ఎంపీ ల్యాడ్స్ నిధులు సొంతానికి వాడుకున్న బిజెపి ఎంపీ

Wednesday, December 18, 2024

2014లో నాటి యుపిఎ ప్రభుత్వపు అవినీతి చర్యలకు వ్యతిరేకంగా గళం విప్పి, స్వచ్ఛమైన పాలన అందిస్తానని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ తాజాగా కర్ణాటకలో అవినీతికి మారుపేరుగా మారిన బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా ప్రచారం చేసి బొక్కబోర్లా పడ్డారు. `ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేని ప్రభుత్వం’ అంటూ తొమ్మిదేళ్ల మోదీ పాలనపై పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొంటున్న బిజెపి నేతలు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు, నోట్ల రద్దు వంటి పలు ఆరోపణలపై సమగ్ర దర్యాప్తుకు సిద్ధం కావడం లేదు.

దేశవ్యాప్తంగా పలువురు బీజేపీ నేతలపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వస్తున్నా  పట్టించుకోవడం లేదు. కేవలం ప్రతిపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి, బీజేపీలో చేరిన వారి అవినీతి చర్యలను `మాఫీ’ చేస్తున్నారు. తాజాగా, తెలంగాణాలో బిజెపి ఎంపీ ఒకరు బహిరంగంగా ఎంపీ ల్యాడ్ నిధులను తన సొంత అవసరాలకోసం వాడుకున్నానని చెప్పడం కలకలం రేపుతోంది.

బీజేపీ నేత, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఎంపీ ల్యాడ్స్ నిధులను కొడుకు పెళ్లి, ఇంటి నిర్మాణం కోసం వాడుకున్నట్లు స్వయంగా ప్రకటించడంతో బీజేపీ వర్గాలు ఆత్మరక్షణలో పడ్డాయి. స్థానిక బీజేపీ నేతల సమావేశంలో ఎంపీ సోయం బాపురావు ఈ వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎంపీలు మొత్తం నిధులు అమ్ముకున్నారన్న ఆయన తాను మాత్రం కొన్ని నిధులు మాత్రమే వాడుకున్నానని నిజాయితీగా ఒప్పుకోవడం కొసమెరుపు.

కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌ల కంటే తనకే ఎక్కువ నిధులు వచ్చాయని చెబుతూ మిగిలిన నిధులను కార్యకర్తలందరికీ సమానంగా కేటాయిస్తానని  బాపురావు చెప్పారు. ఈ విధంగా ఒప్పుకోవడం తన నిజాయతీకి నిదర్శనంగా చెప్పుకొంటున్నారు.

“ఇవాళ ఇల్లు లేకుంటే వ్యాల్యూ లేదు. కాబట్టి నేను కూడా వాస్తవంగా కొంత నిధులు వాడుకున్నాను. ఈ మాటను ఏ నాయకడు ఒప్పుకోడు. నేను ఒప్పుకుంటున్నాను. నా కొడుకు పెళ్లి చేసే అవసరం ఉంది కాబట్టి నేను కూడా ఎంపీ ల్యాడ్స్ నిధులు వాడుకున్నాను” అంటూ `నిజాయతీగా’ ప్రకటించారు.

“అంతకు ముందు దద్దమ్మ ఎంపీలు ఏంచేశారంటే… మొత్తం వాడుకున్నారు. ఇవాళ మన పార్టీలోకి వచ్చిన వారిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇంతకు ముందు వాళ్లు ఎంతకు అమ్ముడుపోయారు?” అంటూ రాజకీయ ప్రత్యర్థులపై ఎదురు దాడికి దిగారు.

ఆయన చెప్పిన ఈ మాటల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు ఎంపీ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. బాధ్యత గల ప్రజా ప్రతినిధి అయి ఉండి అభివృద్ధి కోసం ఉపయోగించాల్సిన ఎంపీ ల్యాడ్స్ నిధులను తన ఇష్టానుసారంగా వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎంపీ సోయం బాపురావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ వ్యాఖ్యలపై ఇతర పార్టీల నేతల మండిపడుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాల్సిన నిధులను సొంత పనులకు వాడుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎంపీ ల్యాడ్స్‌ను ఇష్టానుసారంగా ఎలా వాడుకుంటారని విమర్శిస్తున్నారు.  ప్రజల కోసం ఖర్చు చేయకుండా సొంత ప్రయోజనాలకు నిధులను వాడటంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎంపీ బాపురావుపై చర్యలు తీసుకోవాలని ఇతర పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ బాపురావు వ్యాఖ్యలు బీజేపీ నేతలను ఇరుకున పడేశాయి.  కార్యకర్తల సమావేశంలో తన నిజాయితీని చెప్పుకునేందుకు ప్రయత్నించిన ఎంపీ బాపురావు ఇప్పుడు చిక్కుల్లో ఇరుకున్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధులను వాడుకున్నట్లు తానే స్వయంగా ఒప్పుకోవడంపై ఆ నిధులను తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles