ఎన్డీయే సమావేశంతో టీడీపీ- జనసేనలను విడగొట్టే ఎత్తుగడ!

Wednesday, January 22, 2025

సుమారు పదేళ్ల తర్వాత బీజేపీ ఈ నెల 18న ఎన్డీయే సమావేశం ఏర్పాటు చేస్తున్నది. కర్ణాటక ఎన్నికల అనంతరం దేశంలో పార్టీ గ్రాఫ్ పడిపోతున్న సంకేతాలు అందటం, గత ఐదేళ్లలో కీలకమైన శివసేన, జెడియు, టిడిపి, అకాలీదళ్ వంటి పక్షాలు ఎన్డీయేను విడనాడడంతో 2024 ఎన్నికల కోసం బలం పుంజుకోవడం కోసం కొత్త మిత్రుల అన్వేషణలో పడ్డారు.

2019 ఎన్నికల తర్వాతనే బిజెపితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నప్పటికీ ఎప్పుడూ ఎన్డీయే భాగస్వామిగా చూసిన దాఖలాలు లేవు. ఏ విషయంలో కూడా జాతీయ స్థాయిలో గాని, రాష్ట్ర స్థాయిలో గాని ఎటువంటి రాజకీయ అంశాలపై, విధాన పరమైన అంశాలపై ఆ పార్టీతో బిజెపి నేతలు సంప్రదింపులు జరిపిన దాఖలాలు లేవు. రెండు పార్టీలు కూడా ఉమ్మడిగా ఎటువంటి కార్యక్రమం చేపట్టిన సందర్భం కూడా లేదు.

ఏపీలో బిజెపికి నోటా కన్నా తక్కువగా ఓట్లు ఉండటం, ఆ పార్టీ కీలక నాయకులు వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనుసన్నలలో పనిచేస్తున్నారనే అభిప్రాయం ప్రజలలో బలంగా నాటుకొనడంతో  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహితం ఎప్పుడూ ఏపీ బిజెపి నేతలను పట్టించుకున్న దాఖలాలు లేవు. మొన్నటి వరకు పార్టీ అధ్యక్షునిగా ఉన్న సోము వీర్రాజు వైఖరి కారణంగానే పవన్ బిజెపికి దూరంగా జరుగుతున్నారని మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గతంలో తీవ్రమైన ఆరోపణలు చేయడం తెలిసిందే.

`వైసిపి ముక్త ఆంధ్ర ప్రదేశ్’ తన లక్ష్యంగా ప్రకటించి, వైసిపి వ్యతిరేక ఓట్లలో చీలిక రానీయమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం, అందుకోసం టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేయాలని ప్రతిపాదించడంతో బీజేపీకి నేతలలో ఖంగారు బయలుదేరింది. విశాఖపట్నం పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పవన్ కళ్యాణ్ ను పిలిపించుకొని, టిడిపితో పొత్తు విషయంలో తొందరపడవద్దని హితవు చెప్పారని వార్తలు వచ్చాయి.

మరోవంక, పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో టిడిపితో పొత్తు పెట్టుకోకుండా చూసే బాధ్యతను జగన్ మోహన్ రెడ్డి కేంద్ర నేతలు మోదీ, అమిత్ షాలకు అప్పచెప్పిన్నట్లు కథనాలు వెలువడ్డాయి.  వ్యూహాత్మకంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును ఢిల్లీ పిలిపించుకొని అమిత్ షా మాట్లాడారు. పైగా, ఈ నెల 18న జరుప తలపెట్టిన ఎన్డీయే సమావేశంకు టీడీపీని కూడా ఆహ్వానిస్తున్నట్లు, టిడిపి ఎన్డీయేలో తిరిగి చేరబోతున్నట్లు బీజేపీ అనుకూల నేషనల్ మీడియా, ముఖ్యంగా రిపబ్లిక్ టివి కధనాలు ప్రసారం చేశాయి.

ఈ విషయమై ఎటువంటి చర్చలు జరగలేదని, తమకు ఎటువంటి ఆహ్వానం రాలేదని టిడిపి వర్గాలు స్పష్టం చేస్తున్నా ఇటువంటి కధనాలు కొనసాగుతూనే ఉన్నాయి. టిడిపితో పొత్తు కోసమే సోము వీర్రాజును తప్పించి దగ్గుబాటి పురందేశ్వరిని రాష్త్ర బీజేపీ అధ్యక్షురాలిగా చేశారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే, వాటన్నింటిని పటాపంచలం చేస్తూ టీడీపీ- జనసేనల మధ్య దూరం పెంచేందుకు బిజెపి అగ్రనాయకత్వం స్పష్టమైన వైఖరి ఆవలంభిస్తున్నట్లు వెల్లడైంది. 

ఎన్డీయే సమావేశంకు మొదటిసారిగా పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం పంపారు. కానీ టిడిపికి మాత్రం పంపలేదు. అయితే తనతో పాటు జనసేనలో నెంబర్‌ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్‌ను కూడా అనుమతించాలని పవన్ విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది.
ఇదే సమయంలో ఇప్పటివరకు ఎన్డీయేలో లేని పలు పార్టీలకు ఆహ్వానాలు పంపడం గమనార్హం. 

బీహార్‌లో జనతాదళ్‌(యునైటెడ్‌) ఎన్డియే నుంచి దూరమైన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కొత్త మిత్రులను వెతుక్కునే క్రమంలో చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌జనశక్తి పార్టీతో పాటు ఆ రాష్ట్ర మాజీ సీఎం జితెన్‌ రామ్‌ మాంజీ (హందుస్తానీ ఆవామ్‌ మోర్చా)కు కూడా ఆహ్వానం పంపించారు. పంజాబ్‌లో పాత మిత్రులు ‘శిరోమణి అకాలీదళ్‌’కు కూడా ఆహ్వానం పంపినట్టు తెలిసింది.  

తమిళనాడులో అన్నాడీఎంకే, తమిళ్‌మనీలా కాంగ్రెస్‌ నేత జీకే వాసన్‌, పీఎంకే నేత అన్భుమణి రాందాస్‌కు ఈ ఆహ్వానాలు అందాయి. అయితే అన్నాడీఎంకేకు చెందిన పన్నీర్‌ సెళ్వంకు మాత్రం బీజేపీ నుంచి ఆహ్వానం అందలేదు. మహారాష్ట్రంలో శివసేన ఎన్డియేకు దూరమైన తర్వాత ఆ పార్టీలో చీలికవర్గం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేనతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ, తాజాగా ఎన్సీపీలోనూ అజిత్‌ పవార్‌ నేతృత్వంలో చీలిక వర్గాన్ని ప్రోత్సహంచి ప్రభుత్వంలో చేర్చుకుంది. 18 నాటి ఎన్డియే మిత్రపక్షాల భేటీకి ఈ రెండు చీలిక వర్గాలకు ఆహ్వానం పంపినట్టు తెలిసింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles