ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాల్సిందే… సాధిస్తాం

Sunday, December 22, 2024

తెలుగు జాతి ఆస్తి, వారసత్వమైన నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాల్సిందే అని మరోమారు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రతిధ్వనించారు. ఎన్టీఆర్‌కు భారత రత్న అవార్డు వచ్చేదాకా తెలుగు జాతి పోరాడుతుందని, ఆయనకు పురస్కారం సాధించి తీరతామని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని కైత్లాపూర్‌ మైదానంలో శనివారం జరిగిన ఎన్‌టిఆర్‌ శతజయంతి ఉత్సవాలకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన అతిరధ మహారధులు హాజరయ్యారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల సందర్భంగా సీపీఎం, సీపీఐ జాతీయ కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజా, బీజేపీ నేపథ్యమున్న హరియాణ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, ఎన్టీఆర్ కుమార్తె, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి వంటి ప్రముఖులు ఒకే వేదిక పంచుకున్నారు.

దగ్గుబాటి కుటుంబం నుంచి హీరో వెంకటేశ్‌, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌, మెగా హీరో రాంచరణ్‌, ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్‌, పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి, అక్కినేని వారసులు సుమంత్‌, నాగచైతన్య, హీరో కృష్ణ సోదరుడు, పద్మాలయ స్టూడియోస్‌ అధినేత జి.ఆదిశేషగిరిరావు, వైజయంతీ మూవీస్‌ అధినేత అశ్వినీదత్‌ ఇలా పలువురు సినీ రంగ ప్రముఖులు, యువ హీరోలు, హీరోయిన్లు హాజరయ్యారు.

మహా నటి సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి, లోకేశ్వరి, రోజారమణి, జయప్రద, జయసుధ, విజయా విశ్వనాథ్‌, ఎన్టీఆర్‌ సన్నిహితుడు మల్లికార్జున్‌రావు, వేమూరి రవి, కోటగిరి వెంకటేశ్వరరావు తదితరులను  ఘనంగా సన్మానించారు. జై ఎన్టీఆర్‌ వెబ్‌సైట్‌ను ఆవిష్కరిస్తూ వచ్చే ఏడాది హైదరాబాద్‌ శివారులో వంద అడుగుల విగ్రహం ఏర్పాటుకు శతజయంతి ఉత్సవ కమిటీ సంకల్పించిందని చంద్రబాబు వెల్లడించారు.

ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ, ఆయన వ్యక్తి కాదు శక్తి అని.. తెలుగు జాతి ఉన్నంతవరకు, వారి గుండెల్లో ఉంటారని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌కు ముందు, ఆయన తర్వాత తెలుగువారికి వచ్చిన గుర్తింపు గురించి అందరూ ఆలోచించాలని సూచించారు. ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫ్రంట్‌ చైర్మన్‌గా ఉన్నప్పుడే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కు భారతరత్న ప్రకటించారని పేర్కొంటూ, ఇదీ ఎన్టీఆర్‌ స్ఫూర్తి అని తెలిపారు.

భారతరత్న ఎవరి సొత్తూ కాదని అంటూ ఎన్టీఆర్‌కు ఆ అవార్డు ఇవ్వకపోవడం వెనుక కుట్ర ఉందని నటుడు నారాయణమూర్తి ఆరోపించారు. దీనికి కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంజీఆర్‌ కంటే ఎన్టీఆర్‌ ఎందులో తక్కువ..? అని ప్రశ్నించారు. 

నేషనల్‌ ఫ్రంట్‌ పెట్టి దేశానికి స్ఫూర్తి నింపిన నేత అంటూ  బీజేపీలో ఉన్న పురంధేశ్వరి ఎన్టీఆర్‌కు భారతరత్న గురించి మాట్లాడాలని ఆయన సూచించారు.  తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, జగన్‌, చంద్రబాబు సహ నేతలంతా ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేలా కృషి చేయాలని హితవు చెప్పారు. 

ఈ నెల 28వ తేదీన శతజయంతి ఉత్సవాలు ముగిసేలోపు భారతరత్న ప్రకటించాలని ప్రధాని మోదీని మురళీమోహన్ కోరారు. ‘‘రాజకీయాలకు క్రమశిక్షణ తెచ్చిన నాయకుడు. రాజకీయాలు ప్రజల కోసమే అని నిరూపించారు. నీతి, నిజాయతీకి మారు పేరుగా నిలిచారు. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదనం గురించి ఢిల్లీకి చాటారు’’ అని దత్తాత్రేయ చెప్పారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles