తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఎన్నికల తొలివిడత మేనిఫెస్టో పట్ల అధికార వైఎస్సార్ కాంగ్రెస్ తమ కంగారును, భయాన్ని ఏమాత్రం దాచుకోలేకపోతోంది. ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన మంత్రులు,చిన్నాచితకా నాయకులు అందరూ కూడా తెలుగుదేశం మేనిఫెస్టోను ఎడాపెడా ఆడిపోసుకుంటున్నారు. ఆ మేనిఫెస్టోకు ఎక్కడ ప్రజలు ఆకర్షితులౌతారో అని కంగారు పడుతున్నారు. అదే కంగారు ముఖ్యమంత్రిలో కూడా కనిపిస్తోంది.
తాజాగా రైతులకు బటన్ నొక్కి సాయం అందించే కార్యక్రమాన్ని పత్తికొండలో ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా తన ప్రసంగంలో తెలుగుదేశం మేనిఫెస్టోను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ మేనిఫెస్టో కర్ణాటకలో పుట్టిందని జగన్ ఎద్దేవా చేశారు. కర్ణాటక ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన హామీలను , వైసీపీ అమలుచేస్తున్న పథకాలతో కలిపి తమ మేనిఫెస్టోగా చంద్రబాబు ప్రకటించారనేది జగన్ వాదన. నిజమే కావొచ్చు గాక.. మేనిఫెస్టో ఎక్కడ పుడితే మాత్రం ఏముంది.. అది ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నదా? లేదా? అనేది ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశం.
Let the light come from all the directions అని ఇంగ్లిషులో ఒక సామెత ఉంటుంది. జ్ఞానం ఎక్కడినుంచి వచ్చినా సరే నేర్చుకోవాలని, మంచి విషయం ఎక్కడున్నా సరే తీసుకోవాలని ఆ సామెత సారాంశం. మహిళలకు ఒక జిల్లాలో పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పించడం ఢిల్లీ సర్కారు నుంచి, మూడు గ్యాస్ సిలిండర్లు కర్నాటక బిజెపి నుంచి, రైతులకు పెట్టుబడి సాయం అనేది తెలంగాణ నుంచి ఇలా రకరకాల వైపులనుంచి గ్రహించి ఉండవచ్చు గాక. అయితే వీళ్లెవ్వరూ కూడా ఆ పథకాలను తమ సొంత బుర్రలోంచి పెట్టిన వారు కాదని కూడా తెలుసుకోవాలి. ఇతర ప్రాంతాలు, ఇతర దేశాల నుంచి కూడా వాళ్లు ఈ అయిడియాలను సంగ్రహించారు. ప్రస్తుతానికి ఆయా రాష్ట్రాల్లో ఆ పథకాలు పాపులర్ గా ఉన్నాయి గనుక.. అక్కడినుంచి తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. వేరేవాళ్లు మంచి పనిచేస్తున్నప్పుడు.. మనం మన ప్రజలకు ఆ మంచి చేయకూడదని జగన్ అనుకుంటున్నారో ఏమో తెలియదు.. తెదేపా మేనిఫెస్టో కర్నాటకలో పుట్టిందని అంటున్నారు.
అయినా, ఎక్కడ పుడితే ఏముంది? అది ప్రజలకు ఉపయోగపడుతున్నదా లేదా? ప్రజలను ఆకట్టుకుంటున్నదా లేదా? అనేదే ప్రధానం. తెదేపా మేనిఫెస్టో.. గేమ్ ఛేంజర్ లాగా రాష్ట్రంలోని పరిస్థితులను ఏకమొత్తంగా వారివైపు మార్చేస్తుందనే భయం జగన్ రెడ్డిలో కనిపిస్తోంది. అందుకే ఆయన మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలను విమర్శించలేక, అవి కాపీ కొట్టిన స్కీములని పసలేని ఆరోపణ చేస్తున్నారు.
ఎక్కడ పుడితే ఏముంది? కంగారెందుకు జగన్!
Sunday, March 16, 2025
