ఎంపీ రఘురాంకు మరో వైసీపీ ఎంపీ `చంపుతా’ అంటూ బెదిరింపు

Wednesday, January 22, 2025

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలన, అక్రమాలపై నోరు విప్పుతున్నప్పటి నుండి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పట్ల ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్నది. అనేక కేసులు నమోదు చేసి గత మూడేళ్లుగా ఏపీలో అడుగు పెట్టనీయకుండా అడ్డుకొంటుంది. ఏపీ సిఐడి ఒక కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి, చిత్రహింసలకు సహితం పాల్పడింది.

భీమవరంలో జరుగుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే కార్యక్రమంకోసం రైలులో బయలుదేరితే దారిలోనే చంపే కుట్రలు పన్నారని తెలుసుకొని వెనుదిరిగారు. సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా నిత్యం ఎన్నో బెదిరింపులు, హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. ఏపీ సిఐడి నిర్బంధంలో  తనను చిత్రహింసలకు గురిచేశారని లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లీకయింది.

సీఎం జగన్ కు మోదీ ప్రభుత్వంలోని పెద్దలతో ఉన్న సంబంధాల కారణంగా ఆయన ఫిర్యాదులపై స్పీకర్ గాని, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ గాని స్పందించడం లేదు. చివరకు ఢిల్లీ హైకోర్టు ఆదేశంపైనా హోమ్ మంత్రిత్వ శాఖ ఆయనకు `వై కేటగిరి’ భద్రతను మాత్రం కల్పించింది. ఇక బహిరంగంగా పార్లమెంట్ ఆవరణలోనే ఆయనను వైసీపీ ఎంపీలు బెదిరించడం సర్వసాధారణమై పోయింది. 

తాజాగా ఒక ఎంపీ `చంపుతా’ అంటూ అందరూ చూస్తుండగానే పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో బుధవారం బెదిరించారు.  అసభ్య పదజాలంతో తిట్ల దండకం అందుకున్నారు. ఇదంతా చేసింది ఇప్పటికే మిస్టరీగా మిగిలిపోయిన ఇటీవల విశాఖపట్టణంలో భార్య, కొడుకు, మరో మిత్రుడైన ఆడిటర్ కిడ్నాప్ కు గురయి, ఇంట్లోనే రెండు రోజులపాటు బందీలుగా ఉన్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ.

తన కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ వ్యవహారంపై స్పీకర్‌, హోం మంత్రిత్వ శాఖకు రఘురామ లేఖ రాయడంపై విశాఖ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంపేస్తా అంటూ… ఇతర ఎంపీల ముందే రఘురామపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నువ్వెవడివి నా కుటుంబం గురించి లేఖ రాయడానికి?’ అంటూ ఎంవీవీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చెప్పనలవి కాని భాషతో ఎంపి రఘురామపై పార్లమెంటు ఆవరణలో వైసీపీ ఎంపీ ఎంవీవీ దూషణలకు దిగారు. ఎంవీవీ ప్రవర్తనపై సెంట్రల్‌ హాల్‌లో కూర్చున్న ఎంపీలు ఆందోళనకు గురయ్యారు. పరిస్థితిని గమనించి వైసీపీ లోకసభా పక్ష నేత మిథున్‌ రెడ్డి ఎంవీవీని బయటికి తీసుకువెళ్లారు. ఎంవీవీ దూషిస్తున్నంత సేపు మౌనంగానే ఎంపీ మిథున్‌రెడ్డి సెంట్రల్‌ హాల్‌లో కూర్చోవడం గమనార్హం.

ఎంతగా దూషిస్తున్నా, అసభ్య పదజాలంతో నిందిస్తున్నా మౌనంగా వింటూ గడిపిన, రఘురామకృష్ణం రాజు ఆ తర్వాత ఎంవీవీ వైఖరిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విధంగా ఆయనను `చంపుతా’ అంటూ వైసిపి ఎంపీ పార్లమెంట్ లో బెదిరించడం ఇదే మొదటిసారి కాదు.  గతంలో కూడా పార్లమెంట్ 4వ నెంబర్‌ గేట్‌ సమీపంలో ‘చంపేస్తా’ అంటూ… రఘురామను హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా బెదిరించారు.

ఇలా ఉండగా, ఎన్డీయే పర్యటనలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రఘురామకృష్ణంరాజు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారు ఏపీ రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. నరసాపురం నుండి వైసీపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ భేటీ అనంతరం వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉమ్మడిగా పోటీ చేయడం ఖాయం అని రఘురామకృష్ణంరాజు ప్రకటించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles