గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు లక్ష్యంగా ఈడీ తెలంగాణాలో పలు సోదాలు పాల్పడుతున్నది. విచారణకు ఆ పార్టీ నేతలను, వారి సన్నిహితులను పిలుస్తున్నది. నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, పార్టీ ఎమ్యెల్సీ కవిత పేరును ఢిల్లీ లిక్కర్ స్కాం రేమండ్ రిపోర్ట్ లో ప్రస్తావించారు. సిబిఐ కవితను విచారణకు కూడా పిలిచింది.
అయితే కేసీఆర్ ఈ సోదాలపై ఇప్పటి వరకు మౌనంగా ఉంటూ వస్తున్నారు. సోదాలు గురైన మంత్రులు, ముఖ్య నాయకులతో సమాలోచనలు జరపడం తప్పా పార్టీ పరంగా సమావేశాలు జరిపిన దాఖలాలు కూడా లేవు. వీటిపై ఆయన ఏ విధంగా స్పందిస్తారో అన్న ఆసక్తి నెలకొంది. మరోవంక, వచ్చే వారం నుండి ఓ వారం రోజులపాటు రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుపుతున్నట్లు ప్రకటించారు.
ఈ సమావేశాలను కేవలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై దాడి చేయడం కోసమే ఉద్దేశించినట్లు చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక ప్రకటనలు చేయనున్నారని తెలుస్తోంది. డిసెంబర్ 13తో సీఎం కేసీఆర్ రెండో దఫా సీఎంగా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తవనున్న నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కీలక చర్యలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఆదివారం కేసీఆర్ జరుపనున్న మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన సందర్భంగా ఈడీ దాడులపై కేంద్రంపై విరుచుకు పడే అవకాశం ఉన్నదని రాజకీయ వర్గాలలో భావిస్తున్నారు. నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవంతో పాటు పాత కలెక్టరేట్ స్థానంలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
ఒక్క ఏడాదిలో పనులు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తేనున్ను. బస్టాండ్ సమీపంలో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. మినీ ట్యాంక్ బండ్ వద్ద చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన కార్యక్రమం కూడా ఉండనుంది.
ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి పాల్గొనే భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభలో పాల్గొననున్న కేసీఆర్.. తెలంగాణలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలపై స్పందిస్తారా ? అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కేసీఆర్ బీజేపీనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బీజేపీ తమను ఇబ్బంది పెట్టేందుకు ఈడీని ఉపయోగించుకుంటోందని కేసీఆర్ విమర్శలు గుప్పిస్తారా ? లేక మరో విధంగా కేంద్రంలోని బీజేపీని లక్ష్యంగా చేసుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవంక, ఎమ్యెల్యేల కొనుగోలు కేసు గురించి సహితం మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత రెండు, మూడు రోజులు ప్రస్తావించిన కేసీఆర్ ఆ విషయమై మౌనంగానే ఉంటున్నారు. ఇప్పటికే పలు మలుపులు తిరుగుతున్న ఈ కేసు గురించి మరోసారి ప్రస్తావించే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. ముఖ్యంగా బీజేపీ కీలక నేత బి ఎల్ సంతోష్ ఈ కేసులో కీలకమైన సూత్రధారి అని తేలడంతో బీజేపీ అధిష్టానంపై దండెత్తడానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది.