ఈటెల బీజేపీలో మౌనంగా ఉండటమా? కాంగ్రెస్ లో చేరడమా?!

Monday, September 16, 2024

ఏడాదిన్నర క్రితం తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు తమకు లభించిన వజ్రాయుధం మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అని సంబరపడిన బిజెపి అగ్రనేతలకు కొద్దీ రోజులుగా ఆయన మౌనంగా ఉండటం మింగుడు పడటం లేదు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు రాగానే ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలను కలిసి బండి సంజయ్ నేతృత్వంలో తెలంగాణాలో బిజెపి ఎన్నికలను ఎదుర్కోలేదని స్పష్టం చేసొచ్చారు.

మరోవంక, ఆయన వాదనలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి నేతలు కూడా సమర్ధించారు. రాష్త్ర నాయకత్వంలో మార్పు చేయబోతున్నామని సంకేతం ఇచ్చారు. కానీ ఆ తర్వాత బిజెపి అగ్రనాయకత్వం యు టర్న్ తీసుకుంది. కనీసం, ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ఎన్నికలకు సంబంధించి కీలక బాధ్యతలు అప్పజెప్పుతారనే ప్రచారం జరిగింది. అది కూడా జరగడం లేదు.

మొదట్లో ఈటెలను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేయాలనే ప్రతిపాదన బిజెపి అగ్రనాయకత్వం నుండే వచ్చింది. ఈ  మధ్య ఆయనను ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి.  అవేమీ కార్యరూపం దాల్చలేదు. కొద్దిరోజుల క్రితం అస్సాం వెళ్లి, అక్కడి బీజేపీ ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మను కలిసి, ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసిన తర్వాత ఈటెల రాజేందర్ దాదాపు మౌనంగా ఉంటున్నారు.

ఆయన బీజేపీ కార్యాలయంకు రావడం లేదు. పార్టీ కార్యక్రమాలలో ఎక్కడ పాల్గొనడం లేదు. బండి సంజయ్ వంటి నేతలు సహితం ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారని తెలుసుకొనే ప్రయత్నం కూడా చేయడం లేదు. కేవలం రాజేందర్ మాత్రమే కాకుండా పలువురు `వలస నేతలు’ అసమ్మతితో ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ బిజెపిని విమర్శించడం మానేశారు. కేవలం కాంగ్రెస్ పైననే విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవంక మోదీ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదేళ్లు అయినా సందర్భంగా బిజెపి నేతలు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో సహితం మోదీ ప్రభుత్వ విజయాలను వివరించేందుకు పరిమితం అవుతున్నారు. కాంగ్రెస్ పై విమర్శలు కురిపిస్తున్నారు. బిజెపి సహితం కేసీఆర్ పై విమర్శలు తగ్గించినట్లు స్పష్టం అవుతుంది.

ఈ పరిణామాలు కేసీఆర్ ను గద్దె దింపాలని పట్టుదలతో బీజేపీలో చేరిన నేతలకు ఆగ్రహం కలిగించేందుకు దారితీస్తున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత నిండా మునిగినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థల అఫిడవిట్ లు స్పష్టం చేస్తున్నా ఆమెపై చర్య తీసుకొక  పోవడం సహితం వీరిలో అసహనంపై దారితీస్తుంది.  కేసీఆర్ బీజేపీ అగ్రనేతలతో అవగాహనకు వచ్చారనే ప్రచారంకు బలం చేకూరుతుంది.

బీజేపీ అగ్రనేతలు తెలంగాణాలో కేసీఆర్ మూడోసారి గద్దె ఎక్కకుండా చేయడంకన్నా ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే ముఖ్యం అనే విధంగా వ్యవహరిస్తున్నారు. బిజెపి ఎట్లాగూ తెలంగాణాలో కాంగ్రెస్ కన్నా వెనుకబడడంతో ఇప్పుడు తాము సీట్లు గెల్చుకోవడంపై కన్నా కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చూడటం పైనే దృష్టి సారిస్తున్నారు.

మారిన రాజకీయ పరిణామాలు ఒక విధంగా కేసీఆర్ కు అనుకూలంగా బీజేపీ వ్యవహరించేటట్లు చేస్తున్నది. మొన్నటి వరకు కేసీఆర్, కేటీఆర్, కవితలను జైళ్లకు పంపిస్తామని; వారికోసం జైళ్లలో గదులు కూడా సిద్ధంగా ఉన్నాయని అంటూ మాట్లాడుతూ వస్తున్న బండి సంజయ్ ఇప్పుడు పూర్తిగా స్వరం మార్చేశారు. మొన్నటి వరకు ధరణి వంటి కేసీఆర్ పథకాలపై నిప్పులు కురిపిస్తూ వస్తున్న ఆయన బీజేపీ అధికారంలోకి వచ్చినా వాటిని కొనసాగిస్తామని చెప్పడం గమనార్హం.

ఈ పరిణామాలతో కేసీఆర్ ను ఓడించాలంటే తమ పార్టీలో చేరమని కాంగ్రెస్ నేతలు ఈటెల వంటి నేతలపై వత్తిడి తెస్తున్నారు. బీజేపీలో చేరమని అడిగితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి వారు తనకే `రివర్స్ కౌన్సిలింగ్’ చేశారని ఈటెల గత నెలలో చెప్పడం గమనార్హం. బీజేపీలో అవమానాలతో కొనసాగాలా? లేదా కాంగ్రెస్ ఆహ్వానం అందుకోవాలా? అనే సంకట పరిస్థితులలో ఈటెల వంటి నాయకులు ఉన్నట్లు స్పష్టం అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles