ఎంఎల్‌ఏల ఎర కేసులో ప్రగతి భవన్ కు సిబిఐ!

Thursday, January 23, 2025

ఎంఎల్‌ఏల ఎర కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. సిబిఐకి అప్పగించొద్దంటూ రాష్ట్రప్రభుత్వం, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ పైలట్ రోహిత్ రెడ్డి పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. సిబిఐకి గతంలో కేసును అప్పగించిన సింగిల్ జడ్జి తీర్పును తప్పుబట్టలేమని, అందులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

పైగా, హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉందని పేర్కొంటూ, అందుకు తీర్పును 15 రోజుల పాటు అమలు చేయకుండా చూడాలని అడ్వొకేట్ జనరల్ కోరినా అందుకు హైకోర్టు నిరాకరించింది. దానితో ఈ కేసు విచారణను సిబిఐ సత్వరం చేపట్టి, మొదటగా సీఎం చంద్రశేఖరరావును విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అందుకోసం సిబిఐ బృందం నేరుగా ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతి భవన్ కు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.

గతంలో హైకోర్టు న్యాయమూర్తి విజయసేన్ రెడ్డి ఎంఎల్‌ఏల ఎర కేసును సిబిఐకి బదిలీ చేయాలని తీర్పునిచ్చారు. సిట్‌తో పాటు ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును కూడా రద్దు చేసింది. సింగిల్ జడ్జీ తీర్పును సవాలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేసుకుంది. ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్, న్యాయమూర్తి ఎన్. తుకారాం ధర్మాసనం అప్పీలుపై సుదీర్ఘ విచారణ జరిపింది. తాజాగా సింగిల్ జడ్జీ తీర్పును సమర్థిస్తూ తీర్పునిచ్చింది.

దానితో ఇప్పుడు ఏక్షణమైన సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. ఒకసారి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాక ఎమ్యెల్యేలు పైలెట్‌ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావులను ప్రశ్నించనుంది. ప్రగతి భవన్ వేదికగా కథ అంతా నడవడంతో కేసులో ఆధారాలు ప్రగతి భవన్‌కు ఎలా చేరాయనే విషయంపై సీబీఐ నిగ్గు తేల్చనుంది.

అందుకోసం, ముఖ్యమంత్రికి ఎవరు, ఎప్పుడు ఎందుకు అందజేశారు? దర్యాప్తు కొనసాగుతుండగానే విలేకరుల సమావేశం పెట్టి మరీ పూర్తి వివరాలు బయటపెట్టడంపై సీబీఐ ముఖ్యమంత్రిని కూడా ప్రశ్నించే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఈ కేసును అడ్డుపెట్టుకొని బీజేపీ కీలక నేతలను ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నించిన కేసీఆర్ ఇప్పుడు స్వయంగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది.

కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోర్టు తీర్పును స్వాగతించారు. దీనిపై గతంలో మేము కూడా పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొంటూ ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల లావాదేవీలపై సీబీఐ విచారణ జరపాలని భట్టి డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న పార్టీ ఎమ్మెల్యేల కొనుగోళ్లపై కూడా దర్యాప్తు చేయాలని స్పష్టం చేశారు.

ఎంఎల్‌ఎల ప్రలోభాల కేసులో సిబిఐ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్ రావు భరోసా వ్యక్తం చేశారు. ఎంఎల్‌ఎల ప్రలోభాల కేసులో సిట్‌ను తెలంగాణ ప్రభుత్వం తనకు అనుకూలంగా వాడుకుందని ఆయన ఆరోపించారు. తప్పు చేయకపోతే సిబిఐ విచారణ అంటే భయమెందుకని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలను ఆయన ప్రశ్నించారు. ధైర్యంగా సిబిఐ విచారణ ఎదుర్కొవాలని రఘునందన్ కోరారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles