ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు

Wednesday, January 22, 2025

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని  కస్టడీలోకి తీసుకొని విచారింపల్సి ఉందని, అరెస్ట్ చేయక తప్పదని తెలంగాణ హైకోర్టులోనే కాకుండా, సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ లు దాఖలు చేసిన సీబీఐ ఇప్పుడు అరెస్ట్ ప్రయత్నం విరమించుకున్నట్లు కనిపిస్తున్నది.

తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినా సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేయలేదు. అయితే, వివేకానందరెడ్డి కుమార్తె ముందస్తు బెయిల్ ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. అయితే తాజాగా సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో అవినాష్ రెడ్డిని 8వ నిందితుడిగా పేర్కొనడంతో వచ్చే నెల 14న వాయిదాకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.

ఈ కేసులో ఆరు, ఏడో నిందితులుగా భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. ఏప్రిల్‌ 14న ఉదయ్‌ కుమార్‌రెడ్డిని, 16న భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం సీబీఐ కోర్టులో జరిగిన విచారణకు చంచల్‌గూడ జైల్లో ఉన్న నిందితులందరూ హాజరయ్యారు. వారందరికీ ఆగస్టు 14 వరకు కోర్టు రిమాండ్‌ పొడిగించింది. 

ముందస్తు బెయిల్‌పై ఉన్న అవినాష్‌రెడ్డి ఆగస్టు 14న కోర్టుకు హాజరయ్యే విధంగా చూడాల్సిన బాధ్యతను న్యాయస్థానం సీబీఐకే అప్పగించింది. దాంతో ఇప్పటివరకు సిబిఐ విచారణకు మాత్రమే హాజరైన అవినాష్ రెడ్డి మొదటిసారిగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.  ఈ కేసులో ఇప్పటికే అనేకసార్లు అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించగా  తాజాగా కోర్టులో హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. 

ఇక ఈ కేసులో నిందితులను సీబీఐ కోర్టు ముందు ఇప్పటికే హాజరుపరిచింది. ఇందులో భాస్కర్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉదయ్ కుమార్ రెడ్డి, గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు.  కానీ అప్రూవర్ గా మారిన దస్తగిరి మాత్రం కోర్టుకు రాలేదు. దీనితో ఆయన ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు.

కాగా ఈ హత్య కేసులో ఇప్పటివరకు అవినాష్ కేవలం ఆరోపణలు ఎదుర్కొంటుండగా, సీబీఐ ఎప్పుడు కూడా నిందితుల జాబితాలో ఆయన పేరును చేర్చలేదు. కానీ అనూహ్యంగా భాస్కర్ రెడ్డి బెయిల్ పిటీషన్ విచారణ సందర్బంగా అవినాష్ రెడ్డి  ఎ 8 అని కోర్టుకు సీబీఐ చెప్పడం సంచలనంగా మారింది. వివేకా హత్యకు కుట్ర, సాక్షాల చెరిపివేతలో అవినాష్, భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ కౌంటర్ లో ఆరోపించింది.

పైగా, ఈనెల 3న వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసి, ఆ తర్వాత కొద్దిసేపటికే విడుదల చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల మొదటి వారంలో సీబీఐ విచారణకు వచ్చిన అవినాష్ రెడ్డిని ఆ సమయంలోనే అరెస్ట్ చేయడం, విడుదల చేయడం గోప్యంగా చకచకా  జరిగిపోయాయి. కానీ ఇది జరిగిన వారం రోజులకు బయటకు రావడం గమనార్హం. 

ఈ నేపథ్యంలో ఆగస్టు 14న ఏం జరగబోతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఈ లోగా అవినాష్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన బెయిల్ పై డా. సునీతా రెడ్డి వేసిన పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు తన నిర్ణయం వెల్లడిస్తుందేమో చూడాల్సి ఉంది. దీంతో ఆగస్టు 14న సీబీఐ కోర్టు చేపట్టే విచారణ కీలకంగా మారింది. ఆ రోజు సీబీఐ కోర్టు తీసుకునే నిర్ణయం ఆధారంగా సీబీఐ తదుపరి అడుగులు ఉండబోతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles