నందమూరి, నారా కుటుంబాలు దూరంగా ఉంచుతూ ఉండడంతో గత పదేళ్లకి పైగా టీడీపీకి దూరంగా ఉంటున్న `జూనియర్’ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తన తాతగారు స్థాపించిన పార్టీ టిడిపి పట్ల ఎంతగా అభిమానం ఉన్నప్పటికీ తాను రంగంలోకి వస్తే చంద్రబాబు నాయుడుకు రాజకీయ వారసుడిగా నారా లోకేష్ ఆధిపత్యం వహించేందుకు ఇబ్బందులు ఎదురుకావచ్చని కొంత ఎన్టీఆర్ పట్ల కొంత అసహనంగా వ్యవహరిస్తున్నారు.
అయితే సినిమాల పరంగా తిరుగులేని అవకాశాలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు తెచ్చుకోగలగడంతో పూర్తిగా సినిమాలపైననే దృష్టి సారిస్తున్నారు. ఎవరెంతగా కవ్వించిన్నప్పటికీ రాజకీయ వైపు చూడనే చూడటమే లేదు. రాజకీయ అంశాలలో జోక్యం చేసుకోవడం లేదు. టిడిపికి ఎన్టీఆర్ ను దూరంగా నెట్టివేస్తున్న వారే, ఆ పార్టీకి ఇబ్బందులు ఎదురైతే నోరు విప్పారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నా మౌనంగా ఉంటూ వస్తున్నారు.
అయితే, ఎన్టీఆర్ తీసుకున్న వైఖరి ఆయన సినీ అభిమానులను ఇరకాటంలో పడవేస్తున్నది. చూస్తూ చూస్త్తూ అధికార పార్టీ వైసీపీకి మద్దతు ఇవ్వలేరు. ఎన్టీఆర్ ను దూరంగా నెట్టివేస్తున్న టిడిపి పంచన చేరలేరు. అందుకనే, మధ్యేమార్గంగా పవన్ కళ్యాణ్ పట్ల ఆకర్షిస్తులవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.
ముఖ్యంగా రెండు రోజుల క్రితం అమలాపురం జిల్లాలో `వారాహి విజయ యాత్ర’ సందర్భంగా సినిమా పరిశ్రమలో వున్న హీరోలు అందరూ తనకు ఇష్టమని, చాలామంది తనకన్నా ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నారని అంటూ చరణ్, ఎన్టీఆర్ అంతర్జాతీయంగా కూడా పేరు తెచ్చుకున్నరని కొనియాడారు. ప్రభాస్, మహేష్ బాబుల పేర్లు సహితం ప్రస్తావించారు.
వారి మాదిరిగా తన గురించి దేశంలో, విదేశాలలో ఎవరికి తెలియదని అంటూ ఈ విషయం చెప్పడానికి తనకు ఇగో అడ్డురాదని స్పష్టం చేశారు. ఇతర నటుల గురించి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకున్నట్లు కనిపిస్తున్నది. చాలా అర్థవంతంగా మాట్లాడారని కొనియాడుతున్నారు.
దానితో పవన్ కళ్యాణ్ #PawanKalyan కి మద్దతు ఇవ్వాలంటూ ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ అభిమానులు అందరికీ సందేశం పంపేశారు. అంటే వాళ్ళకి ఎన్టీఆర్ #ManOfMasses దగ్గర నుండి వర్తమానం అందింది అని తెలుస్తోంది. వారాహి రథాన్ని #VarahiYatra ఎక్కడా ఆపొద్దు, పవన్ కళ్యాణ్ కి రాజకీయంగా ఎటువంటి అడ్డంకులు కల్పించవద్దు అన్నది ఈ సందేశం.
అలాగే సినిమా వేరు, రాజకీయాలు వేరు అంటూ అందరి అభిమానులు తనకు మద్దతు ఇవ్వాలంటూ పవన్ కళ్యాణ్ కోరడం, ఆ మాటలకు ముగ్ధులై ఎన్టీఆర్ అభిమానులు ముందుకు వచ్చి మద్దతు వ్యక్తం చేయడం చకా చకా జరిగిపోయాయి. జనసేన టిడిపితో పొత్తు పెట్టుకున్నా, పెట్టుకోక పోయినా తమకు కూడా రాజకీయంగా ఓ గుర్తింపు కోసం వెంపర్లాడుతున్న ఎన్టీఆర్ అభిమానులకు పవన్ కళ్యాణ్ ఆశాదీపంలా కనిపించినట్లు స్పష్టం అవుతుంది.