తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా వంద సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సమావేశాలను నిర్వహించాలని హైదరాబాద్ లో జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశాము తీర్మానించింది.
ఈ సమావేశాలు ఎలా, ఎక్కడ నిర్వహించాలో ఖరారు చేసేందుకు ప్రత్యేకంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవ నిర్వహణ కమిటీని ఏర్పాటు చేయన్నారు. ఏప్రిల్ 30 నుంచి మే 28 వరకు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. తెలంగాణ, ఏపీలోని 42 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు.
అండమాన్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు, తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న విదేశాల్లో కూడా సభలు జరుపుతారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు.
రెండు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వాల పనితీరు, ప్రధాన ప్రజా సమస్యలతో పాటు పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవంపై చర్చించారు. నాలుగు దశాబ్దాల టీడీపీ ఘన చరిత్రను ఇంటింటికీ తీసుకెళ్లాలని నిర్ణయించారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ పేరిట వంద రూపాయల వెండి నాణేన్ని విడుదల చేయాలని నిర్ణయించిన ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పొలిట్‌బ్యూరో తీర్మానం ఆమోదించింది. తీర్మానం ప్రతిని జత చేస్తూ చంద్రబాబు నాయుడు తదుపరి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖను వ్రాసారు.
పొలిట్ బ్యూరో సమావేశంలో 17 అంశాలపై చర్చించినట్లు టీడీపీ నేతలు తెలిపారు. మే 27, 28 తేదీలలో రాజమహేంద్రవరం పార్టీ మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. ఉభయ తెలుగురాష్ట్రాల్లో బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహాల్ని భారీస్థాయిలో ఏర్పాటుచేయాలని రెండు రాష్ట్రప్రభుత్వాల్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు స్పందించకపోతే బడుగులపక్షాన పోరాడిఅయినా టీడీపీ సాధిస్తుందని ప్రకటించారు.
వచ్చేఎన్నికల్లో 40శాతం స్థానాలు యువతకు కేటాయించాలని పొలిట్ బ్యూరోలో తీర్మానించింది. ఆంధ్రప్రదేశ్ లో స్వేచ్ఛగా మాట్లాడే హక్కుని కాలరాస్తూ, అక్కడి ప్రభుత్వం జీవోనెం -1 తీసుకొచ్చిందని, ప్రతిపక్షనేతలు, ప్రజలు, మీడియా ఎవరూ తనను ప్రశ్నించకూడదన్న అక్కసుతో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీవోను తీవ్రంగా ఖండించారు.
2014-19 మధ్యన ఆంధ్ర ప్రదేశ్ ఇరిగేషన్ రంగానికి స్వర్ణయుగంగా ఉండేదని, జగన్ వచ్చాక ఒక్క ప్రాజెక్టు పని కూడా జరగడంలేదని, ప్రధానమైన పోలవరాన్ని పూర్తిగా నాశనంచేశారని అచ్చన్నాయుడు ఆరోపించారు. ప్రాజెక్టులపై దృష్టిపెట్టాలని ఏపీ ముఖ్యమంత్రిని కోరారు.
ఏపీలో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారు. పెట్రోల్, డీజిల్ ధరలు, చెత్తపన్నులు, మరుగుదొడ్లపన్ను, ఇతరత్రాపన్నుల పెంపుతో ప్రజల్ని పీల్పిపిప్పిచేస్తున్నారు. వాటిపై కూడా పొలిట్ బ్యూరోలో చర్చించామని పేర్కొన్నారు.
ఏపీలో ముఖ్యమంత్రి 4 ఏళ్లలో రూ. 10 లక్షలకోట్ల అప్పుచేశాడని, ప్రజలపై రూ. లక్షా 25వేలకోట్ల పన్నుల భారం మోపాడని, మొత్తం రూ.11లక్షల25వేలకోట్లలో ప్రజలకు బటన్ నొక్కుడు ద్వారా రూ.లక్షా80వేలకోట్లు మాత్రమే ఇచ్చామని జగన్ చెబుతున్నాడని పేర్కొంటూ మిగతా సొమ్ము ఎటు పోయిందని ప్రశ్నించారు.
జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి ఏపీ వదిలి వెళ్లిపోయిన పరిశ్రమలే ఎక్కువని, అమర్ రాజా బ్యాటరీస్, కియా అనుబంధ సంస్థలు, జాకీ పరిశ్రమ వంటివి ఎన్నో ఏపీకి గుడ్ పై చెప్పాయని అచ్చన్నాయుడు విమర్శించారు.