తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయాల్లో తాను మోనార్క్ ను అన్నట్టుగానే వ్యవహరిస్తుంటారు. తనకు తిరుగులేదనే విశ్వాసం ఆయనకు మెండు. భారాస విస్తృతస్థాయి సమావేశంలో కూడా అదే ధోరణి కనిపించింది. సర్వేలన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి. మనమే గెలవబోతున్నాం. ముందస్తు ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చేది లేదు. షెడ్యూలు ప్రకారం డిసెంబరులోనే జరుగుతాయని కూడా ఆయన చెప్పారు.
ఇవన్నీ ఒక ఎత్తు. అయితే పార్టీని తిరిగి విజయపథం వైపు నడిపించడం గురించి.. పార్టీని ఎలా సన్నద్ధం చేయాలనే విషయంలో, నాయకులకు ఎలా ప్రేరణ ఇవ్వాలనే విషయంలో కేసీఆర్ చేసిన దిశానిర్దేశం.. ప్రత్యేకంగా గమనించదగ్గది. ఎందుకంటే.. సాధారణంగా ప్రతి నాయకుడూ.. ఎన్నికలకు ముందు.. ఇప్పటినుంచి మనవాళ్లంతా నిత్యం ప్రజల్లోనే ఉండాలి, ప్రజలతో మమేకం కావాలి.. వారిలో నమ్మకాన్ని నింపాలి అంటూ హితోపదేశాలు చేయడం మామూలే. కానీ కేసీఆర్ ఎన్నడూ లేని రీతిలో.. ‘‘నియోజకవర్గాల్లో నాయకులు పాదయాత్రలు చేయండి..’’ అంటూ వారికి హితవు చెప్పారు. ఇది ప్రత్యేకమైన సంగతి.
పాదయాత్రలు చేయాలనడం.. కేసీఆర్ తరహా రాజకీయం కాదు. అయితే ఇప్పుడు తెలంగాణ సమాజంలో పాదయాత్రలు చేసి తీరవలసిన అనివార్యతను కేసీఆర్ గుర్తించినట్లుగా కనిపిస్తోంది. పాదయాత్రల దిశగా కేసీఆర్ ను ఆ నలుగురు పురిగొల్పినట్లుగా కనిపిస్తోంది.
తెలంగాణలో బండి సంజయ్ సాగించిన పాదయాత్ర సంచలనంగానే నమోదు అయింది. ఆయన రాష్ట్రవ్యాప్తంగా విడతలు విడతలుగా పాదయాత్ర పూర్తి చేశారు. మంచి స్పందననే రాబట్టారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రస్తుతం సాగుతోంది. నిజానికి ఇది రాహుల్ చేసిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపు. రేవంత్ కూడా తన పాదయాత్రలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెసులో ఇతర నాయకులు కూడా పాదయాత్రలు చేస్తున్నారు. ఇక పోతే వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకురాలు షర్మిల పాదయాత్ర ఉండనే ఉంది. ఆమె చాలాకాలంగా పాదయాత్రలో కేసీఆర్ ను దుమ్మెత్తి పోస్తున్నారు. బీఎస్పీ నాయకుడు ప్రవీణ్ కుమార్ కూడా పాదయాత్రలు సాగిస్తున్నారు.
ఇలా నాలుగు పార్టీలు వారి వారి అవసరాల దృష్ట్యా చేసిన, చేస్తున్న పాదయాత్రలు తెలంగాణ సమాజంలో ఒక కల్చర్ ను తీసుకువచ్చాయి. అన్ని పార్టీల నాయకుల పాదయాత్రల రూపంలో తమ వద్దకు రావడం ప్రజలకు అలవాటు అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలో భారాస నాయకులు మాత్రం పాదయాత్రగా రాకపోతే.. అది ఎంతో కొంత ప్రతికూలం కావొచ్చుననే భయం ఇటువైపు పురిగొల్పినట్టుంది. అందుకే ఆ నలుగురు కలిగించిన భయానికి కేసీఆర్.. తన పార్టీ నాయకులు, శ్రేణులను కూడా పాదయాత్రలు చేయాల్సిందిగా చెబుతున్నట్టు కనిపిస్తోంది.
ఆ నలుగురూ ఆ రకంగా కేసీఆర్‌ను భయపెట్టారా?
Friday, December 27, 2024