ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల బిజెపి అధ్యక్షుల మార్పు!

Sunday, December 22, 2024

రెండు తెలుగు రాష్ట్రాల్లో  పార్టీ విస్తరణను గాలికి వదిలేసి సొంత అజెండాలతో పెత్తనం చేస్తూ వస్తున్న బిజెపి రాష్త్ర అధ్యక్షులను ఎన్నికల సంవత్సరంలో మార్చాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడి మార్పుపై భారీ కసరత్తు జరుగుతుంది.

తెలంగాణాలో పార్టీ అధ్యక్షుడిని మార్చే ప్రసక్తి లేదని, ఎన్నికల వరకు బండి సంజయ్ కొనసాగుతారని కేంద్ర పార్టీ నేతలు స్పష్టం చేసిన వారం రోజులలోనే ఇటువంటి ప్రచారం ఊపందుకోవడం గమనార్హం. కర్ణాటక ఎన్నికల అనంతరం తెలంగాణాలో కాంగ్రెస్ లో జోష్ పెరగడం, ఇతర పార్టీల వారెవ్వరూ బీజేపీ ముఖం చూడకపోగా, ఉన్నవారెవ్వరు మిగులుతారనే ప్రశ్నలు తలెత్తడంతో నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తున్నది.

ఇప్పటికే బండి సంజయ్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లడం వృద్ధప్రయాస అన్నట్టు ఇతర పార్టీల నుండి వచ్చిన పలువురు పార్టీ పెద్దలకు ఢిల్లీలో స్పష్టం చేశారు. అయితే ఇతర పార్టీల నుండి వస్తున్న వారిని అనుమానంగా చూస్తున్న పార్టీ నాయకత్వం ఇప్పుడు వారిని ఏదోవిధంగా సంతృప్తపరచి ఎన్నికల ముందు పార్టీ విడవకుండా చేసుకోవాలనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తున్నది.

అదేవిధంగా ఏపీలో సహితం పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీలో ఎవ్వరి విశ్వాసం చూరగొనలేక పోతున్నారు. ఆయన కార్యవర్గంలో పలువురు ప్రముఖులు కేంద్రంలో నామినేట్ పదవులు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బు వసూలు చేస్తూ పట్టుబడుతున్నారు. సోము బృందాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి `బి’ టీం గానే ప్రజలు చూస్తున్నారు.

అందుకనే అత్యవసరంగా పార్టీ అధ్యక్షుడిని మార్చాలనే ఆలోచన సాగుతుంది. ఈ సందర్భంగా ఈమధ్యనే పార్టీలోకి చేరిన మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెరపైకి వస్తున్నది. అయితే డా. వైఎస్ రాజశేఖరరెడ్డి శిష్యుడిగా, తండ్రికున్న పేరు కారణంగా రాజకీయంగా రాణించినా, ఢిల్లీలో తెరవెనుక ప్రయత్నాలతో ముఖ్యమంత్రి పదవి అలంకరించిన జనంలో తిరిగి పనిచేసిన అనుభవం లేదు.

ఇక తెలంగాణాలో మాజీ మంత్రి, పార్టీ ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ ను పార్టీ అధ్యక్షుడిగానే, ప్రచార కమిటీ చైర్మన్ గానో నియమించాలనే ఆలోచనలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోవంక, కాంగ్రెస్ నుండి వచ్చిన మాజీ మంత్రి డి కె అరుణను రాష్ట్ర అధ్యక్షురాలిగా చేయాలనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి.

ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఇతర పార్టీల నుండి వచ్చి చేరిన వారిలో ఈటెల రాజేందర్ వంటి ఒకరిద్దరు మినహాయిస్తే మిగిలిన వారంతా తమకు కాంగ్రెస్ లోనే, బిఆర్ఎస్ లోనే రాజకీయ మనుగడ లేదనుకొని బిజెపిలోకి వచ్చిన వారే. సొంతంగా పోటీ చేసే సత్తా చూపగలిగే వారెవ్వరూ లేరు. దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారిని విస్మరించి, ఇటువంటి వలస నేతలను అందలం ఎక్కించినా పార్టీకి ఎటువంటి ప్రయోజనం జరుగుతుందో చూడాల్సి ఉంది.

తెలంగాణాలో అధికారంలోకి వస్తామని పైకి చెబుతున్నా అటువంటి పరిస్థితులు ఇక్కడ లేవని పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ఎప్పుడో కేంద్ర నాయకత్వంకు స్పష్టం చేశారని తెలుస్తున్నది. ఇప్పుడు కేవలం లోక్ సభ సీట్లను కాపాడుకొని, వీలైతే ఒకటి, రెండు సీట్లు పెంచుకోవడంపైననే దృష్టి సారిస్తున్నారు.

ఏపీలో సహితం సొంతంగా ఒక సీటు కూడా గెలుచుకునే అవకాశం లేకపోయినా పార్టీ పట్ల ప్రజల్లో నెలకొన్న ప్రతికూల అభిప్రాయలు పొరుగు రాష్ట్రాల్లో కూడా బిజెపిపై చూపుతున్నట్లు కర్ణాటక ఎన్నికల్లో స్ఫష్టం కావడంతో బీజేపీ నాయకత్వం కలవడం చెందుతున్నట్లు చెబుతున్నారు.

ఏదేమైనా రెండు రాష్ట్రాల్లో కీలక మార్పులు చేసేందుకు అమిత్ షా, జెపి నడ్డా, బి ఎల్ సంతోష్ పలు విడతలుగా సమావేశమై కసరత్తు పూర్తి చేశారని తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles