ఏపీలో అధికార వైసీపీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకత్వం పట్ల ధిక్కార ధోరణులు వ్యక్తం చేస్తుండడంతో ప్రతిపక్షం టిడిపి నేతలలో సంబరాలు కనిపిస్తున్నాయి. పైగా, కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి వారు తాము వచ్చే ఎన్నికలలో టిడిపి అభ్యర్థులుగా పోటీ చేయబోతున్నామని చెబుతూవుంటే తమ పార్టీలో చేరినట్లే అని సంతోష పడుతున్నారు.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కారణాలు ఏవైనప్పటికీ ఈ విధంగా ఇతర పార్టీల నుండి వచ్చినవారికి పెద్ద పీటవేయడం ద్వారా సొంత పార్టీలో దశాబ్దాలుగా ప్రజలలో పనిచేస్తున్న నాయకులను విస్మరిస్తూ రావడంతో గత ఎన్నికలలో భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. తిరిగి ఇప్పుడు కూడా వైసీపీలో తిరిగి తమకు సీట్ రాదనుకొని నిర్ధారణకు వచ్చిన తర్వాత ధిక్కార ధోరణి ఆవలంభిస్తున్న నేతలను చూసి టిడిపి వారు మురిసిపోతుండడం ప్రమాదకర ధోరణులను వెల్లడి చేస్తుంది.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖచ్చితంగా చెబుతూ వస్తున్నారు. వారు మంత్రులైనా, ఎంత పెద్ద నాయకులైనా తిరిగి గెలుస్తారు అనుకొంటేనే వచ్చే ఎన్నికలలో సీట్లు ఇస్తామని, లేని పక్షంలో ఇవ్వనని తేల్చి చెబుతున్నారు. అంతేకాదు, సమీక్ష అసమావేశాలలో ఎవ్వరు వెనుకబడి ఉన్నారో పేర్లతో సహా ముఖంమీదనే చెబుతున్నారు.
ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వసంత కృష ప్రసాద్ … వంటి వారంతా తమకు అవసరం లేదని `స్క్రాప్’ (చెత్త) సరుకుగా జగన్ భావిస్తున్నవారిని టిడిపి వారు తమకు పోటీకి మనుష్యులే లేన్నట్లు దగ్గరకు తీసే ప్రయత్నం చేయడం అంటే, అవకాశవాదులు పెద్దపీట వేయడమే కాగలదు. అధికారంలో ఉన్నప్పుడు అవసరం లేకపోయినప్పటికీ వైసిపి నుండి 23 ఎమ్యెల్యేలను ఫిరాయించేటలంటూ చేసి, వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చి సొంతపార్టీ వారికి మనస్థాపం కలిగించారు.
అయితే, వారందరిని గత ఎన్నికలలో ప్రజలు తిరస్కరించారు. వారి కారణంగా మరికొన్ని నియోజకవర్గాలలో టిడిపి ఓడిపోవల్సి వచ్చింది. వారంతా ఇప్పుడు రాజకీయంగా దాదాపు తెరమరుగై ఉన్నారు. అటువంటి `స్క్రాప్’ కోసం టిడిపి రాజకీయంగా భారీ మూల్యం చెల్లించవలసి రావడం అలవాటా?
జగన్ వ్యూహాత్మకంగా, ఏ నియోజకవర్గంలో ఎవ్వరు తోకముడిచినా, ధిక్కార ధోరణి ప్రదర్శించినా వెంటనే మరో నాయకుడిని అక్కడ ఇన్ ఛార్జ్ గా చేసి, నూతన నాయకత్వంకు అవకాశం ఇస్తున్నారు. కానీ ఇటువంటి విషయంలో టిడిపి వెనుకబడి పోతున్నది. ఇతర పార్టీల నుండి వచ్చినవారికి పెద్ద పీట వేస్తుండటంతో తొందరపడుతున్నా, పార్టీకి బలమున్న పలు నియోజకవర్గాలలో ఎవ్వరికీ నాయకత్వం ఇవ్వాలో తేల్చడంలో తికమక పడుతూ, పార్టీ శ్రేణులను గందరగోళంకు గురి చేస్తున్నారు.
దాదాపు ప్రతి జిల్లాలో 20 ఏళ్లుగా ఉన్న నాయకులే తప్పా కొత్త నాయకత్వాన్నీ తీసుకురావడంలో సందేహిస్తున్నారు. ఉదాహరణకు నెల్లూరు జిల్లాలో ఎన్నిసాలురు ఓటమి చెడినా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వమే దిక్కవుతున్నది. ఆయనకు తోడు బీదం రవిచంద్ర. వీరిద్దరూ మరొకరిని అక్కడ ఎదగనివ్వరు. క్షేత్రస్థాయిలో ఏమాత్రం అనుభవం లేని మాజీ మంత్రి పి నారాయణ పెత్తనం మరోవైపు.
ఇటువంటి పరిస్థితులే చాలా జిల్లాలో ఉన్నాయి. యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు… వంటి అనేకమంది నాయకులు పార్టీకి భారంగా మారారు. కొత్త నాయకులు ఎవ్వరు ఎదగనీయకుండా అడ్డుకొంటున్నారు. దానితో వైసిపి లో జగన్ మాదిరిగా ఎవ్వరు తోకాడించినా వెంటనే కొత్త నాయకుడిని తీసుకు రాలేకపోతున్నారు.