ఇక చంద్రబాబు మకాం అమరావతిలోనే!

Sunday, December 22, 2024

ముందస్తు ఎన్నికలు ఖాయమన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న తరుణంలో  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వేగం మరింతగా పెంచారు. ఇక పూర్తిస్థాయిలో అమరావతిలో మకాం వేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఏపి తో పాటు తెలంగాణలో కూడా ఇక్కడి నుండే రాజకీయంగా దూకుడు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్దంచేస్తున్నారు.

అమరావతిలోనే ఉండి పార్టీ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకు వారంలో ఐదు రోజులు మాత్రమే చంద్రబాబు అమరావతి కేంద్రంగా అందుబాటులో ఉంటున్నారు. సోమవారం నుండి శుక్రవారం వరకు నేతలకు అందుబాటులో ఉంటూనే మరో వైపు నియోజకవర్గాల వారీగా సమీక్షలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. 

అయితే ఇప్పుడు ఎన్నికల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఇకపై నిత్యం నేతలకు అందుబాటులో ఉండాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు వచ్చినా లేదా ముందస్తుగా జరిగినా సిద్ధంగా ఉండేలా చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 

దీనిలో భాగంగా ఇప్పుడు పార్టీ కార్యకలాపాలపై చంద్రబాబు నిత్యం పర్యవేక్షణ చేసేలా సన్నాహాలు చేసుకుంటున్నారు.  పార్టీ నేతలు, శ్రేణులను ఎన్నికలకు సన్నద్దం చేసేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నారు. త్వరలో నియోజకవర్గాల సమీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కీలకమైన నేతలను వ్యక్తిగతంగా భేటి అవ్వడం తో పాటు, నియోజక వర్గాల లోని ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఇప్పటివరకు టె-లీ కాన్ఫరెన్స్‌ ల ద్వారా దిశానిర్దేశం చేస్తున్న ఆయన ఇకపై నేతలతో స్వయంగా మాట్లాడి స్ధానిక పరిస్థితులను తెలుసుకోనున్నారు. మరోవంక, నారా లోకేష్ `యువగళం’ పాదయాత్ర ద్వారా నిత్యం ప్రజలతోనే ఉంటున్నారు.

ఇదే సమయంలో మహానాడు వేదికగా ప్రకటించిన భవిష్యత్తుకు గ్యారంటీ మినీ మేనిఫెస్టోపై నేతల బస్సు యాత్రలు జరుగుతున్నాయి. మొత్తం మూడు జోన్‌లుగా విభజించి ఐదు బస్సుల్లో ఈ యాత్రలను నిర్వహిస్తున్నారు.ఈ నేపధ్యంలో తానుకూడా ఈ యాత్రల్లో పాలుపంచుకోవాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 

నెలలో రెండు జిల్లాల పర్యటనకు చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా నిత్యం ప్రజల్లో, క్యాడర్‌ లో వుంటూ ఎన్నికల సన్నాహాలను ముమ్మరం కావించే కృషి చేపట్టారు. ఇదే సమయంలో నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ ల నియామకం పూర్తి చేస్తున్నారు. మరోవంక, అభ్యర్థుల ఎంపిక పక్రియను కూడా వేగవంతం చేస్తున్నారు. దసరా నాటికి సగం మందికి పైగా అభ్యర్థులను ప్రకటించే యోచనలో ఉన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles