ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌లో ఈ వ్యవస్థ మీద ప్రజలకు, మేధావులకు, ఏ కొంతైనా నమ్మకం మిగిలి ఉన్నది అంటే అందుకు ప్రధాన కారణాలలో ఎన్నికల సంఘానికి ఉండే స్వతంత్ర ప్రతిపత్తి కూడా ఉంటుంది. దేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వ్యవస్థ రాజకీయ పార్టీలతో ఏమాత్రం సంబంధం లేకుండా.. స్వతంత్ర వైఖరితో వ్యవహరించగల అవకాశం ఉన్నందున ప్రజాస్వామ్యం అంతో ఇంతో పరిఢవిల్లుతున్నదనే అభిప్రాయం అనేక మందికి ఉంది. అయితే కేంద్రం పరిధిలోని అనేక స్వతంత్ర ప్రతిపత్తి ఉండే వ్యవస్థలను తమ చెప్పు చేతుల్లోకి తీసుకున్న తీరుగానే మోడీ సర్కారు ఎన్నికల సంఘాన్ని కూడా తమ అదుపులో పెట్టుకోవాలని అనుకుంటున్నదా? అని అనుమానం ఇప్పుడు పలువురికి కలుగుతోంది. కేంద్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల నియామకం విషయంలో నిర్ణయం తీసుకోవడానికి పూర్తి అధికారం తమ చేతిలో ఉండేలా కేంద్రం కొత్త బిల్లు తీసుకురావడం వివాదాస్పదం అవుతోంది.
ఇదివరకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను బట్టి రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను నియమించేవారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఈ పద్ధతిలో మార్పు వచ్చింది. ప్రధానమంత్రి లోక్ సభలో విపక్ష నాయకుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముగ్గురూ కలిసి సిఇసి, ఈసి లను ఎంపిక చేసే పద్ధతి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
అయితే ఇందులో కొన్ని మార్పులు చేస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను పక్కకు తప్పించి, ఆయన స్థానంలో ప్రధాని ప్రతిపాదించే ఒక కేంద్రమంత్రి ఉండేలాగా ముగ్గురు సభ్యుల కమిటీ ఎంపిక చేసేలా ప్రభుత్వం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దీనివలన సీఈసీ, ఈసీ లను నియమించే ముగ్గురు సభ్యుల కమిటీలో ఇద్దరు పాలక పక్షానికి చెందినవారు ఉంటారు. అంటే నిర్ద్వంద్వంగా అధికారంలో ఉన్న వారి మాట మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ ఏర్పాటు ఎన్నికల వ్యవస్థను కూడా తన చెప్పు చేతుల్లోకి తీసుకోవడానికి మోడీ చేస్తున్న ప్రయత్నం అని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు ఎల్ కె అద్వానీ గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా ఈసీ నియామకం విషయంలో చేసిన సూచనలను కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెరమీదకు తెస్తోంది. రాజ్యాంగ సంస్థల్లో నియామకాలు ద్వైపాక్షిక విధానంలో ఉండాలంటూ అద్వానీ అప్పట్లో లేఖ రాశారు. ప్రధానితో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పార్లమెంటులోని ఉభయసభల ప్రతిపక్ష నేతలు కూడా ఈసీ కమిషనర్ల నియామక కమిటీలో ఉండాలని ప్రతిపాదించారు. ఆ స్ఫూర్తికి మోడీ సర్కారు తీసుకువచ్చిన బిల్లు పూర్తి విరుద్ధంగా ఉంది. అందుచేతనే వ్యవస్థలను తమ అదుపులో పెట్టుకోవడానికి ఇది బిజెపి చేస్తున్న కుట్ర అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.