ఎట్టకేలకు మణిపూర్‌ నుంచి విద్యార్థుల తరలింపుకు కదిలిన ఏపీ సర్కార్

Wednesday, January 22, 2025

మణిపూర్‌లో  భారీ హింసాకాండ చెలరేగి, కర్ఫ్యూ విధించడంతో బైటకు కదలలేని పరిస్థితులలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు, ఉద్యోగులను తీసుకు రావడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి, రెండు ప్రత్యేక విమానాలను అక్కడకు పంపేవరకు పట్టించుకోని ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు కదిలింది. తెలంగాణ ఏర్పాటు చేసిన విమానాలు హైదరాబాద్ కు వారితో తిరిగి వస్తున్న సమయానికి ఏపీ ప్రభుత్వం ఇంకా విమానాల ఏర్పాటు పూర్తిచేయలేదు.

తల్లితండ్రుల నుండి, ప్రతిపక్షాల నుండి వత్తిడులు రావడంతో అక్కడ చదువుతున్న ఏపీ విద్యార్థులను తరలించేందుకు వైఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అక్కడి ఏపీ విద్యార్థులను స్వరాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది.  రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 157 మంది విద్యార్థులు ఎన్‌ఐటి, ట్రిపుల్‌ ఐటి, వ్యవసాయ కళాశాలలో చదువుతున్నట్లు ప్రాథమిక అంచనా. ఘర్షణల నేపథ్యంలో విద్యార్థులు క్యాంపస్‌లు వదిలి బయటకురాలేని పరిస్థితి నెలకొంది. 

మణిపూర్‌ నుంచి విద్యార్థులను సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు చర్యలను ముమ్మరం చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. వారిని ఆంధ్రాకు తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రితో ఏపీ అధికారులు మాట్టాడారు. ఏపీ విద్యార్థులను తరలించేందుకు పౌర విమానయాన శాఖ అంగీకరించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

మణిపూర్‌ రాష్ట్రంలో చిక్కుకున్న ఎపి విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్‌తోపాటు కంట్రోల్‌రూమ్‌ను ఢిల్లీలోని ఎపి భవన్‌లో ఏర్పాటుచేసింది. 011-23384016, 011-23387089 హెల్ప్‌లైన్‌ నెంబర్లను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

ప్రత్యేక విమానం ఎన్ని గంటలకు ఏర్పాటు చేస్తామన్న సమాచారం త్వరలోనే ఇస్తామని అధికారులు తెలియజేశారు. ఇప్పటికే ఈ విషయంపై పౌర విమానయాన శాఖ మంత్రికి ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. అలాగే ఏపీ విద్యార్థులకు తగిన సాయం చేయాలని మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు.

అంతకు ముందు, మణిపూర్లోని ఇంఫాల్ లో స్థానిక ఘర్షణల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టిడిపి అధినేత చంద్రబాబునాయుడు లేఖ వ్రాసారు. విద్యార్థులను క్షేమంగా తీసుకువస్తామని అని వారి తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఇంఫాల్‌లోని సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ, ఎన్‌ఐటీలలో సుమారు 100 మందికిపైగా తెలుగు విద్యార్థులు చదువుతున్నారని చెబుతూ  అక్కడి పరిస్థితుల కారణంగా తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ఆందోళన చెందుతున్నారని మాజీ ముఖ్యమంత్రి తెలిపారు.  ఇంపాల్‌లోని ఎన్‌ఐటీలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన సుమారు 25 మంది చదువుతున్నారు. హాస్టల్‌కు సమీపంలో కాల్పులు, బాంబుల శబ్దాలు వినిపిస్తుండడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను స్వరాష్ట్రానికి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. తాగేందుకు నీరు, తినేందుకు ఆహారం కూడా సరిగా అందడం లేదని, బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని వాపోయారు.

ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక విమానాలను ఇక్కడకు పంపించి తమ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను తీసుకెళ్లాయని, ఏపీ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలని విద్యార్థులు వేడుకుంటున్నారు. ఎన్‌ఐటీ విద్యా సంస్థ యాజమాన్యం జూన్‌ 30 వరకు సెలవులు ప్రకటించడంతో పాటు అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొనడంతో వారంతా ఆంధ్రా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles