ఆ 12 మంది ఎమ్యెల్యేలకు తెలంగాణ కాంగ్రెస్ లో `నో ఎంట్రీ’

Tuesday, November 5, 2024

కర్ణాటక ఎన్నికల ఫలితాలతో మంచి జోష్ లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ లో ఇతర పార్టీల నుండి చేరికలు ఊపందుకొంటున్నాయి. పలువురు మాజీ కాంగ్రెస్ నేతలతో పాటు బిఆర్ఎస్, బిజెపిలలో అసంతృప్తిగా ఉన్న నేతలను సహితం చేర్చుకోవడానికి కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇదివరకు కాంగ్రెస్ లో క్రియాశీలకంగా ఉంది వివిధ కారణాలతో బిఆర్ఎస్, బీజేపీలలో చేరిన నేతలను తిరిగి `ఘర్‌వాపస్‌’గా పార్టీలోకి రమ్మనమని రాహుల్ గాంధీ స్వయంగా ఖమ్మం బహిరంగసభలో ఆహ్వానించారు.

ఇప్పటికే కొద్దిమంది నేతలు కాంగ్రెస్ లో చేరగా, మరో కొద్దిమంది చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. ముఖ్యంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా పలువురితో సంప్రదింపులు జరుపుతూ కాంగ్రెస్ లో రమ్మనమని ఆహ్వానిస్తున్నారు. అయితే ఓ 12 మందికి మాత్రం తిరిగి కాంగ్రెస్ లోకి ప్రవేశం లేదని మాత్రం స్పష్టం చేస్తున్నారు. వారిని ఎటువంటి పరిస్థితులలో పార్టీలో చేర్చుకోమని తేల్చి చెబుతున్నారు.

 2018 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులుగా 19 మంది ఎన్నికయ్యారు. అయితే వారిలో 12 మంది బిఆర్ఎస్ లో చేరడమే కాకుండా, సబితా ఇంద్రారెడ్డి వంటి వారు మంత్రిపదవులు కూడా చేపట్టారు. ఈ 12 మందిలో పలువురికి తిరిగి బిఆర్ఎస్ సీట్ ఇవ్వడంపై అపనమ్మకాలు తలెత్తుతున్నాయి. సీట్ ఇచ్చినా నియోజకవర్గంలో బిఆర్ఎస్ వర్గాల నుండే వ్యతిరేకత ఎదురవుతూ ఉండడంతో తిరిగి గెలిచే అవకాశాలు కనిపించడం లేదు.

అందుకనే వారిలో కొందరు తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే వారెవ్వరిని చేర్చుకోరాదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాలలో వ్యక్తం అవుతుంది. అంతేకాకుండా, కాంగ్రెస్ నుండి బలమైన అభ్యర్థులను నిలబెట్టి వారందరిని వచ్చే ఎన్నికలలో ఓడించాలనే పట్టుదల కూడా కనిపిస్తున్నది. అందుకోసం కాంగ్రెస్ లో బలమైన అభ్యర్థులు లేని పక్షంలో బిఆర్ఎస్ లో వారి వ్యతిరేకులను చేర్చుకొని సీట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

 కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లో చేరిన వారిలో మంత్రి సబితా ఇంద్రారెడ్ డి(మహేశ్వరం), సుదీర్‌రెడ్డి ( ఎల్బీనగర్‌), పైలెట్‌ రోహిత్‌ రెడ్డి (తాండూరు), హర్షవర్దన్‌రెడ్డి ( కొల్లాపూర్‌), చిరుమర్తి లింగయ్య (నకిరెకల్‌), సురేందర్‌రెడ్డి (ఎల్లారెడ్డి), కందాల ఉపేందర్‌రెడ్డి (పాలేరు), వనమా వెంకటేశ్వర్లు (కొత్తగూడెం) హరి ప్రియా నాయక్‌ (ఇల్లెందు), రేగ కాంతరావు (పినపాక), గండ్ర వెంకట రమణారెడ్డి (భూపాలపల్లి), ఆత్రం సక్కు (ఆసిపాబాద్‌) ఉన్నారు

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ను వదిలారని, ఇలాంటి వారిని చేర్చుకోవడం కంటే ఆయా నియోజక వర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులపై ఫోకస్‌ పెట్టాలనే ఆలోచనతో కాంగ్రెస్‌ నేతలున్నారు. ఈ నియోజక వర్గాల్లో గతంలో పోటీ బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన వారిలో బలమైన నాయకులను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. 

అందులో భాగంగానే కొల్లాపూర్‌ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్షారావును చేర్చుకొని ఈ ఎన్నికల్లో పోటికి దింపాలనే ఆలోచన చేస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. రవీందర్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి చేర్చుకుని ఎల్లారెడ్డి నుంచి బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే అంశంపై ఆలోచన చేస్తున్నారు. 

నకిరెకల్‌లో చిరుమర్తి లింగయ్యకు పోటీగా బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీరేశం చేరిక విషయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ధీటుగా బలమైన అభ్యర్థిగా సబిత చేతిలో ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్థారెడ్డి కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles