ఉమ్మడి పౌరస్మృతిపై వైసిపి, టిడిపి ఇరకాటం

Thursday, December 26, 2024

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఉమ్మడి పౌరస్మృతిపై నిర్దిష్టంగా ఓ విధానం తీసుకొనేందుకు ఏపీలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన వైసీపీ, టీడీపీ – ఇద్దరూ ఇరకాట పరిస్థితి ఎదుర్కొంటున్నారు. తెలంగాణలోని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాదిరిగా దాన్ని పూర్తిగా వ్యతిరేకించలేక పోతున్నారు. 

ఆ విధంగా వ్యతిరేకించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీని దిక్కరించినట్లు ఉండేందుకు సాహసించడం లేదు. మరోవంక, మద్దతు పలకడం ద్వారా రాష్ట్రంలోని ముస్లింలను దూరం చేసుకొనేందుకు కూడా సిద్ధంగా లేరు. అందుకనే ఈ విషయమై ఈ రెండు పార్టీలు ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాత్రం ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తున్నట్లు ముందుగానే ప్రకటించారు.

ముందుగా ఈ విషయంలో తాము బిజెపి `ట్రాప్’లో పడటం లేదని ముస్లింలకు నచ్చచెప్పడం కోసం రెండు పార్టీల అధినేతలు – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నానాతంటాలు పడుతున్నారు. ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ముస్లిం మత పెద్దలు వారిద్దరితో విడివిడిగా బుధవారం భేటీ అయినప్పుడు వారికి అండగా ఉంటామని చెబుతూనే అస్పష్టత వ్యక్తం చేశారు.

ఎన్నికల ముందు కేంద్రం ఈ అంశాన్ని తెరపైకి తీసుకు రావడం ఒక విధంగా ఏపీలోని రెండు  ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలకు శరాఘాతంగా మారిందని చెప్పవచ్చు. ఈ సమస్యను వ్యూహాత్మకంగా అధిగమించలేని పక్షంలో ఆయా పార్టీల ఓటు బ్యాంకులపై తీవ్ర ప్రభావం పడక తప్పదు. అదీ దీర్ఘకాల ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఈ రెండు పార్టీల అధినేతలు ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుంది.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయిన ముస్లిం మత పెద్దలతో సీఎం జగన్‌ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల, మైనార్టీల ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ముస్లిం వర్గం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఇంకా ముసాయిదా బిల్లు రాలేదని, అందులో ఏ అంశాలు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియదని  అంటూ మీడియాలో చర్చలు చూసి ఆందోళన చెందవద్దని వారికి హితవు చెప్పారు. 

అయితే, ముస్లిం ఆడబిడ్డల హక్కుల రక్షణ విషయంలో ముస్లిం వర్గమే వ్యతిరేకంగా ఉందనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందని జగన్ వారి వద్ద ప్రస్తావించారు. ఇలాంటి వాటిని తిప్పికొట్టాలని ముస్లిం పెద్దలకు సూచించారు. ఒకే కడుపున పుట్టిన బిడ్డల విషయంలో ఏ తండ్రైనా, ఏ తల్లి అయినా భేదాలు చూపించరని హితవు చెప్పారు. అలాగే మహిళలకు సమాన హక్కుల విషయంలో రాజీపడమని స్పష్టం చేద్దామని సీఎం పేర్కొన్నారు.

మరోవంక, ముస్లిం మత పెద్దలతో పాటు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేతలు చంద్రబాబు భేటీ అవుతూ ముస్లింలకు విరుద్ధంగా టీడీపీ ఏ నిర్ణయం తీసుకోదని వారికి స్పష్టం చేశారు. ముస్లిం పెద్ద ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి పౌరస్మృతి బిల్లు భారత దేశ సంస్కృతికి విరుద్ధమని తేల్చి చెప్పారు. ముస్లింల హక్కుల రక్షణకు కట్టుబడి ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు.

టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ ముస్లిం మతపర విశ్వాసాలకు తప్పకుండా అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితిల్లో ముస్లిం, మైనార్టీలు లేరని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 రద్దుపై పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును సైతం సీఎం జగన్మోహన్ రెడ్డి సమర్థించారని గుర్తు చేశారు.

పార్లమెంటులో ముస్లిం వ్యతిరేక చట్టాలన్నింటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికిందని పేర్కొంటూ నాలుగేళ్ల పాటు బీజేపీతో అంటకాగిన వైసీపీ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందని దుయ్యబట్టారు. గత నాలుగేళ్లుగా ముస్లిం మైనారిటీలపై జరిగిన ఏ దాడి పట్లా జగన్మోహన్ రెడ్డి కనీసం స్పందించలేదని ధ్వజమెత్తారు. రాజకీయ అవసరాల కోసం ముస్లిం ఓటు బ్యాంకు వాడుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles