ఎన్టీఆర్‌కు ఆ ఇద్దరూ ఆత్మీయులే..

Wednesday, December 18, 2024

రెండురోజుల వ్యవధిలో ఇద్దరు సీనియర్ నటుల మరణం తెలుగు చిత్ర పరిశ్రమ పెద్ద విషాదం. ఇద్దరికీ కొన్ని సారూప్యతలు ఉన్నాయి. ఇద్దరూ విలన్ పాత్రలతో రంగప్రవేశం చేశారు. విలన్లుగా చాలా కీర్తినే గడించారు. ఇద్దరూ నిర్మాతలుగా కూడా మారారు. ఇద్దరూ కేరక్టర్ నటులుగానూ, హాస్యపాత్రలతో కూడా మెప్పించారు. ఇద్దరూ బహుముఖ ప్రజ్ఞావంతులుగా పేరు తెచ్చుకున్నారు. ఆ ఇద్దరు నటులే కైకాల సత్యనారాయణ, చలపతిరావు!
అయితే చాలా మందికి తెలియని మరో సారూప్యత కూడా ఈ ఇద్దరు నటుల మధ్య ఉంది. నందమూరి తారక రామారావుకు ఈ ఇద్దరూ ఆత్మీయులు. ఒక రకంగా చెప్పాలంటే.. ఆయన ప్రాపకంలో ఉన్న నటులు.
సత్యనారాయణ కు ఎన్టీఆర్ చిత్రాల్లో దాదాపుగా అన్నింటిలోనూ ఒక పాత్ర ఉండేది. ఎన్టీఆర్ కు డూప్ గా సత్యానారాయణే చేసేవారని.. ఒడ్డుపొడుగు ఒకేరీతిగా ఉండడం మాత్రమే కాదు.. నటనశైలి కూడా ఎన్టీఆర్ ను అనుకరిస్తూ సత్యనారాయణ మెప్పించేవారని అంటారు. తనకు సినిమాలు లేకుండా ఇబ్బందులు పడుతున్న రోజుల్లో.. ఎన్టీఆర్ పనిగట్టుకుని నిర్మాతలతో ప్రత్యేకంగా మాట్లాడి మరీ తనకు వేషాలు ఇప్పించేవాడని సత్యనారాయణ వేర్వేరు సందర్భాల్లో చెప్పుకున్నారు.
అలాగే చలపతిరావు కూడా ఎన్టీ రామారావుకు చాలా ఆత్మీయంగా మెలిగేవారు. ఎన్టీఆర్ సొంతంగా నిర్మించి దర్శకత్వం వహించిన దానవీరశూరకర్ణ చిత్రంలో ఎన్టీఆర్ కంటె చలపతిరావు ఎక్కువ పాత్రలు పోషించడం విశేషం. ఈ సినిమాలో ఎన్టీఆర్ కర్ణుడు, దుర్యోధనుడు, కృష్ణుడుగా మూడు పాత్రలు చేశారు. దర్శకత్వం కూడా ఆయనదే. సినిమా పొడవునా ఆయన కనిపిస్తూనే ఉంటారు. అలా సాగుతుంది సినిమా.
అయితే, నిత్యం ఎన్టీఆర్ తో ఉండే చలపతి రావు ఆ చిత్రంలో ఏదో అవసరార్థం రెండు అతిథిపాత్రలో చేశారు. అతిరథుడి గా, జరాసంధుడిగా చేశారు. చంద్రుడి మరణానికి దారితీసేలా కవచకుండలాలు అర్థించివచ్చే పేదబ్రాహ్మడి రూపంలో, అంటే ఇంద్రుడి వేషంలో కూడా కనిపించారు. ఈ సందర్భంగా అప్పటి ఒక సంఘటనను చలపతి రావు నెమరువేసుకుంటూ ఉంటారు..
రెండు పాత్రలు చేసిన తర్వాత.. ఒకరోజు ఎన్టీఆర్ మళ్లీ పిలిచి అర్జంటుగా ఇంకో వేషానికి మేకప్ వేసుకోమని చెప్పారట. ‘మీరేమో మూడు వేషాలు వేశారు.. నాకేమో మూడువేషాలు కూడా దాటిపోయాయి.. జనం గుర్తు పడతారేమో అన్నగారూ’’ అని భయంభయంగానే అన్నాడుట.
దానికి ఎన్టీఆర్ నవ్వి ‘‘కొన్ని ఊర్లలో ఎన్టీరామారావంటేనే తెలియదు.నీమొహం నిన్నెవరు గుర్తుపడతారు’’ అని చేయమన్నారట.
ఒక సీజన్లో ఎన్టీఆర్ కు తప్ప మరెవ్వరికీ కనీసం విష్ చేసే అలవాటు కూడా లేకుండా.. పూర్తిగా ఎన్టీఆర్ మనిషిగా ఉండిపోయిన వ్యక్తి చలపతి రావు. సత్యనారాయణ కూడా ఎన్టీఆర్ కు అంతే సన్నిహితులు. అలాంటి ఇద్దరు సీనియర్ నటులు ఒకేసారి మరణించడం.. తెలుగుపరిశ్రమకు లోటు అయినప్పటికీ.. స్వర్గంలో అన్నగారికి టైంపాస్ అవుతుందని అభిమానులు అనుకోవాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles