ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంతో రసవత్తరంగా మారుతున్నాయి. స్థానిక సంస్థలు, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాలను గరిష్టంగా వైసీపీ దక్కించుకుంటోంది. అయితే.. ప్రజలు ఓట్లు వేయాల్సిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు అలా కాదు. ప్రజలు ఓట్లు వేయాలి. సార్వత్రిక ఎన్నికల్లో వారిని నమ్మించడానికి పార్టీలు ఎన్ని పాట్లు పడతాయో.. ఈ ఎన్నికల్లో కూడా అంతే ప్రయత్నం జరగాలి. అదొక ముఖ్యాంశం అయితే.. ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ దఫా 37 మంది బరిలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వకుండా పలువురిని అడ్డుకుని ఏకగ్రీవాల మాయచేసిన వైసీపీ ఈ విషయంలో ఏమ చేయలేకపోయింది. ఇందరు బరిలో ఉన్నప్పటికీ.. ప్రధానంగా పోటీ నలుగురి మధ్య ఉంది. వైసీపీ, టీడీపీ, పీడీఎఫ్, బిజెపి అభ్యర్థులు కీలకం. వీరిలో బిజెపి మాధవ్ గతంలో కూడా ఎమ్మెల్సీగా చేశారు. వైసీపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ ను నిలబెట్టింది.
సార్వత్రిక ఎన్నికల్లాగానే పట్టభద్రులకు తాయిలాలు, ఓట్ల కొనుగోళ్లు లాంటి చాటుమాటు వ్యవహారాలు ముమ్మరంగా సాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అభ్యర్థులు భారీ ఖర్చుకు వెనుకాడడం లేదు. ఈ ఖర్చుల గొడవలు ఎలా ఉన్నప్పటికీ.. సహజంగా అధికార పార్టీకి ఉండే ఎడ్వాంటేజీలు వైసీపీకి ఉంటాయి. వారు ఓటర్ల నమోదు దశ నుంచే చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారని, అనేక నకిలీ ఓట్లు నమోదు అయ్యాయని అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో వైసీపీ గెలిచే అవకాశాలను పదిలంగానే చూసుకుంటోంది.
అయితే ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినంత వరకు కేవలం విజయం అనేది వైసీపీకి సరిపోదు. నలుగురు ప్రధానంగా తలపడుతున్నారు గనుక.. 30-40 ఓటు శాతం కూడా అభ్యర్థికి విజయాన్ని అందిస్తుంది. కానీ.. ఇవి వారికి ప్రత్యేకమైన ఎన్నికలు. కనీసం 50 దాటిన ఓటు శాతంతో గెలిస్తే తప్ప వైఎస్సార్ కాంగ్రెస్ కు పరువు దక్కదు.
ఎందుకంటే.. విశాఖకు రాజధాని ద్వారా.. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తాం అని ఆ పార్టీ మాటలు చెబుతున్న నేపథ్యంలో చదువరుల వర్గం అనదగిన పట్టభద్రులు ఆ మాటలను ఎంత మేర నమ్ముతున్నారో.. విశాఖ రాజధానికి చదువుకున్న అక్కడి ప్రజలలో ఎంత మేర సానుకూలత ఉన్నదో ఈ ఎన్నికల్లో తేలుతుంది. మూడు రాజధానుల ఎజెండాతోనే వచ్చే ఎన్నికలకు వెళ్తాం అని వైసీపీ నాయకులు అంటూ ఉంటారు. అలాంటి ప్రయత్నానికి ఈ ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నిక లిట్మస్ టెస్ట్ లాంటిది.
సూటిగా చెప్పాలంటే.. విపక్షాలు తెలుగుదేశం, బిజెపి, పీడీఎఫ్ ముగ్గురూ కూడా అమరావతి రాజధానిని సమర్థిస్తున్న వారే. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురికీ కలిపి.. వైఎస్సార్ కాంగ్రెస్ కంటె ఎక్కువ ఓట్లు సాధిస్తే గనుక.. విశాఖ రాజధాని అనే మాటను అక్కడి ప్రజలు మెచ్చుకోవడం లేదని, వైసీపీని నమ్మడం లేదని అర్థం చేసుకోవాలి.
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ : గెలుపు కాదు ఓట్ షేర్ ముఖ్యం!
Thursday, December 19, 2024