ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మరోసారి ఢిల్లీ పర్యటన పూర్తిచేశారు. ఆయన గత నాలుగేళ్లలో సాగించిన అనేకానేక ఢిల్లీ యాత్రలకు, ప్రస్తుత ఢిల్లీ యాత్రకు వ్యత్యాసం ఉంది. ఈసారి ఆయన కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి, ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఒక అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ పర్యటన ముఖ్యమంత్రి జగన్ కు అవమానంగా, ఆత్మాభిమానానికి దెబ్బగా అనిపించలేదా అనే ప్రశ్నలు పలువర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
కేంద్రంలో మోడీ సర్కారు తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకుంది. అలాగే రాష్ట్రంలో జగన్ నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. మోడీ సర్కారు దేశానికే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కొత్త పార్లమెంటు భవనాన్ని చాలా ఘనంగా నిర్మించింది. ఇందుకేమీ మోడీ సర్కారు తొమ్మిదేళ్ల కాల వ్యవధిని తీసుకోలేదు. పార్లమెంటు భవనానికి 2020 డిసెంబరు 10న మోడీ శంకుస్థాపన చేశారు. ఈ నెల 28న ప్రారంభించారు. కేవలం రెండున్నర సంవత్సరాల కాలావధి పూర్తి కాకముందే ఒక అద్భుతమైన పార్లమెంటు భవనాన్ని నిర్మింపజేశారు.
తెలంగాణ సర్కారు కూడా ఇంచుమించు ఇదే తరహాలో ఇదే స్పీడుతో వ్యవహరించింది. జగన్మోహన్ రెడ్డి ఏపీలో అధికారంలోకి వచ్చేవరకు తెలంగాణ ప్రభుత్వానికి కొత్త సచివాలయం ఎక్కడ నిర్మించుకోవాలనే క్లారిటీ లేదు. జగన్ తాను అధికారంలోకి రాగానే.. విభజన చట్టం ప్రకారం ఇతరత్రా ఆస్తుల పంపకాల సంగతేమీ తేలకపోయినప్పటికీ.. సచివాలయం విషయంలో ఏపీకి ఉన్న సగం హక్కులను తెలంగాణకు ధారాదత్తం చేసేశారు. దరిమిలా.. కొత్త సచివాలయం అక్కడే నిర్మించడానికి కేసీఆర్ సర్కారు పూనుకుంది. కేవలం 28 నెలల్లో తెలంగాణ సచివాలయాన్ని ప్రభుత్వం పూర్తిచేసి.. ఇటీవలే కేసీఆర్ ప్రారంభించారు.
మరి ఏపీలో ఏం జరుగుతోంది. చంద్రబాబునాయుడు తన అయిదేళ్ల పదవీకాలంలో అప్పటికి ఏమాత్రం వనరులు లేకపోయినప్పటికీ, సరైన స్థల వసతులు కూడా లేకపోయినప్పటికీ.. వెలగపూడి సచివాలయాన్ని బ్రహ్మాండంగా నిర్మించారు. అలాగే హైకోర్టు భవనాల్ని కూడా అద్భుతంగా నిర్మించారు. మరి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తన నాలుగేళ్ల పదవీకాలంలో నిర్మాణాత్మకంగా వ్యవహరించిన పని ఒక్కటైనా ఉందా? నా పదవీకాలంలో నేను నిర్మించినది ఇదీ.. రాష్ట్రంపై నా ముద్ర ఇదీ అని చెప్పుకోడానికి జగన్ కు ఒక్కటైనా ఉన్నదా? అనేది పలువురు అడుగుతున్న ప్రశ్న. ఎంతసేపూ బటన్ నొక్కుతున్నా.. బటన్ నొక్కుతున్నా అని ఊదరగొట్టడం తప్ప నిర్దిష్టంగా రాష్ట్రం కోసం జగన్ ఒక్క పనైనా చేశారా? అనేది ప్రజల బాధ. తెలంగాణ సచివాలయం ప్రారంభానికి జగన్ ను పిలవలేదు సరే.. పార్లమెంటు కొత్త భవనం ప్రారంభానికి అతిథిగా వెళ్లినప్పుడు.. నా రాష్ట్రం కోసం నా పాలనలో ఇలాంటిది ఒక్క పనైనా చేయలేకపోయానే అనే బాధ, అవమానం జగన్ కు కలిగి ఉండదా అని పలువురు అనుకుంటున్నారు.
ఆ పర్యటన జగన్ కు అవమానం అనిపించలేదా?
Saturday, January 18, 2025