ఎన్డీయే భేటీలో మారిన ప్రధాని స్వరం.. ఒక్క ఎంపీ లేని 25 పార్టీలు 

Thursday, November 21, 2024

బెంగళూరులో ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టుకుని, ప్రధాని నరేంద్ర మోదీ సర్కారుపై యుద్ధం ప్రకటించిన కొద్దిసేపటికే దేశ రాజధాని న్యూఢిల్లీలో బీజేపీ సారధ్యంలో 38 పార్టీలతో కూడిన ఎన్డీఏ మెగా భేటీ ఆరంభమైంది. 2019 ఎన్నికల తర్వాత ఎన్డీయే గురించి పట్టించుకోని ప్రధాని ప్రతిపక్షాలలో బలమైన కూటమి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండటంతో జాగ్రత్త పడుతున్నారు.

బెంగుళూరు భేటీలో ఉద్దండ రాజకీయ నేతలు పాల్గొన్నారు. కానీ ఇక్కడ ఎక్కువగా చిన్న, చితక పార్టీల నేతలే ఉన్నారు. చాలా పార్టీలకు ఒక్క ఎంపీ లేదా ఎమ్యెల్యే కూడా లేరు. చివరకు కొన్ని పార్టీలకు ఎన్నికల కమిషన్ గుర్తింపు కూడా ఉన్నట్లు లేదు. వాటి పేర్లు దేశంలో చాలా మందికి తెలియదు. రెండంకెల ఎంపిలు ఉన్న పార్టీ అంటూ లేదు.

ప్రతిపక్ష కూటమి బలం పెంచుకొంటూ పోతుండడంతో హడావుడిగా ఎన్డీయే భేటీకి పెద్దగా తెలియని అనేక పార్టీలను పిలిచినట్లున్నారు. హాజరైన 38 పార్టీలలో 25 పార్టీలకు ఒక్క ఎంపీ కూడా లేరు. మరో 9 పార్టీలకు ఒకరొక్కరు చొప్పున మాత్రమే ఎంపీలు ఉన్నారు. కేవలం శివసేన (షిండే)కు పది మందికి మించి ఎంపీలు ఉన్నారు.

ఇక ప్రధాని స్వరంలో పూర్తిగా మార్పు కనిపిస్తుంది. మొన్నటి వరకు “నేను, నా ప్రభుత్వం” అంటూ చెప్పుకొచ్చిన ప్రధాని ఇప్పుడు “ఎన్డీయే ప్రభుత్వం, నడ్డాజీ నాయకత్వం” అంటూ అంటున్నారు. ఒక సందర్భంలో రాజ్యసభలో అన్ని ప్రతిపక్షాలకు తానొక్కడినే సరిపోతాను అని చెప్పిన ప్రధాని ఇప్పుడు ఎవ్వరు వచ్చి ఎన్డీయేలో చేరినా ఆహ్వానిస్తాం అంటూ బహిరంగ స్వాగతం పలికారు.

చాలా రోజుల తర్వాత మొదటిసారిగా బీజేపీ వ్యవస్థాపకుడు, మోదీ నేడీ స్థితిలో ఉండేందుకు ప్రధాన కారకులైన మాజీ ఉప ప్రధాని ఎల్ కె అద్వానీ పేరును ప్రస్తావించారు. అద్వానీయే ఎన్డీయేకు మార్గదర్శకులు అని చెప్పారు. అయితే ఢిల్లీలోనే ఉన్న ఆయనను కనీసం భేటీకి ఆహ్వానించే ప్రయత్నం చేయలేదు.

ఎన్డీయే భేటీ అంతా మోదీ చూట్టూ జరిగింది. అందరూ కలిసి ఆయనను గజమాలతో సత్కరించడం గమనార్హం. ఎన్డీయే కూటమిలో చిన్నా, పెద్ద పార్టీలంటూ తేడా లేదని ప్రధాని చెప్పారు. అయితే అక్కడ అంతా ఆయనను పొగడ్తలతో నింపే ప్రయత్నమే చేశారు. కానీ కూటమికి సంబంధించిన అంశాల గురించి గాని, దేశంలోని పరిస్థితుల గురించి గాని గంభీరమైన చర్చ జరిగిన దాఖలాలు లేవు.

అందుకు భిన్నంగా బెంగుళూరులు పలు పార్టీల నాయకులు ఒక విధంగా `సమాన హోదా’లో పాల్గొన్నారు. భవిష్యత్ వ్యూహాల గురించి లోతుగా సమాలోచనలు జరిపారు. తమ అహంకారాలను, ఆధిపత్య ధోరణులను పక్కన పెట్టి సర్దుబాటు ధోరణులు ప్రదర్శించారు. ఉమ్మడిగా బిజెపిని ఎదుర్కొనేందుకు స్పష్టమైన సంకల్పాన్ని వ్యక్తం చేశారు. 

కానీ ఢిల్లీ భేటీలో పాల్గొన్న చాలామంది నేతలు బిజెపిని అడ్డం పెట్టుకొని ఒకటో, రెండో ఎంపీ స్థానాలు గెలుపొంది, తమ రాజకీయ ఉనికిని చాటుకోవాలని ఆత్రుతయే ఎక్కువగా కనిపిస్తుంది.  శివసేన, అకాలీదళ్, టిడిపి వంటి కీలకమైన పార్టీలు ఎన్డీయే నుండి విడిపోవడానికి మోదీ  నాయకత్వంలో బిజెపి అనుసరించిన ఆధిపత్య ధోరణులు, ఏకపక్ష నిర్ణయాలే కారణమని మరచిపోరాదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles