ఎన్టీఆర్ శతజయంతికి దూరంగా జూనియర్ ఎన్టీఆర్!

Friday, November 22, 2024

తెలుగు దేశం పార్టీ అస్తిత్వమే దిగవంత ఎన్టీ రామారావు పట్ల తెలుగు ప్రజలలో పెనవేసుకుపోయిన ప్రేమాభిమానాలే కావడం అందరికి తెలిసిందే. ఆయనను గద్దె దించి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కొత్తలో చంద్రబాబు నాయుడు ప్రజల మది నుంచి ఎన్టీఆర్ స్మృతులను చెరిపివేయాలని తీవ్రంగా ప్రయత్నించినా సఫలం కాలేదు. చివరకు తన రాజకీయ మనుగడకోసం నిత్యం ఆ పేరును స్మరించుకోక తప్పడం లేదు.

ఈ సందర్భంగా ఆ మహానాయకుడి శతజయంతి ఉత్సవాలను శుక్రవారం విజయవాడలో టీడీపీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుపుతున్నారు. ఈ ఉత్సవాలను ఒక విధంగా పార్టీ ఉత్సవాలుగా కన్నా నందమూరి, నారా కుటుంబాల ఉత్సవాలుగా జరుపుతున్నారు. కేవలం పార్టీ మద్దతుదారులనే కాకుండా, నందమూరి అభిమానులను సహితం ఆహ్వానిస్తున్నట్లు స్వయంగా నందమూరి బాలకృష్ణ ప్రకటించారు.

అయితే, నేడు అంతర్జాతీయ స్థాయిలో ఒక నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఈ సందర్భంగా ఎక్కడా కనిపించడం లేదు. కనీసం ఆయనకు ఆహ్వానం పంపిన దాఖలాలు కూడా కనిపించడం లేదు. ఉద్దేశ్యపూర్వకంగానే ఆయనను ఈ రెండు కుటుంభాలు దూరంగా ఉంచుతున్నారని ప్రచారం చాలాకాలంగా సాగుతుంది.

అందుకు ప్రధాన కారణం రూపురేఖలలో ఎన్టీఆర్ ను గుర్తుకు తెచ్చేవిధంగా ఉండడంతో సాధారణ ప్రజానీకంలోనే కాకుండా టిడిపి శ్రేణులలో సహితం మంచి అభిమానాన్ని సంపాదించడమే. మొదట్లో టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ను తెలుగు యువత సదస్సుకు ఆహ్వానించడం, 2009 ఎన్నికల ప్రచారంలో పాల్గొనేటట్లు చేశారు. అయితే ఆ సందర్భంగా రోడ్ ప్రమాదానికి గురైనప్పటి నుండి ఆయనను పార్టీ సమావేశాలకు ఎప్పుడూ పిలవడం లేదు.

అందుకు ప్రధాన కారణం నారా లోకేష్ టీడీపీ వ్యవహారాలలో ఆధిపత్యం వహించే ప్రయత్నం చేస్తుండడంతో ప్రజాకర్షణలో పోటీపడలేక పోవచ్చని సంశయమే అని అందరూ భావిస్తున్నారు. టిడిపికి అధికారం దూరమైనప్పుడల్లా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి  పలువురు పార్టీ ప్రముఖులు ఎన్టీఆర్ ను రాజకీయాలలోకి తీసుకు రావాలంటూ బహిరంగంగా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.

అంతేకాదు, కుప్పం నుండి ప్రారంభించి చంద్రబాబు నాయుడు పర్యటనలు, నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా కొన్ని చోట్ల జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేయాలంటూ ఫ్లెక్సీలు కూడా వెలుస్తున్నాయి. దానితో కొంత అసహనానికి కూడా గురవుతున్నారు. అయితే, వాస్తవానికి ఎన్టీఆర్ ఇప్పుడు సినిమాలో అగ్రశ్రేణి నటుడిగా ఉండడంతో రాజకీయాలలోకి వచ్చి తన సినిమా భవిష్యత్ ను రిస్క్ లో పడవేసుకొనే పరిస్థితులలో లేరు.

కానీ, తాతగారు ప్రారంభించిన టిడిపి పట్ల సహజంగానే ఆత్మీయానుబంధం ఉండడంతో ఆ పార్టీ నేతల నుండి గౌరభిమానాలు ఆశిస్తారు. దీనిని ఆసరాగా చేసుకొని, చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు గుప్పించడానికి కొడాలి నాని, వంశి వంటి వైసిపి నేతలు ఎన్టీఆర్ వస్తేగాని టిడిపి బ్రతకదంటూ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు.

తాజాగా, కర్నూల్ జిల్లాలో లోకేష్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి భవిష్యత్తులో ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆరే టీడీపీ నాయకుడు అని జోస్యం చెప్పారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ కావాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారని గుర్తుచేశారు. లోకేష్‌ ఇంకా పది పాదయాత్రలు చేసినా నాయకుడు కాలేడని ఎద్దేవా చేశారు.

ఎన్టీఆర్ పట్ల పార్టీ శ్రేణులలో నెలకొన్న ఆకర్షణను గుర్తించబట్టే చంద్రబాబు నాయుడు 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్టీఆర్ అక్కగారైన నందమూరి సుహాసినిని కుక్కటపల్లి నుండి పార్టీ అభ్యర్థిగా పోటీచేయించారు. ఎన్టీఆర్ వచ్చి ప్రచారం చేస్తారని ఈ సందర్భంగా ఆశించారు. అయితే ఆయన ప్రచారానికి దూరంగా ఉన్నారు. తాజాగా ఆమెను తెలంగాణ టిడిపి ఉపాధ్యక్షురాలిగా నియమించారు. తద్వారా నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని టిడిపి విస్మరించడంలేదనే సంకేతం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles