ఇక చంద్రబాబు అరెస్ట్ కు జగన్ ముందడుగు!

Wednesday, January 22, 2025

గతంలోని టీడీపీ పాలనలో జరిగిన్నట్లు చెబుతున్న అక్రమాలపై దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ పై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టే ను సుప్రీంకోర్టు కొట్టేయడంతో ఇక ఏదో ఒక స్కాం లో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నట్లు ఆ పార్టీ నేతల మాటలే స్పష్టం చేస్తున్నాయి.

సిట్ దర్యాప్తులో చంద్రబాబు అరెస్ట్ కావడం తప్పదని మంత్రి ఆర్ కె రోజా చెప్పగా, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడైనా అరెస్టు కావొచ్చని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా ముందు వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని సజ్జల ఆరోపించారు. అమరావతి పేరు చెప్పి దోచుకున్నారని అంటూ ఈ కేసులో కచ్చితంగా అరెస్టులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

అమరావతి సహా చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ఏపీ ప్రభుత్వం సిట్ వేసింది. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై సిట్ ఏర్పాటు చేసినట్లు సజ్జల చెప్పారు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో సిట్ విచారణ ఇంకా సులభతరం అవుతుందని స్పష్టం చేశారు. అమరావతి భూముల స్కాంలో నిజాలు బయట పెట్టడానికి మార్గం సుగుమం అయిందని తెలిపారు.

అమరావతి, ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంట్ కేసులన్నింటిలో విచారణ జరుగుతోందని చెబుతూ ఈ కేసుల్లో అన్ని విషయాలు త్వరలో బయటకు వస్తాయని సజ్జల స్పష్టం చేశారు. అమరావతి ఒక కేస్ స్టడీ అన్న సజ్జల ఎక్కడ టచ్ చేసినా అవినీతే అని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తే వేధింపులకు పాల్పడుతున్నారని, అరెస్టు చేయకపోతే ధైర్యంలేదని అంటున్నారని టీడీపీపై సజ్జల మండిపడ్డారు.

 అయితే, నేతలపై పెట్టాల్సిన కేసులన్నీ పెట్టిన తర్వాత కొత్తగా వైసీపీ ప్రభుత్వం సిట్‌ వేసినంత మాత్రాన ఏమవుతుందని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ‘ఇప్పటికే స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఫైబర్‌ నెట్‌, అస్సైన్డ్‌ భూములు, అవుటర్‌ రింగ్‌రోడ్డు, మార్గదర్శి వంటి అనేక అంశాలపై కేసులు పెట్టేశారు. కొత్తగా సిట్‌ వేసి ఏం చేస్తారు?” అని నిలదీశారు.

సిట్‌ లేకపోయినా ఇతర ఏజెన్సీలతో కేసులు నమోదు చేసారని చెబుతూ  ఈ రాష్ట్రంలో మరెవరూ వ్యాపారం చేయకూడదన్నట్లు టీడీపీ నేతలపై కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. చిట్‌ఫండ్‌ కంపెనీ నడుపుతున్న ఆదిరెడ్డి అప్పారావు, వాసుపై కేసు పెట్టారని చెబుతూ మీ పార్టీ వారిపై ఎవరిపై అయినా కేసులు పెట్టారా? అని ఆయన సీఎం జగన్ ను నిలదీశారు.

“జగనే పెద్ద అవినీతిపరుడు. ఆయన నన్ను అనేది ఏమిటి? నువ్వు రూ.43వేల కోట్ల ప్రజాధనం దోచావని సీబీఐ కేసులు పెట్టింది. నీ షెల్‌ కంపెనీలకు డబ్బులు వచ్చాయి. మా పార్టీలో ఎవరికైనా వచ్చాయా? నీ టీవీ, పేపర్లు, సిమెంట్‌ కంపెనీలకు డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయి?” అంటూ ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తారు.

ఇలా ఉండగా, చంద్రబాబు, నారా లోకేష్ లలో ఒకరిని ఎలాగైనా అరెస్ట్ చేయాలని ప్రత్యేకంగా ఒక ఐజి స్థాయి పోలీస్ అధికారిని అధికారమలోకి రాగానే సీఎం జగన్ నియమించారు. అయితే ఎటువంటి పురోగతి సాధించక పోవడం, ఒక్క కేసు కూడా ముందుకు వెళ్లకపోతూ ఉండడంతో తరచూ ఆ అధికారిని పిలిచి అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles