ఇడుపులపాయకు సోనియా, రాహుల్ లను ఆహ్వానం 

Sunday, December 22, 2024

వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ విషయమై ప్రత్యక్ష రాజకీయాలలో ఏనాడూ కనిపించని ఆమె భర్త బ్రదర్ అనిల్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెపి వేణుగోపాల్ అనిల్ కు ఫోన్ చేసి ఈ విషయమై మాట్లాడినట్లు చెబుతున్నారు.

ఇదివరకే షర్మిల స్వయంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను రెండు సార్లు కలిసింది. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా మొదటిసారిగా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలపడం ద్వారా ఆ పార్టీలో చేరబోతున్న సంకేతాన్ని ఆమె ఇచ్చారు. ఇంకా లాంఛనాలు ఉన్నట్లు చెబుతున్నారు.

ఆమె ఉద్దేశ్యం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసి, గెలుపొందటామే అయినప్పటికీ కాంగ్రెస్ పెద్దల ఉద్దేశ్యం వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను అస్త్రంగా ప్రయోగించి ప్రస్తుతం పార్టీ ఉనికి ప్రశ్నార్ధకంగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో బలం పెంచుకోవాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచనలు చేస్తున్నారు.

జులై 8న దిగవంత నేత డా. వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదినం సందర్భంగా ఇడుపులపాయలో ఆయనకు నివాళులు అర్పించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను షర్మిలా ఆహ్వానించారని చెబుతున్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనుకున్న తండ్రి రాజశేఖరరెడ్డి ఆశయం నెరవేర్చేందుకు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు షర్మిలా సర్దిచెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే, ఆంధ్ర ప్రదేశ్ లో ఆమె అన్న వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కోసం ప్రచారం చేసినట్లు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుండటం టీడీపీ వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. వాస్తవానికి ఆమె కాంగ్రెస్ కు ప్రచారం చేస్తే జగన్ కన్నా ఆయనను ఓడించాలి అనుకొంటున్న టిడిపికే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

యదార్ధానికి ఏపీలో ప్రచారం చేసి, కాంగ్రెస్ కు పెద్ద సంఖ్యలో ఓటర్లను ఆకర్షించే సామర్థ్యం షర్మిలాకు ఉన్నట్లు ఎవ్వరూ చెప్పలేరు. తెలంగాణాలో సహితం సొంతంగా పోటీచేసే గెలవగలమనే నమ్మకం లేకనే ఆమె కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు స్పష్టం అవుతుంది. కాంగ్రెస్ లో చేరగానే ఆమెకు అసెంబ్లీ సీట్ ఇవ్వడం మినహా ఆమెకు చెప్పుకోదగిన పదవులు ఇస్తారని కూడా ఆశింపలేము.

వైఎస్ జగన్ కుటుంభంలో ఏ విషయంలో, ఏమేరకు విబేధాలు ఉన్నాయో ఎవ్వరికీ స్పష్టంగా తెలియదు. అయితే పరస్పరం ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకొంటున్న దాఖలాలు లేవు. వైఎస్ విజయమ్మ కొడుకుకు దూరంగా కుమార్తెతో కలిసి ఉంటున్నా ఎప్పుడూ కొడుకుకు వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడలేదు. ఆమె ఉండగా, జగన్ కు రాజకీయంగా గాని, వ్యక్తిగతంగా గాని హాని కలిగించే చర్యలకు షర్మిలా పాల్పడుతోందని భావింపలేము.

ఏపీలో షర్మిల కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో కొద్దో, గొప్పో చీలిక తీసుకు రావడం ద్వారా పరోక్షంగా అన్నకు సహాయం చేసినట్లు కాగలదు. ఆమె ప్రచారం కారణంగా టిడిపి అభ్యర్థులు కొద్దిపాటి తేడాతో ఓటమి చెందితే వైసీపీకి ప్రయోజనంగా మారే అవకాశం ఉంటుంది.

షర్మిలా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం కావించడంలో వైఎస్ రాజశేఖరరెడ్డికి `ఆత్మబంధువు’గా చెప్పుకొనే డా.కెవిపి రామచంద్రరావు కీలక భూమిక వహిస్తుండడం గమనార్హం. ఆయన కూడా వైఎస్ జగన్ కు దూరంగా ఉంటున్నప్పటికీ ఎప్పుడూ జగన్ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరింపలేదు. అందుకనే షర్మిలా కాంగ్రెస్ లో చేరడం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జగన్ తిరిగి ఏపీలో గెలుపొందేందుకు ఆమె తనవంతు కృషి చేస్తున్నట్లే అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles