ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు.. తమను ప్రజలు తిరస్కరించారని ఒప్పుకోవడానికి చాలా మొండికేస్తాయి. ఆ మాట ఒప్పుకుంటే చాలా హుందాగా ఉంటుందని, తమలో వ్యక్తమైన వ్యతిరేకతను వారు గుర్తించారని అర్థమై ప్రజలు వారి పట్ల సానుభూతి చూపిస్తారనే సంగతి కూడా వారు గ్రహించరు. రకరకాల అర్థం పర్థంలేని సాకులు చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి అనేక సాకుల్లో ఈవీఎంల హ్యాకింగ్ అనేది కూడా ఒకటి. ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఓడిపోయిన పార్టీ ఈ ఆరోపణ చేస్తుంటుంది. ప్రజాదరణ తమకే ఉన్నదని ఈవీఎంలు హ్యాక్ చేయడం ద్వారా తమ ప్రత్యర్థులు గెలిచారని అంటుంటారు.
ఇప్పుడు ఎన్నికలు పూర్తి కాలేదు గానీ.. రాబోయే ఎన్నికలకు ఇప్పటినుంచి ఈవీఎం ల హ్యాకింగ్ కు సంబంధించిన ప్రయత్నాలు మొదలయ్యాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఈవీఎం హ్యాకింగ్ కు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని దీదీ అంటున్నారు. దేశాన్ని తాము ఏర్పాటుచేసిన ఇం.డి.యా మాత్రమే కాపాడుతుందని చెబుతున్న ఆమె.. మోడీ సర్కారు మీద ఈవీఎం హ్యాకింగ్ నిందలు వేస్తున్నారు.
నిజానికి ఈవీఎంలకు సంబంధించిన గొడవ ప్రతిసారీ రేగుతూనే ఉంటుంది. అలాంటి ఆరోపణలు చేసే వారికి అనుకూలురైన కొందరు టెక్ నిపుణులు.. ఈవీఎంను హ్యాక్ చేసి చూపిస్తుంటారు. ఎన్నికల సంఘం మాత్రం ప్రతిసారీ మన ఈవీఎంలు హ్యాకింగ్ కు అవకాశం లేనేలేదని ఢంకా బజాయించి చెబుతూ ఉంటుంది.
ఒకవేళ మమతా దీదీ చేస్తున్న ఆరోపణలు నిజమేఅని, అలాంటి అవకాశం ఉంటుందనే అనుకుందాం..! అలాంటప్పుడు ఆ పనిని చేయగల మోడీ సర్కారు మమతా దీదీని పశ్చిమ బెంగాల్లో ఎందుకు ఓడించలేకపోయింది. ఆ రాష్ట్రంలో భాజపా జెండా ఎగరేయాలని.. మోడీ- అమిత్ షా ల ద్వయం ఎంత చెమటోడ్చిందో అందరికంటె బాగా మమతా దీదీకే తెలుసు. ఎంత కష్టపడినా, ఎంత ముమ్మరమైన ప్రచారం నిర్వహించినా, ఎన్ని రోడ్ షో లు నిర్వహించినా వారికి ఫలం దక్కలేదు. మమతా బెనర్జీనే తిరిగి సీఎం అయ్యారు. ఈవీఎంల ద్వారానే ఫలితాలు డిసైడ్ అయ్యేట్లయితే మోడీ సర్కారు ఆ పని అప్పుడే చేయలేకపోయిందా? అని పలువురి సందేహం. ఈవీఎం హ్యాకింగ్ వంటి బ్రహ్మాస్త్రం చేతిలో ఉన్న తర్వాత.. దేశంలో నూరుకోట్ల మంది ప్రజలు కోరుకున్నా సరే.. ఇం.డి.యా. సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడకుండా చేయగలరు కదా.. అనే లాజిక్ ను ఆమె మిస్సవుతున్నారు.
హ్యాకింగ్ చేయబోతున్నారని, ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సెకండ్ గ్రేడ్ లీడర్ల లాగా మాట్లాడడం మమతాదీదీకి తగదు. ఆధారాలే ఉంటే.. వాటిని బయటపెట్టి అలాంటి కేంద్రప్రభుత్వపు బుద్ధులను ఎండగట్టాలి. ఆ పనిచేయకపోతే ఆమె ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసినట్టే అవుతుంది.