషన్ రెడ్డి ఆ తర్వాత మౌనంగా ఉండటంలో అర్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ధరణిలో జరుగుతున్న భూదోపిడీ మరెక్కడా జరగడం లేదని అంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో జరిగిన భూలావాదేవీలపై విచారణ జరిపిస్తామని, సంబంధిత కలెక్టర్లను చువ్వలు లెక్కబెట్టిస్తానని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.