ఈటెల, కోమటిరెడ్డి బండి సంజయ్ సంగతి తేల్చుకుంటారా!

Wednesday, December 18, 2024

కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీలో ఇతర పార్టీల నుండి ఎవ్వరూ చేరే పరిస్థితి లేకపోవగా, ఇదివరలో ఇతర పార్టీల నుండి చేరిన వారిలో ఎవ్వరు ఉంటారు, మరెవ్వరు వెడతారో తెలియని సందిగ్ధత నెలకొంది. ముఖ్యంగా మంచి జోష్ లో ఉన్న కాంగ్రెస్ బిఆర్ఎస్ తో పాటు బీజేపీలోని పలువురు నాయకులకు గాలం వేస్తున్నది.

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే గతంలో కాంగ్రెస్ లో నాయకులుగా ఉంది, ఇప్పుడు బిజెపిలో ఉన్న డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారిని తిరిగి కాంగ్రెస్ లోకి రమ్మనమని బహిరంగంగా ఆహ్వానించారు. వారితో పాటు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను కూడా కాంగ్రెస్ లో చేరమని ఆహ్వానించారు.

అయితే, గత పక్షం రోజులుగా ఈటెల, కోమటిరెడ్డి మౌనంగా ఉండటం, బిజెపి కార్యక్రమాలకు దూరంగా ఉండటం, వారిద్దరూ కాంగ్రెస్ లో చేరబోతున్నారని వార్తలు వస్తున్నా మౌనంగా ఉండడంతో వారిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారిద్దరూ రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహార తీరుతెన్నులు పట్ల ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది.

పైగా, పార్టీలో చేరినప్పుడే రాష్త్ర స్థాయిలో కీలక పదవి ఇస్తామని చెప్పి, ఇప్పటివరకు నోము మెదపక పోవడం పట్ల ఈటెల అసమ్మతిగా ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మతో పాటు మరికొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు ఆయనను కొంచెం సహనం వహించమని, ఆయనకు తగిన పదవి వస్తుందని భరోసా ఇస్తున్నారని తెలుస్తున్నది.

అయితే, వారిద్దరూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా అంటున్నప్పటికీ ఎందుకు ఉన్నారో తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా ‘‘ఎవరి పార్టీ, ఎవరు మారుతారనేది వాళ్ల రాజకీయ ఆలోచనలకు అనుగుణంగానే ఉంటుంది. మునిగిపోయే నావలోకి వెళ్తామనే వాళ్లను మేం ఎవ్వరం ఆపబోం’’ అని బండి సంజయ్ అవమానకరంగా మాట్లాడటంతో వారిద్దరూ రగిలిపోతున్నట్లు తెలుస్తున్నది.

ఆదివారం నాగర్ కర్నూల్ లో బహిరంగసభలో ప్రసంగించేందుకు పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా వస్తున్న దృష్ట్యా, ఆ ముందురోజు ఢిల్లీకి రమ్మనమని వారిద్దరికీ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నుండి పిలుపిరావడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. వారిద్దరి పార్టీలో కొనసాగే విషయం గురించి స్పష్టతకు ఢిల్ల్లీకి పిలిచినట్లు తెలుస్తున్నది. అయితే, బండి సంజయ్ విషయం ఏదో ఒకటి తేల్చాలని కేంద్ర నాయకత్వంకు స్పష్టం చేయాలని వారిద్దరూ పట్టుదలగా ఉన్నట్లు చెబుతున్నారు.

బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణాలో ఎన్నికలను ఎదుర్కోవడం బిజెపికి సాధ్యం కాదని వారిద్దరితో పాటు మరికొందరు నేతలు గత నెలలోనే ఢిల్లీలో పార్టీ అగ్రనాయకులు స్పష్టం చేశారు. ఆ తర్వాత సంజయ్ ను అధ్యక్షునిగా మార్చబోతున్నారనే వార్తలు రాగా, కొందరు కేంద్ర నాయకులతో అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని మీడియాకు సంజయ్ చెప్పించారు.

 మరోవంక, తన తమ్ముడిని తిరిగి కాంగ్రెస్ లో రమ్మనమని కోరుతున్నామని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనపై కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి నుండి ఎటువంటి స్పందన లేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles