ఎంపీ అరవింద్ పై బిజెపి శ్రేణుల తిరుగుబాటు

Wednesday, January 22, 2025

నిజామాబాద్ బిజెపి ఎంపీ డి అరవింద్ కు సొంత పార్టీ నుండే నిరసనలు ఎదురవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చి రాష్త్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి తమ మోర ఆలకించాలని రాష్ట్ర కార్యాలయంలో రచ్చ చేసిన బిజెపి శ్రేణులు ఇప్పుడు నిజామాబాద్ లో నిరసనలకు తలపడుతున్నారు.

ధర్మపురి అర్వింద్‌ నుంచి బీజేపీని కాపాడాలంటూ సొంత పార్టీ నేతలే ఆందోళనకు దిగారు. అధిష్ఠానానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్వింద్‌ ఒంటెత్తు పోకడలను నిరసిస్తూ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలోని బీజేపీ సీనియర్‌ నేతలు, కార్యకర్తలు సోమవారం జిల్లా పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. ‘అర్వింద్‌ నుంచి పార్టీని కాపాడాలి’, ‘సేవ్‌ బీజేపీ’, ‘అర్వింద్‌ ఒంటెత్తు పోకడలు నశించాలి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

తొందర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో పార్టీలో అంతర్గత పోరు రచ్చకెక్కడం పార్టీ నాయకత్వంకు ఆందోళన కలిగిస్తున్నది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకొనే బీజేపీలో గతంలో ఎన్నడూ లేనంతగా అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు.  నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు, పార్టీ జిల్లా అధ్య‌క్షుడు బస్వా ల‌క్ష్మిన‌ర్స‌య్యకు వ్య‌తిరేకంగా నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయం ఎదుట బాల్కొండ ఇచ్చార్జ్ రాజేశ్వ‌ర్ ఆద్వ‌ర్యంలో పార్టీ కార్యాలయాన్ని ముట్ట‌డించారు. 13 మండలాల బీజేపీ అధ్యక్షులను అర్వింద్ ఏకపక్షంగా మార్చడంపై ఆగ్రహజ్వాలలు వ్యక్తం చేస్తున్నారు.

ఏకపక్ష నిర్ణయాలతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న అర్వింద్‌ను వచ్చే ఎన్నికల్లో బొంద పెడతామని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు. అర్వింద్‌ కన్నా తామే బీజేపీలో సీనియర్లమని, అర్వింద్‌ తన స్వార్థం కోసం తన తండ్రి మాటున కాంగ్రెస్‌ జెండాలు మోసి 2019 ఎన్నికల ముందు బీజేపీలోకి వచ్చాడని గుర్తుచేశారు. ఆయన గెలుపులో తమ పాత్రా ఉన్నదని స్పష్టం చేశారు. 
ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అర్వింద్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణాలో పార్టీ పుంజుకొంటున్న తరుణంలో పార్టీ కోసం కష్టపడుతున్న వారిని పక్కకు నెట్టివేసి భజనపరులను అందలం ఎక్కించడం ద్వారా పార్టీకి తీరని ద్రోహం చేస్తున్నట్లు తీవ్రమైన ఆరోపణలు చేశారు.

తమ పోరాటాన్ని ఢిల్లీకి కూడా తీసుకు వెడతామని, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా దృష్టికి సమస్యను తీసుకెళ్తామని బీజేపీ నేతలు తెలిపారు.  పార్టీ కార్యాలయంలో బీజెవైఎం సమావేశం నడుస్తుండగా ఈ నిరసన చోటుచేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా  రొయ్యడి రాజేశ్వర్ మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారు, బీజేపీ పార్టీని నమ్ముకున్న వారిని పదవుల నుంచి తొలగించడం ఎంత వరకు సమంజసం? అని ప్రశ్నించారు. గ్రామస్థాయిలో బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేసి మండల అధ్యక్షులను ఎన్నుకోవాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా వారికి ఇష్టం వచ్చిన వారికి పదవులు ఇచ్చి నియంతలా వ్య‌వ‌హారిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles