ఇప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని కేసీఆర్ తొందర పడుతున్నారా!

Monday, September 16, 2024

దేశంలోనే  మరే రాజకీయ పార్టీకి లేని విధంగా అత్యాధునిక సాంకేతిక హంగులతో ఏర్పాటుచేస్తున్న `భారత్‌ భవన్‌’ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్ కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హడావుడిగా సోమవారం శంకుస్థాపన చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

రూ 500 కోట్లకు పైగా విలువైన ఈ 11 ఎకరాల స్థలాన్ని కోకాపేటలో పార్టీ శిక్షణ కార్యక్రమాలకు కావాలని దరఖాస్తు చేసుకోవడం, ఆఘమేఘాల మీద మంత్రివర్గ సమావేశం జరిపి అనుమతి ఇవ్వడం, వెంటనే శంకుస్థాపన జరపడం — ఇవ్వన్నీ నెలరోజుల లోపుగానే జరిగిపోయాయి.

బహుశా కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఇంత జెట్ స్పీడ్ లో మరే పని జరిగి ఉండదు. ఒక రాజకీయ పార్టీ కోసం 11 ఎకరాలలో 15 అంతస్థుల భవనం నిర్మాణానికి ఇంతటి హడావుడి ప్రభుత్వం చేయడం బహుశా మరే రాష్ట్రంలో జరిగి ఉండదు. అసలు బిఆర్ఎస్ నిర్వహించే పార్టీ సమావేశాలకు, శిక్షణా కార్యక్రమాలకు ఇంతటి భారీ నిర్మాణాలు అవసరమా అనే ప్రశ్న తలెత్తుతుంది. రాజకీయ పార్టీని పెట్టి రెండు దశాబ్దాలు దాటినా ఇప్పటి వరకు పూర్థిస్థాయిగా సంస్థాగత ప్రక్రియలు క్రమం జరపకుండా జరపడం లేదు.

అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లయినా ఇప్పటి వరకు పార్టీ శ్రేణులకు ఒక్క శిక్షణా కార్యక్రమం జరిపిన దాఖలా లేదు. హైదరాబాద్ నగరంలో అన్ని రాజకీయ పార్టీలకన్నా పెద్ద భవనం `తెలంగాణ భవన్’ ఉన్నప్పటికీ అక్కడ నిత్యం రాజకీయ కార్యక్రమాలు జరుగుతున్న దాఖలాలు లేవు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అక్కడకు సమీపంలోనే ముడుపులు అందజేసినట్లు తీహార్ జైలులో ఉన్న  సుఖేష్ చంద్రశేఖర్ చేసిన ఆరోపణ గమనిస్తే దానిని ఎందుకు ఉపయోగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

వేల కోట్ల రుపాయల విలువైన భవనాలు, ఆస్తులు ఇప్పటికే బిఆర్ఎస్ కు ఉన్నాయి. మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా అందుకు పార్టీని సమాయత్తం చేసుకోవడం పట్ల దృష్టి పెట్టకుకండా ఈ భవనంపై హడావుడి చేయడం గమనిస్తే అధికారం చివరి రోజులకు చేరుకున్నామని కేసీఆర్ ఆందోళన చెందుతున్న్నారా? అనే ప్రశ్నలు బిఆర్ఎస్ నేతలలోనే వస్తున్నాయి.

అందుకనే అధికారంలో ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలనుకొంటు సుమారు రూ 2,000 కోట్ల విలువైన ఈ భవనాన్ని నిర్మించే పనిలో ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. ఆ తర్వాత దానిని కుటుంభం ఆస్తిగా మార్చుకొనే అవకాశాలు లేకపోలేదు.

బిఆర్ఎస్ ను జాతీయ పార్టీగా ప్రకటించినా ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా చెప్పుకోదగిన బలమైన ప్రాతిపదికను ఏర్పర్చుకోలేక పోయింది. మహారాష్త్రపై తప్పా ఇతర రాష్ట్రాలపై అసలు దృష్టి సారిస్తున్న దాఖలాలు లేవు. అయినా, ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని, వివిధ రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.

పార్టీ అధికారంలో ఉన్నప్పుడే స్థిరాస్తులను ఏర్పాటు చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనా `భారత్ భవన్’ కోసం కేసీఆర్ చేస్తున్న హడావుడి గమనిస్తే అధికారంలో ఉండగానే చక్కబెట్టుకోవాలనే ఆతృత స్పష్టం అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles