సోదర బీసీ నేత ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా బీజేపీలో కుట్ర జరుగుతున్నట్లు గ్రహించి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనకు మద్దతుగా రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఈటెలకు ఎటువంటి పదవి ఇవ్వవద్దంటూ గత నెల తన ఇంటి వద్ద ఇతర పార్టీల నుండి చేరిన నేతలతో భేటీ ఏర్పాటు చేసి కలకలం సృష్టించిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని దారిలోకి తెచ్చేందుకు పూనుకున్నారు.
ఈటెలను పరోక్షంగా ఉద్దేశిస్తూ తెలంగాణ బీజేపీలోని `దున్నపోతుల’కు ట్రీట్‌మెంట్ అవసరమంటూ ట్వీట్ చేసి దుమారం సృష్టించిన రెండు రోజులకే ఈటెల రాజేందర్ ను జితేందర్ వద్దకు తీసుకెళ్లి, ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదర్చడంలో దత్తాత్రేయ కీలక భూమిక వహించారు. వారు ముగ్గురు విందు సమావేశం జరిపారు.
ఆ తర్వాత ఈటల రాజేందర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈటలకు కీలక పదవి ఇస్ స్వాగతిస్తానని కూడా ప్రకటించారు. ఈటలతో కలిసి పదేళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేశానని చెబుతూ ఆర్థికమంత్రిగా ఢిల్లీ వచ్చినప్పుడు ఈటల తన ఇంట్లోనే ఉండేవారని అంటూ గుర్తుచేసుకున్నారు.
హుజూరాబాద్‌లో ఈటల గెలుపు కోసం తాను కృషి చేశానని పేర్కొంటూ ఈటలకు అదనపు బాధ్యతలు ఇస్తే పార్టీ బలోపేతం కోసం మంచిదే అని చెప్పడం గమనార్హం. ఈటెలకు వ్యతిరేకంగా, బండి సంజయ్ కు మద్దతుగా మరో భేటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న సమయంలో దత్తాత్రేయ రంగప్రవేశం చేసినట్లు తెలుస్తున్నది.
కిషన్ రెడ్డి వంటి నేతల కుట్రపూరిత రాజకీయాలకు బీజేపీ నేతలు తమలో తాము కల్పించుకుంటూ పలచపడవద్దని ఈ సందర్భంగా దత్తాత్రేయ సున్నితంగా వారించినట్లు చెబుతున్నారు. కేంద్ర మంత్రివర్గం నుండి తనను తొలగించడంలో, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ సీట్ 2019లో తిరిగి తనకు దక్కకుండా హైజాక్ చేయడం వాటిని వాటిల్లో కిషన్ రెడ్డి ఎత్తుగడలను గుర్తు చేశారని చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో రాష్ట్ర బీజేపీ అంతర్గత కుమ్ములాటలతో తలమునకలై ఉండడంతో కాంగ్రెస్ పుంజుకొంటుండటం బిజెపి నేతలకు ఆందోళన కలిగిస్తున్నది. అయితే, మొదటి నుండి తెలంగాణ బీజేపీలో `మాస్ లీడర్’ అంటూ ఎవ్వరూ లేరు. కిషన్ రెడ్డి వంటి వారు సుదీర్ఘకాలం రాష్త్ర అధ్యక్షునిగా ఉన్నప్పటికీ ఎక్కువగా మీడియా దృష్టి ఆకట్టుకొనే కార్యక్రమాలకే పరిమితం అయ్యేవారు.
బండి సంజయ్ సహితం నిత్యం మీడియాలో ఏవిధంగా కనిపించాలనే తపనతప్ప క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణ వ్యవహారాలను పట్టించుకోలేదు. ఇదే సమయంలో సంస్థాగత కార్యదర్శి తెలంగాణాలో లేకపోవడంతో పార్టీ వ్యవస్థ అస్తవ్యవస్థగా మారింది. ఈటెల రాజేందర్ వంటి ఉద్యమాలలో ఆరితేరిన వారు నాయకత్వం వహిస్తే నాయకుల వద్ద భజనలు చేస్తూ పదవులు పొందుతున్న తమకు కాలం చెల్లుతుందని చాలామంది భయపడుతున్నారు.
వ్యూహాత్మకంగా గత నాలుగేళ్లుగా తెలంగాణాలో పార్టీ వ్యవహారాలకు తనను దూరంగా నెట్టివేసిన వారి ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు దత్తాత్రేయ ఇప్పుడు రంగంలోకి దిగినట్లు కనిపిస్తున్నది.