ఎంఎల్‌సి ఎన్నికల్లో ఏదో విధంగా గెలుపొందడం కోసం ఒక వంక భారీ ఎత్తున నకిలీ ఓటర్లను చేర్పించగా, మరోవంక పెద్ద ఎత్తున ప్రలోభాలకు ఓటర్లను గురిచేసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తున్నది. అధికారులు సహితం వారి అక్రమాలకు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోతున్నారు.
తాజాగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో ఏకంగా వెండి నాణేల పంపిణీకి తెగబడింది. ఆర్‌కె బీచ్ వద్ద ఉన్న వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ కార్యాలయంలో వేల సంఖ్యలో వెండి నాణేలను సిద్ధం చేశారని బైటకు రావడంతో కలకలం చెలరేగింది.
ఈ విషయం తెలుసుకున్న పిడిఎఫ్ నాయకులు జిల్లా ఎన్నికల అధికారులకు శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. రాత్రి ఏడు గంటల వరకు కూడా అధికారుల్లో స్పందన కనిపించకపోవడంతో పిడిఎఫ్, సిపిఎం, టిడిపి, ప్రజా సంఘాల నేతల అక్కడకు చేరుకున్నారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శాంతిభద్రతలకు విఘాతం కల్పించవద్దంటూ వారిని అక్కడి నుండి పంపేశారు. మరోవైపు వైసీపీ నాయకులు వెండి నాణేలను రెండు కార్లలో అక్కడి నుండి తరలించారు. వైసిసి నిర్వహించిన ఆత్మీయ సమావేశాల వద్దకు వాటిని తరలించినట్లు చెబుతున్నారు.
బ్లాక్ ‘ఎ’, రూమ్ నెంబర్ 101లో కొంతమంది విద్యార్థులతో ఈ వెండి నాణేల ప్యాకింగ్ కార్యక్రమం జరుగుతోందని. 15 గ్రాముల బరువు ఉన్న వెండి నాణేలను వేల సంఖ్యలో సిద్ధం చేశారని స్పష్టమైన ఆధారాలతో ఫిర్యాదు చేసినా జిల్లా కలెక్టర్‌గానీ, ఎన్నికల కమిషన్‌గానీ, స్థానిక అధికారులుగానీ పట్టించుకోలేదు.
పైగా, ఫిర్యాదు చేసిన రెండు గంటల తరువాత తహశీల్దారు, స్థానిక పోలీసులు వచ్చారని, ఫిర్యాదు చేసిన వారిని అక్కడి నుంచి బయటకు పంపించేశారని తెలిపారు. వైసీపీ నేతలు వాటిని అక్కడి నుంచి తరలించేందుకు ఓ విధంగా సహకరించారు.
అధికార పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఓ పార్టీ కార్యకర్త మాదిరిగా వైసిపి నేతలతో కలసి ప్రయివేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో సమావేశం పెట్టి దొరికిపోయినా ఆయనపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఇప్పుడు ఏకంగా వెండి, డబ్బులు పంపిణీకి సిద్ధమయ్యారు.
కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు అరికట్టాలంటూ సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, ఆప్ పార్టీల ఆధ్వర్యంలో తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో అధికార పార్టీ అక్రమాలకు ఎన్నికల కమిషన్ అడ్డుకట్ట వేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కనీసం ఐదో తరగతి చదవని వారికి కూడా డిగ్రీ ఉన్నట్లు సృష్టించి ఓటు హక్కు కల్పించారని విమర్శించారు. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని వైసీపీ అక్రమాలు నివారించాలని కోరారు.
తిరుపతిని దొంగ ఓటర్లకు కేంద్రంగా వైసీపీ మార్చిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు. చదువురాని, వేలిముద్ర వేసే 7 వేల మందిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటర్లుగా చేర్చారని ఆమె మీడియా సమావేశంలో వెల్లడించారు. నగరంలోని నాలుగు పోలీసు స్టేషన్లలో నకిలీ ఓటర్లపై కేసులు నమోదు చేయాలని 16 ఫిర్యాదులు చేశామని ఆమె చెప్పారు.