ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ ఆహ్వానం!

Wednesday, January 22, 2025

టిడిపి నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు శతజయంతి కార్యక్రమాలకు నందమూరి కుటుంభం సభ్యులు అందరిని ఆహ్వానిస్తూ జూనియర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు నందమూరి కల్యాణరామ్ లను మాత్రం ఎక్కడా ఆహ్వానించడంలేదనే విమర్శలు సోషల్ మీడియాలో వ్యాపిస్తున్నాయి.

కావాలనే వారిని నందమూరి కుటుంభం సభ్యులు దూరంగా పెడుతున్నారని ఆరోపణలు చెలరేగుతున్నాయి. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా  గత ఏడాది కాలంగా ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం నాయకులు రకరకాల కార్యక్రమాలు జరుపుతున్నా ఎక్కడ వీరిద్దరిని ఆహ్వానించలేదు.

ఇటీవల నందమూరి బాలకృష్ణ సారధ్యంలో విజయవాడలో రజనీకాంత్ ను ఆహ్వానించి ఘనంగా జరిగిన శతజయంతి ఉత్సవాలలో సహితం నందమూరి కుటుంభంలో వీరిద్దరే కనిపించలేదు. అటువంటిది మొదటిసారిగా వారిద్దరికీ సోమవారం ఆహ్వానాలు అందటం ఆసక్తి కలిగిస్తోంది.  అయితే ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆయన హాజరవుతారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

 హైదరాబాద్ లో ఈ నెల 20న జరుగబోయే ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు జూ.ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ తో సహా… నందమూరి ఫ్యామిలీని టీడీపీ నేతలు ఆహ్వానించడంతో నందమూరి అభిమానులలో ఉత్సాహం వ్యక్తం అవుతుంది.  రాజకీయాలకు దూరంగా ఉంటున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ కు ఆకస్మాత్తుగా టిడిపి నేతల నుండి పిలుపు రావడం గమనార్హం.

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరవ్వాలని జూ.ఎన్టీఆర్ ను నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ సావనీర్ కమిటీ ఛైర్మన్, టీడీపీ నేత టీడీ జనార్థన్ స్వయంగా ఆహ్వానించారు. ఈ నెల 20న హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలోని కైతలాపూర్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జూ.ఎన్టీఆర్‌ తోపాటు, కళ్యాణ్ రామ్‌, దగ్గుబాటి పురందేశ్వరి, నందమూరి ఫ్యామిలీ మొత్తానికి ఈ కార్యక్రమ నిర్వహణ కమిటీ ఆహ్వానాలు అందించింది. ఈ కార్యక్రమంలో జయహో ఎన్టీఆర్ వెబ్‌సైట్ ఆవిష్కరణ జరుగనుంది. ఈ వెబ్‌సైట్ నిర్వహణపై ఆదివారం  చంద్రబాబు నాయుడుతో జరిగిన కమిటీ సమావేశంలో ఎవరెవరిని ఆహ్వానించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఈ నెల 28న ఖమ్మంలో బిఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారధ్యంలో ఏర్పాటు చేస్తున్న ఎన్టీఆర్ విగ్రవిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించగా, ఆయన అంగీకరించారు. టీడీపీ వారు దూరంగా పెడుతున్నా ఈ మనవుడిని ఇతర పార్టీల వారు గుర్తిస్తున్నారని కధనాలు వెలువడ్డాయి.

పైగా, టిడిపికి చెప్పుకోదగిన బలంగల ఖమ్మం జిల్లాలో వ్యూహాత్మకంగా బిఆర్ఎస్ నేతలు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసి జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించి, టిడిపి, నందమూరి అభిమానాలు మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమైంది.  అందుకనే, జూనియర్ ఎన్టీఆర్ ను దూరంగా పెట్టడంలేదని సంకేతం ఇవ్వడం కోసమే చంద్రబాబు నాయుడు ఈ పర్యాయం ఈ ఆహ్వానం పంపినట్లు అర్థమవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles