తన రాజకీయ ప్రత్యర్థి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరకు తీయకుండా, వారి మధ్య దూరం పెంచడం కోసం ఎత్తుగడలు వేస్తూ, ఆంధ్ర ప్రదేశ్ లో తానే అసలైన `మిత్రుడిని’ అనే విధంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని తరచూ రెచ్చగొట్టి కేంద్రంపై పోరాటంపై రెచ్చగొట్టే విధంగా అసమ్మతి ఎంపీ రఘురామకృష్ణంరాజు తరచూ ఎత్తుగడలు వేస్తూనే ఉన్నారు.
తాజాగా ఈనెల 29న ఎంపీలతో మూకుమ్మడి రాజీనామాలు చేపిద్దం రండి అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబును కాళ్ళ, వెళ్ళా పడి బ్రతిమాలి, టిడిపి ఎంపీలను ఒప్పించే బాధ్యత తాను తీసుకుంటానాని చెబుతూ వైసిపి ఎంపీలతో రాజీనామా చేయిస్తారా అంటూ ప్రశ్నించారు
గతంలో ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని టిడిపి హయాంలో ప్రతిపాదించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల చివరి రోజు మరొకసారి ఎంపీల మూకుమ్మడి రాజీనామాలకు ప్రతిపాదన చేయాలని డిమాండ్ చేశారు.
తన పార్లమెంట్ సభ్యత్వానికి తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలకు గాను 25 మంది ఎంపీలు రాజీనామా చేయడం ద్వారా కేంద్రంపై వత్తిడికి తీసుకు వద్దామని సూచించారు.
`వ్యక్తిగత అవసరాల కోసం’ కేంద్రంతో పోరుకు జగన్ వెనుకడుగు వేస్తుండటాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, ఆ హామీని విస్మరిస్తే ప్రజలు అసహ్యించుకుంటారని సున్నితంగా హెచ్చరించారు.
తనని పార్టీ సభ్యుడిగా పరిగణలోకి తీసుకోకపోయినప్పటికీ, తాను మాత్రం రాజీనామా చేయడానికి సిద్ధమేనని తెలిపారు . 1937లో జరిగిన శ్రీ బాగ్ ఒప్పందం గురించి మాట్లాడుతున్న మనం… నిన్న మొన్నటి వరకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడి, ఇప్పుడు విస్మరిస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు .
హామీల అమలు పట్టించుకోక పోవడంతో జగన్ పాలన అంతా తిరోగమన దిశలో సాగుతుందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. అవునంటే కాదనిలే… కాదంటే అవునని లే … జగన్ మాటలకు అర్ధాలే లేవులే అని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికే 50 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగించారని గుర్తు చేశారు.
మిగిలిన వారిని కూడా తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెబుతూ ఎందుకంటే ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఎద్దేవా చేశారు. ఐదవ తేదీ వచ్చినప్పటికీ, 50 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులకు , 75 శాతం మంది ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించలేదని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగించిన తర్వాత ఆ పనులు ఎవరి చేత చేయిస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారిందని చెప్పారు. పదవ తరగతి వరకు చదివిన వాలంటీర్లతో ఆ పనులన్నీ చేయిస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. ఇంజనీరింగ్, మున్సిపల్ డ్రాయింగ్ లతో పాటు, రేపు ఉపాధ్యాయులు సమ్మెకు దిగితే, విద్యార్థులకు పాఠాలను కూడా వాలంటీర్లతోటే చెప్పిస్తారా? అంటూ ప్రశ్నించారు. అక్కరకు లేని వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి, అవసరమైన ఉద్యోగులను తొలగించడం ఏమిటని నిలదీశారు.